ప్రతి రోజూ పంట నష్ట నివేదికను సమర్పించాలి : ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ
రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాలతో ప్రజల జన జీవనానికి నష్టం కలగడంతో పాటు వ్యవసాయం కూడా భారీగానే దెబ్బతింది. ఈ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో పంటల నష్టం లెక్కలు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు మొత్తం సాగు భూమిలో 33 శాతానికి మించి పంట నష్టం వుంటే క్షేత్ర స్థాయికి వెళ్లి, పం నష్టాన్ని లెక్కించాలని అన్ని జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులకు తెలంగాణ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఆదేశాలిచ్చారు. ఈ పంట నష్టాన్ని లెక్కించే ప్రక్రియలో వ్యవసాయం, ఉద్యానవ పంట నష్టాలను రెంటినీ లెక్కలోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. పంట నష్టం లెక్కింపు బాధ్యతను క్షేత్ర స్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈవో) కి అప్పగించింది.మండల వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, పంట నష్టంపై ఒకే జాబితాను తయారు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపే ఏరోజు కారోజే పంట నష్టానికి సంబంధించిన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాగు చేసిన పంట పొలాల్లో 33 శాతానికి పైగా నష్ట జరిగితే అంచనా వేసి, ఏఈవోలు పంపిస్తే, ఏడీఏలు, ఎంఏవోలు గ్రామాల వారీగా కచ్చితత్వాన్ని నిర్ధారించి జాబితా రూపొందించాలి. జిల్లా వ్యవసాయ అధికారులు ఎన్యుమరేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అసిస్టెంట్ అగ్రికల్చర్ డైరెక్టర్లు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో 25 శాతం ఏరియాలో పంట పొలాలను, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు 5 శాతం ప్రభావిత మండలాలను స్వయంగా సందర్శిస్తారు. డీఏవో ప్రతి రోజూ ఆయా జిల్లాల్లో ఎన్యూమరేషన్ ప్రోగ్రేస్ ను సాయంత్రం 4 గంటల లోగా వ్యవసాయ శాఖ డైరెక్టర్ కి అందించాలి.
దీని తర్వాత పంట నష్టంపై లెక్కలు తీసి మండల వ్యవసాయ శాఖ అధికారులు, ఉద్యానవన అధికారులు, అసిస్టెంట్ వ్యవసాయ శాఖ, ఉద్యానవన డైరెక్టర్లు, జిల్లా అధికారులు అందరూ ఆయా జిల్లా కలెక్టర్లు సంతకాలు చేసిన పంట నష్టం జాబితాను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలలో బహిరంగంగా ప్రదర్శించాలి. ఇలా ఇన్ పుట్ సబ్సిడీలను పొందేందుకు అర్హులైన రైతుల తుది జాబితాను సెప్టెంబర్ 12 లోపు సమర్పించాలని వ్యవసాయ శాఖ ఆదేశాలిచ్చింది. ఈ వివరాల ఆధారంగా పంట నష్టపోయిన రైతులను గుర్తించి, వారి బ్యాంకు ఖాతాలో ఎకరానికి 10 వేల రూపాయల చొప్పున పంట నష్ట పరిహారాన్ని ప్రభుత్వం జమ చేయనుంది.