దేవాలయాల విముక్తి కోసం కొచ్చి కేంద్రంగా ఉద్యమం ప్రారంభం
దేవాలయాల విముక్తి కోసం కొచ్చి కేంద్రంగా ఓ పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. చారిత్రాత్మక మందిరాల ప్రవేశ ప్రకటన అన్న 89 వ వార్షికోత్సవం సందర్భంగా కొచ్చిలో హిందూ సంస్థల ఐక్య వేదిక ‘‘దేవాలయ పార్లమెంట్’’ ను నిర్వహించింది. కేరళ దేవస్వం బోర్డులపై అవినీతి, దుర్వినియోగం, దేవాలయాల వ్యవస్థకు వ్యతిరేకంగా అవలంబిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ మందిర్ పార్లమెంట్ ఓ ఛార్జిషీట్ ను కూడా తయారు చేసింది. రాబోయే ఉద్యమ నేపథ్యంలో పూర్తి డేటాను సేకరించడానికి ఈ మందిర్ పార్లమెంట్ కొందరు ప్రతినిధులతో ఓ బృందాన్ని కూడా తయారు చేసింది. ఈ బృందాన్ని ఈ నెల 18 న శబరిమలకు పంపనుంది.
1936లో మందిర్ ప్రవేశ ప్రకటన అనేది వచ్చింది. దేవాలయ వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు నిమ్న కులాలకు చెందిన అన్ని వర్గాల హిందువులకు మందిరాలలో ప్రవేశం కల్పించడానికి ఇది ఏర్పాటైంది.
ఈ నేపథ్యంలోనే కొచ్చి కేంద్రంగా జరిగిన మందిర్ పార్లమెంట్ అన్న కార్యక్రమానికి సాధు సంతులు, హిందూ సంస్థల ప్రతినిధులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యారు.దాదాపు 1000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లౌకికవాద రాజకీయ నాయకులు, ప్రభుత్వం నిర్వహణ నుంచి దేవాలయాలను విముక్తం చేయాలని, ఆ అవసరాన్ని వక్తలందరూ నొక్కి చెప్పారు. రాష్ట్రంలోని ఐదు దేవస్వం బోర్డులలోని అవినీతిని, దేవాలయ వ్యతిరేక విధానాలను, దేవాలయాలను దోపిడీ చేసే విధానాలను ప్రజల ముందు వుంచారు. అలాగే దేవాలయాల్లో దోపిడీ చేసే దోపిడీదారులపై తీసుకోవాల్సిన చర్యలను, దేవస్వం బోర్డుల రద్దు, చట్టపరమైన అంశాలు, పరిపాలన, భక్తుల పాత్ర, దేవాలయాలను ఆ వ్యవస్థపై పూర్తి నమ్మకం, శ్రద్ధ వున్నవారికి అప్పగించే విధానం, నిరసన కార్యక్రమాలపై లోతుగా చర్చించారు.
ఈ మందిర్ పార్లమెంట్ లో హిందూ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.వి. బాబు అధ్యక్షత వహించగా, స్వామి చిదానంద పూరి ప్రారంభించారు. విహెచ్‌పి రాష్ట్ర కార్యదర్శి అడ్వ. అనిల్ విలాయిల్, కేరళ క్షేత్ర సంరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముళ్లపల్లి కృష్ణన్ నంబూద్రి, అయ్యప్ప సేవాసమాజం అధ్యక్షుడు పి.ఎన్. నారాయణ వర్మ, శబరిమల కర్మ సమితి జనరల్ కన్వీనర్ ఎస్.జె.ఆర్. కుమార్ పార్లమెంట్‌లో ప్రసంగించారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఉత్తర కేరళ ప్రాంత్ సంఘచాలక్ అడ్వకేట్ కె.కె. బలరామ్ మందిరాలలో ఉన్న సమస్యలు మరియు మలబార్ మరియు ఉత్తర కేరళ దేవాలయాలలోని అసమానతలు, చట్టపరమైన విషయాలతో సహా పలు విషయాలపై మాట్లాడారు. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు మాజీ డిప్యూటీ కమిషనర్ సి.ఆర్. రాధాకృష్ణన్ తన సేవా అనుభవాలను వివరించారు.
గురువాయూర్ మందిర్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీలో అవినీతి, వైరుధ్యాలపై ప్రజ్ఞా ప్రవాహ కేరళ విభాగం భారతీయ విచారణ కేంద్రం త్రిసూర్ జిల్లా ఉపాధ్యక్షుడు షాజీ వరవూరు మాట్లాడారు.కొచ్చి దేవస్వం బోర్డు రిటైర్డ్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వి.ఆర్. మోహనన్ దేవస్వం బోర్డు మందిర్ వ్యతిరేక వైఖరిని ఎత్తిచూపారు.హిందూ ఐక్యవేది రాష్ట్ర పోషకురాలు కె.పి. శశికళ టీచర్ ప్రభుత్వంపై ‘ఛార్జిషీట్’ను సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ.ఎస్. బిజు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. హిందూ ఐక్యవేది రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వల్సన్ తిల్లంకెర్రీ ముగింపు ప్రసంగం చేశారు.