రైతులంతా జాగ్రత్త.. రుణ మాఫీ వేళ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరికలు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు రుణ మాఫీ చేసి, సొమ్ము జమ చేస్తున్న సమయంలో.. తెలంగాణ పోలీసు విభాగం కీలక ప్రకటన చేసింది. అనవసరమైన లింకులను క్లిక్ చేయవద్దని రైతులను ఉద్దేశించి, రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో రైతులను అప్రమత్తం చేసింది. రైతులను లక్ష్యంగా చేసుకొని, సైబర్ నేరగాళ్లు దాడులకు పాల్పడే అవకాశం వుందని, ఈ నేపథ్యంలో రైతులంతా జాగ్రత్తగా వుండాలని సూచించింది. అమాయకమైన రైతులను నిలువునా ముంచేందుకు కేటుగాళ్లు ప్లాన్ చేస్తుంటారని, అందుకే అలర్ట్‌గా వుండాలన్నారు.
జూలై 18న రాష్ట్ర వ్యాప్తంగా లక్ష రూపాయల వరకు రైతు రుణాలను మాఫీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగింది. దీనినే అవకాశంగా తీసుకొని, రైతులను మోసం చేయవచ్చని పోలీసులు హెచ్చరించారు. రుణాలు మాఫీ కావాలంటే ఈ లింక్ పై క్లిక్ చేయాలంటూ బ్యాంకుల ప్రొఫైల్ ఫోటో పెట్టుకొని , సందేశాలు పంపిస్తున్నారు. తద్వారా వారి ఖాతాల్లోని డబ్బులను కాజేసే ప్రయత్నం చేస్తుంటారు.
‘రుణమాఫీపై ఫేక్ లింక్‌లు, మెసేజ్‌లు వస్తుంటాయి. బ్యాంకుల లోగోలు పెట్టుకుని మరీ కొందరు కాల్స్, మెసేజెస్ చేస్తుంటారు. వాటిని రైతులెవరూ నమ్మవొద్దు. ఒకవేళ రైతులు ఆ లింక్స్ క్లిక్ చేస్తే మీ ఖాతాల్లోంచి డబ్బులు మాయం అవుతాయి. రుణమాఫీ పేరుతో ఎవరు మెసేజ్ చేసినా.. కాల్ చేసి వివరాలు అడిగినా చెప్పొద్దు’ అని రైతులకు పోలీసులు స్పష్టం చేశారు.