తెలంగాణ పండుగ – బోనాలు

సృష్టి అంతా అమ్మవారిమయమే… ప్రకృతి స్వరూపిణి అయిన ఆ పరమాత్మికను కొలడానికి అనేక మార్గాలు. అందులో బోనాలు ఒకటి. ఇది తెలంగాణాలో అసంఖ్యాక ప్రజలు జరుపుకునే ఆనందోత్సాహాల సంరంభం . దీన్ని తెలంగాణ తెలుగు వారి పండుగగా అభివర్ణిస్తారు. ఈ బోనాల పండుగ ఆషాఢ మాసం, కొన్ని చోట్ల శ్రావణ మాసంలో కూడా నిర్వహిస్తారు. ఎక్కువగా ఆదివారం నాడు జరుపుకుంటారు. అంతేకాదు తెలంగాణాలో ఆషాఢ నవరాత్రులను కూడా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం అంటే వర్షాకాల ప్రారంభ సమయం. వరినాట్లు మొదలయ్యే సమయం. అందుకని ఆ సమయంలో తమ ఊరు, ప్రాంతం, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పాడిపంటలతో అల్లారుతూ ఉండాలని శాకంబరీ నవరాత్రులను, బోనాల పండుగను నిర్వహిస్తారు. ఎంతో ఉత్సాహభరితంగా జరుపుకునే ఈ పండు గను ఈకింద చెప్పినట్లు నిర్వ హించుకుంటారు.

ఘటోత్సవం: ప్రత్యేకమైన కలశంలో అమ్మ వారిని ఆవాహనచేసి, నగరవీధులగుండా ఉరేగింపుగా తీసుకెళతారు. ‘ఘటం’ అంటే ‘కలశం’. అమ్మవారి రూపం కలశం మీద గీయబడుతుంది. ఆ ఘటం అమ్మవారిలాగే అలంకరించబడుతుంది. ఆలయ పూజారి శరీరమంతా పసుపు పూసుకుని ఘటాన్ని మోసుకెళతాడు.సాదారణంగా దీన్ని శుక్రవారం రోజున చేస్తారు.

బోనాలు: శక్తి స్వరూపిణియైన మహంకాళికి భక్తితో సమర్పించే అన్నమే ‘బోనాలు’. ఎవరివారు ఏఏ రకంగా వండి నైవేద్యం పెడతామని మ్రొక్కు కున్నారో, ఆవిధంగా వండి సమర్పించి తమ కృతజ్ఞతను తెలుపుకోవటం ఆచారంగా ఉన్నది. చక్కగా అలంకరించిన ఒకపాత్రలో అన్నాన్ని ఉంచి, వేపాకులతో చుట్టూకట్టి, దానిమీద మూతపెట్టి, మూతమీద పవిత్రంగా దీపం వెలిగించి, తలమీద పెట్టుకునివచ్చి లక్షలాది మంది ఆడవారు వరుసగా అమ్మవారికి భక్తితో బోనం సమర్పించి తమ మ్రొక్కులను తీర్చుకుంటారు.

వేపాకు సమర్పించుట: వేపాకులను పసుపు నీటిలో ముంచి అమ్మవారికి సమర్పించే ఆచారం ముఖ్యమైన క్రియగా భావించబడుతుంది. వర్షాకాలం ప్రారంభమయినప్పుడు సోకే కలరా, మశూచివంటి వ్యాధులను తరిమికొట్టే క్రిమినాశినిగా వేపాకు ఉండటం వల్లనూ, అమ్మవారికి ప్రియమైన వృక్షంగా ఉండటం వల్లనూ వేపాకులను అమ్మవారికి సమర్పించి ఆనందిస్తారు స్త్రీలు.

ఫలహారంబండి: ‘బోనాలు’ జరుపుకునేరోజు భక్తులు తమ ఇళ్ళల్లోనుండి శుభ్రంగా, నియమ నిష్ఠలతో తయారుచేసి తెచ్చిన నైవేద్యాలను బండ్లలో పెట్టి ఆలయానికి ప్రదక్షిణం చేయటాన్నే ‘ఫలహారం బండి’ అనే ఉత్సవంగా జరుపుకుంటారు.

పోతురాజు వీరంగం: అమ్మవారి సోదరుడుగా పోతురాజును భావిస్తారు. బోనాలు పండుగ పదిహేనవరోజు తెలంగాణా ప్రాంతంలోని ప్రతి బస్తీనించీ పోతురాజు అమ్మవారి ఆలయానికి లక్షల సంఖ్యలో వీరధీర విన్యాసాలు ప్రదర్శిస్తూ వరదగా తరలివస్తారు. ఇది బోనాలు పండుగ విశేష ఆకర్షణీయ అంశం.

రంగం: ఇది చివరి రోజున జరిగే ముఖ్య ఘట్టం. బోనాలు నైవేద్యం ఆదివారం జరుగు తుంది. సోమవారం త్లెవారు ఝామున అమ్మవారి సన్నిధికి ఎదురుగా ముఖమంటపంలో ఉన్న మాతంగీశ్వరి ఆలయంలో అమ్మవారికి ఎదురుగా వివాహంకాని ఒక స్త్రీ వచ్చి ఒకమట్టి కుండ మీద నిలబడి భవిష్యవాణి చెబుతుంది. దీనినే ‘రంగం’ అంటారు. దేశ రాజకీయం, వ్యవసాయం, వ్యాధులు, ప్రకృతి వైపరీత్యాలు అన్నిటినీ ఆ రోజు అమ్మవారు ఆ స్త్రీల ద్వారా తెలుపుతుంది.

బలి: రంగం ముగిశాక సోమవారం పోతు రాజులు ప్రొద్దున తొమ్మిది గంటల ప్రాంతంలో వీర తాండవం చేస్తూ మైమరచి భక్తి పారవశ్యంతో ఆలయ ప్రదక్షిణం చేస్తారు. అమ్మవారి సన్నిధికి ఎదురుగా వారు ఆడే నృత్యం, మనను భక్తి పారవశ్యంలో ముంచుతుంది. ఆ సందర్భంలో సొరకాయ, ఎర్ర గుమ్మడికాయ వంటి కూరగాయల్ని పగుల గొట్టి అమ్మవారికి బలి ఇస్తారు.

సాగనంపుట: బలిచ్చే కార్యక్రమం పూర్తయ్యాక, సోమవారం ప్రొద్దున పదిగంటల సమయంలో అమ్మవారి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించి కలశాలతోపాటు ఏనుగుమీద ఎక్కించి, మంగళ వాద్యాల ధ్వనులమధ్య వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్ళి భక్తులు అమ్మవారిని సాగనంపుతారు. చివరిగా ‘ఘటాన్ని’ నయాపూల్‌ ‌ప్రాంతంలో ప్రవహించే మూసీనదిలో నిమజ్జనం చేసి, పండుగను పూర్తి చేస్తారు.

– లతా కమలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Open chat