వివేకానంద చికాగో ఉపన్యాసానికి నాంది హైదరాబాద్ లోనే : జిష్ణుదేవ్ వర్మ

స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటన సనాతన ధర్మ చరిత్రలో, రామకృష్ణ మిషన్ చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చెప్పారు. స్వామి వివేకానంద 1893 ఫిబ్రవరి 13న తన జీవితంలోనే తొలిసారిగా ఓ బహిరంగ సభను ఉద్దేశించి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ప్రసంగించారని ఆయన గుర్తు చేశారు.

మహబూబ్ కాలేజీలో వివేకానంద దివస్ సందర్భంగా మెహబూబ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, రామకృష్ణ మఠం సంయుక్తంగా గురువారం నిర్వహించిన యూత్ కన్వెన్షన్ లో గవర్నర్ ప్రసంగించారు. అమెరికా చికాగోలో జరిగిన విశ్వమత సభలో స్వామి వివేకానంద ప్రసంగానికి నాంది మహబూబ్ కాలేజీలో చేసిన ప్రసంగమని గవర్నర్ చెప్పారు.

చికాగో ప్రసంగంలో వేదాలు, పురాణాలు, అనుష్టాన వేదాంతం గురించి స్వామి వివేకానంద చెప్పారని వర్మ తెలిపారు. ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత భారత్ ను విశ్వ గురువుగా చేయగలరని గవర్నర్ ధీమా వ్యక్తం చేశారు. యువత.. స్వామి వివేకానంద సైనికులుగా మరి దేశాన్ని ప్రేమిస్తూ ఆయన కలలను సాకారం చేయాలని గవర్నర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామిబోధమయానంద ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు చదివితే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తి వస్తుందని చెప్పారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత నిర్భయత్వం, త్యాగగుణం అలవర్చుకోవాలని ఆయన సూచించారు.

భారత్ ను విశ్వగురువు చేయాలన్న స్వామి వివేకానంద కలలను యువత సాకారం చేయాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు. బోల్టన్ స్కూల్ చైర్మన్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ పాట్నీ సెంటర్ కు వివేకానంద పేరు పెట్టాలని, చౌరస్తాలో వివేకానంద విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *