’’చేతనా స్రవంతి – నవయుగ భారతి’’ ఆధ్వర్యంలో ‘‘తెలుగు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్’’ పుస్తకావిష్కరణ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వందేళ్ల చరిత్ర అత్యంత విశిష్టమైందని, ఆధునిక ప్రపంచ చరిత్రలో ఆరెస్సెస్ లాంటి సంస్థ మరొకటి లేనే లేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. జయప్రకాశ్ నారాయణ అన్నారు.’’చేతనా స్రవంతి – నవయుగ భారతి’’ సంయుక్త ఆధ్వర్యంలో ‘‘తెలుగు ప్రాంతాలో ఆర్ఎస్ఎస్’’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. హైదరాబాద్ లోని చైతన్యపురిలోని భాగ్యశ్రీ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఐఏఎస్ డా. జయప్రకాశ్ నారాయణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతం కోసం అంకితమై, జీవన పర్యంతం బ్రహ్మచర్యం పుచ్చుకొనే మత గురువులున్న సంస్థలు వున్నాయని, లేకపోతే ఉద్రేకంతో దేశమాత శృంఖలాలను తొలగించడం కోసం తాత్కాలికంగా, ఆవేశంతో త్యాగాలు చేసిన సంస్థలు కూడా వున్నాని, కానీ దీర్ఘకాలం ఓ స్పష్టమైన అవగాహనతో, సుదూరంగా వున్న లక్ష్యం కోసం, తాత్కాలిక ఆవేశం కాకుండా, క్షణికమైన ఉద్రేకం కాకుండా స్పష్టమైన అవగాహనతో, నిశ్శబ్దంగా, అజ్ఞాతంగా, ఏమీ ఆశించకుండా వేలాది మంది ప్రాణాలిచ్చే సంస్థలు 150 ఏళ్లలో లేవని, అలా జరగలేదని అన్నారు. ఒక్క ఆరెస్సెస్ లోనే వుందన్నారు. ఓ పక్క త్యాగనిరతి, దీర్ఘకాల లక్ష్యం, కీర్తికాంక్షతో కాకుండా ఆరెస్సెస్ సేవ చేస్తోందన్నారు. ఓ మహనీయుడు చెప్పినట్లు కీర్తి కాంక్షతో కాకుండా కీర్తి దక్కుతుందా అని కాకుండా లక్ష్యం కోసమే పోరాడేవారితో మహత్కార్యాలు సాధింపజేస్తారని అనేవారని, ఈ మహా తత్వాన్ని పూర్తిగా అంతర్లీనం చేసుకున్న గొప్ప సంస్థ ఆరెస్సెస్ అని కొనియాడారు. నిరపేక్షత, రాగద్వేషాలకు తావులేకుండా పనిచేస్తుందన్నారు. అహింస, సత్యం, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అనే ఐదు మహా లక్షణాలు మూర్తిగా మూర్తీభవించిన సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అని తెలిపారు. అందుకే జాతి నిరంతరం రుణపడి వుండాలని, రుణపడి వుంటుదన్నారు.ఆరెస్సెస్ నిరంతరం కూడా మన సమాజంలో అంతర్గత సంస్కరణల కోసం పోరాడుతూనే వుందన్నారు.

ఇంత పెద్ద చరిత్ర, సంస్కృతి మన దేశానికి వున్నా… ముక్కలైన సమాజం మనదని, ఈ ముక్కలైన సమాజంలో ఐక్యత సాధించాలని సంఘ్ పనిచేస్తోందని, అలాగే ఈ హైందవ సంప్రదాయంలో ఫలానా శాఖను, సంప్రదాయాన్ని మాత్రమే అనుసరించమని కూడా ఏనాడూ సంఘ్ చెప్పలేదని స్పష్టం చేశారు. హైందవ సంస్కృతిలోనే ‘‘ఏకం సత్ విప్రా: బహుధా: వదంతి’’ అని వుంటుందని, తోచిన రీతిలో సత్యాన్ని వెతుక్కో అని చెప్పిన ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి అని అన్నారు. అలాగే నిరీశ్వరవాది అయిన కణాదుడ్ని, చార్వాకుడ్ని కూడా రుషులుగా చేశామని, బ్రహ్మగుప్త, ఆర్యభట్ట, భాస్కరుడు, శంకరుడు ఇలా అందరూ గౌరవించదగ్గవారేనన్నారు. భారతీయ సంప్రదాయంలో వున్న ఈ ఔన్నత్యాన్ని బాగా మంది అర్థం చేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంఘ్ దృష్టిలో రాజ్యం అత్యున్నతమైంది కాదని, సమాజమే అత్యున్నతమైందన్న విషయం తనకు అర్థమైందన్నారు.
సమాజంలో వున్న ఆత్మన్యూనతను తొలగించి, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని అందించేందుకు నిరంతర ప్రయత్నాన్ని సంఘ్ చేస్తోందన్నారు. ఏ సంస్థ అయినా సరే ఉదాత్త లక్ష్యాలతో ప్రారంభమైనా, సందర్భానుసారంగా పరిణామం చెందకపోతే, కాలక్రమేణా ఆ సంస్థ ప్రభావం అంతరిస్తుందని, కానీ.. సంఘ్ నిరంతరం పరిణామం చెందుతోందని ప్రకటించారు. సంఘ కార్య శతాబ్ది సందర్భంగా సంఘ్ పంచపరివర్తన్ అనే విషయాన్ని పరిచయం చేసిందని, దీనికి ద్వారా సమాజానికి మేలు చూకురుతుందన్నారు. అలాగే మన సమాజంలో విభిన్న దృక్పథాలు, భాషలు, ప్రాంతాలు, కులాలున్న సమాజాన్ని ఏకం చేయడం ఓ అద్భుతమైన యజ్ఞం అని, ఈ యజ్ఞాన్ని శతాబ్దం పాటు నిర్వహించి, కొనసాగిస్తూ, మార్పుకు శ్రీకారం చుడుతున్న సంఘ్ కి మనస్ఫూర్తిగా మనోవాక్కాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.ఈ దేశంలో ఎన్నో అద్భుతమైన పనులు జరిగాయని, మరిన్ని జరగాలన్నారు. ఈ దేశ భవిష్యత్తును కాపాడటంలో మనందరి కర్తవ్యాన్ని చిత్తశుద్ధిగా నిర్వహించాలని జయప్రకాశ్ నారాయణ సూచించారు.

ఇక..ముఖ్య వక్తగా విచ్చేసిన ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణీ సదస్యులు వడ్ల భాగయ్య మాట్లాడుతూ సమాజాన్ని సంఘటితం చేయడంలో సంఘ్ వందేళ్లుగా కృషి చేస్తోందన్నారు. చరిత్రను అర్థం చేసుకున్నప్పుడే మన మన జీవితాల్లో పరివర్తన వస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంఘ్ చరిత్ర కోసం బండారు సదాశివరావు, సుబ్రహ్మణ్య శాస్త్రి, రాంభావు హల్దేకర్ లాంటి వారు ప్రయత్నాలు ప్రారంభించేశారన్నారు.వీరంతా కూర్చొని కొంత సమాచారం తయారు చేశారని, ఆ సమాచారాన్ని ఇప్పుడు కొంత మంది పెద్దలు కలిసి ఓ రూపునిచ్చారన్నారు.ఇప్పటికైనా ఓ రూపు వచ్చిందని, సంతోషమని, అత్యంత పవిత్రమైన దినమని అన్నారు.

హెడ్గేవార్ స్వాతంత్ర సమరయోధులని, రెండు సార్లు జైలుకెళ్లారన్నారు. 1920 లో నాగపూర్ లో కాంగ్రెస్ మహా సభలు జరిగాయని, అందులో వ్యవస్థలన్నింటికీ ప్రముఖ్ గా డాక్టర్జీ వున్నారని, సంపూర్ణ స్వాతంత్రం కావాలని ఓ తీర్మానం, ప్రపంచంలో రాజకీయ, ఆర్థిక, సామ్రాజ్యవాదం నుంచి వ్యక్తులందరూ ముక్తిని పొందాలంటూ తీర్మానం చేశారని, కానీ అప్పట్లో అది పాస్ కాలేదన్నారు. ఆ మూలమైన ప్రస్తావన, తీర్మానం నుంచే ఆరెస్సెస్ ఆవిర్భవించిందన్నారు. సంఘటిత సమాజం, ఈ సమాజం కోసం జీవన విలువలను జీవితంలో ఆచరించే వ్యక్తులు, ఆ వ్యక్తులను తీర్చిదిద్దడం ఈ పనికి సంఘ్ ప్రారంభమైందన్నారు. ప్రారంభమైన తర్వాత ఉపేక్ష, వ్యతిరేకత, భ్రమలను నిర్మాణం చేయడం, దుష్ర్పచారం జరిగిందన్నారు.
అప్పట్లో తెలంగాణలో నైజాం రాజ్యం వుండేదని, అందుకే హిందూ సంఘటన సాధ్యం కాలేదని, అందుకే ప్రారంభంలో సంఘ కార్యం విజయవాడ, నూజివీడులో ప్రారంభమైందన్నారు. నూజివీడు రాజావారి కూతురు పూణెలో వుండేవారని, అప్పుడప్పుడు అక్కడికి వెళ్లేవారని, ఈ సమయంలోనే సంఘ్ కార్యకర్తలు ఉత్సవానికి వారిని అతిథిగా పిలిచారని, ఉత్సవంలో పాల్గొని, చాలా ప్రభావితులయ్యారన్నారు. ఇలాంటి సంఘాన్ని తమ దగ్గర కూడా పెట్టాలని అన్నారని, అప్పుడు అక్కడి పెద్దలు నాగపూర్ లో శిక్షావర్గ నడుస్తుందని, అక్కడికి పంపమని తెలిపారన్నారు. దీంతో రాజావారు కూనకుల్లి సుబ్రహ్మణ్యం గారిని, విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో ఉపన్యాసకులుగా వున్న రాఘవాచారి గారిని నాగపూర్ శిక్షణకి పంపారన్నారు. అప్పటి నుంచి వారిద్దరూ నూజివీడులో శాఖ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇది చరిత్ర అని తెలిపారు.
”అలాగే నాగపూర్ నుంచి యాడ్వర్కర్ జీ గారిని, బందిష్టే గారిని విజయవాడకి వచ్చారు. వీరికి అప్పటికే నాగపూర్ లో న్యాయశాస్త్రం అభ్యసించిన రాఘవరావు.. విజయవాడలో అడ్వకేటుగా స్థిరపడ్డారు. దీంతో వారిద్దరికీ వీరి చిరునామాను ఇచ్చి, ఉత్తరం ఇచ్చి విజయవాడకు పంపించారు. వారు వచ్చేసరికి వీరు ఊళ్లోలేరు. హోటల్ కి వెళ్లి తిన్నారు. ఆ తర్వాత రాఘవరావు గారు వచ్చారు. ఇంతలోనే డాక్టర్జీ స్వర్గస్తులయ్యారు. దీంతో యాడ్వర్కర్ జీ నాగపూర్ వెళ్లారు. బందిష్టే జీ ని విజయవాడలోనే వుంచారు. బందిష్టే గారు చాలా తెలివైన విద్యార్థి కాబట్టి, ఎస్.ఆర్.ఆర్ కళాశాలలో సీటు దొరికింది. దీంతో ఎన్టీ రామారావు గారితో కలిసి చదువుకున్నారు. రాఘవరావు గారు తిరిగొచ్చిన తర్వాత వీరిద్దరికీ ఓ గది చూపించారు. వంట చేసుకోవడం, ఒకపూట తినడం, కళాశాలలు తిరగడం, శాఖలు ప్రారంభించడం చేశారు.అలా విజయవాడలో సంఘ కార్యం ,తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో నిజాం రాజ్యం కారణంగా విజయవాడలో ప్రారంభమైంది.

