వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం పట్టభద్రులు, విద్యార్థులు ముందుకు రావాలి: తెలంగాణ గవర్నర్
వ్యవసాయ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు ఆ రంగానికి సంబంధించిన పట్టభద్రులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు ముందుకు రావాలని తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. తమ తమ పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా రైతులకు ఆధునిక వ్యవసాయ ఫలాలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరో స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 156 మంది ఉద్యాన డిగ్రీ, 50 మందికి ఫారెస్ట్ డిగ్రీ, 45 మందికి, ఉద్యాన పీజీ, 30 మందికి ఫారెస్ట్రీ పీజీ, మరో ఆరుగురికి పీహెచ్‌డీ పట్టాలను గవర్నర్ అందజేశారు.
అత్యధిక జనాభా కలిగిన భారతదేశం ఆహార ఉత్పత్తిలోనూ అగ్రగామిగా వుందని, దేశంలో యేటేటా వ్యవయసాయోత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సమయంలో పలు దేశాల్లో ఆహార కొరత ఏర్పడినా.. భారత్‌లో మాత్రం ఆ సమస్య రాలేదన్నారు. మరోవైపు పోషక విలువలతో కూడిన కొత్త ఉద్యానవన పంటలను ప్రవేశపెట్టాలని కూడా సూచించారు. 15 సంవత్సరాల క్రితం మన దేశంలో వనరులు చాలా పరిమితంగా వుండేవని, ఇప్పుడు ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామని గవర్నర్ తెలిపారు.