తెలంగాణలో నిజాం అత్యాచారాలు కొనసాగుతుండటం వల్ల కొంత మంది కృష్ణా, గుంటూరుకి వెళ్లారు. దీంతో అక్కడ వారికి సంఘ పరిచయం ఏర్పడింది. తర్వాత తెలంగాణ విముక్తం అయిన తర్వాత 1950 లో వెంకటేశ్వర్ గారి ద్వారా శాఖ ప్రారంభమైంది. 52 లో తుంకూడికి కార్యకర్తలు శిక్షావర్గకి వెళ్లారు. అప్పుడు భాగ్యనగర్ లోని శంకర్ రావు గారు ప్రచారక్ గా వరంగల్ వెళ్లారు.కొమరవోలు నారాయణ రావు గారు మచిలీపట్నం నుంచి ప్రచారక్ గా వచ్చారు. అప్పుడే శ్రీరాం సాఠేజీ భాగ్యనగర్ వచ్చారు.ఆ రోజుల్లోనే యాదవ రావు జోషి వరంగల్ పర్యటనకి వస్తే 2,000 మందితో సభ జరిగింది. అలాగే ఆ రోజుల్లోనే పూజనీయ గురూజీ వరంగల్ పర్యటనకి వచ్చినప్పుడు పరకాల నుంచి వరంగల్ కి 114 మంది స్వయంసేవకులు సంచలన్ చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా ఇంటింటా వరంగల్ లో స్వయంసేవకులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ఇది చరిత్ర. ఆ తర్వాత నెల్లూరు నుంచి కొచ్చి కృష్ణమూర్తి గారు వరంగల్ కి ప్రచారక్ గా వచ్చారు. గూండాలను నియంత్రించిన మహానుభావులు వీరు. ఆ తర్వాత కే.వీ. సత్యనారాయణ గారు కూడా. ఇక.. విభాగ్ వ్యవస్ధ అందుబాటులోకి వచ్చిన తర్వాత హల్దేకర్ జీ వరంగల్ విభాగ్ ప్రచారక్ గా పనిచేశారు. ఆ తర్వాత హల్దేకర్ జీ క్షేత్ర ప్రచారక్ గా పనిచేశారు. పెద్దలు శఠగోపాచారి గారు దీనదయాళ్ జీ, మోఘే జీ, పూజనీయ గురూజీకి స్వయంగా వైద్యం చేశారు. వీరి సొంతూరు ఏలూరు. వరంగల్ కాదు. కానీ బాపూరావ్ మోఘేజీ వరంగల్ వెళ్లమని, అక్కడ వైద్యం చేయమని చెప్పారు. శఠగోపాచారి గారు వచ్చిన తర్వాత సంఘానికి వరంగల్ లో ఆధారమయ్యారు,సంఘచాలక్ గా పనిచేశారు. శఠగోపాచారి గారంటే సంఘ్, సంఘ్ అంటే శఠగోపాచారి గారు. వరంగల్ లో ఇంతలా ప్రసిద్ధి చెందారు.’’ అని తెలిపారు.
ఏపీలో సంఘ కార్యం ముందే ప్రారంభమైందని, నిజాం పరిపాలన కాలంగా కొంత ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. అయితే తెలంగాణ ప్రాంతంలో సంఘ కార్యం పెరగడం కోసం గృహస్థులు, ఉద్యోగస్థులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారన్నారు. పులుసు గోపిరెడ్డి ఇదే కోవలోకి వస్తారన్నారు. కృష్ణమూర్తి, రాజు, కొమరగిరి రామ్మోహన్.. వీరంతా తెలంగాణ ప్రాంతంలో సంఘ కార్యం పెరగడం కోసం వరంగల్ తో పాటు మిగతా ప్రాంతాలకు కూడా వచ్చారన్నారు. నేడు సంఘ్ సంపన్నమైందని, తమ ఉద్యోగానికి అవసరమస్తే రాజీనామా చేసి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి వైద్య విద్య చేయాల్సి రావడం అనే పరిస్థితులు ఇప్పటి వారికి అర్థం కావాల్సిన అవసరం వుందన్నారు. అప్పుడు చరిత్రను అర్థం చేసుకున్నవారం అవుతామన్నారు.

పరకాలలో రానూ రానూ శాఖలు విస్తరించాయని, పాకం రాజవీరయ్య, ఎంపీ జగ్గారెడ్డి వీందరూ పటిష్టం చేశారన్నారు. దీంతో పరకాల శక్తిమంతమైందన్నారు. ఆ రోజుల్లోనే 30 గ్రామాల్లో శాఖలు నడిచేవని, అలాగే శ్యాంప్రసాద్ ముఖర్జీ పేరుతో కబడ్డీ పోటీలు కూడా జరిగేవన్నారు. సుమారు 15 మంది ఉద్యోగస్థులు కార్యకర్తలుగా పనిచేశారన్నారు. ఇలా అందరూ సంఘ కార్యం కోసం పనిచేశారన్నారు.