భయంకర బ్రిటిష్‌ పాలన.. నలభై సంవత్సరాలలో పదికోట్ల మరణాలు

మనదేశానికి స్వాతంత్య్రం ఏ ఒక్కరివల్లనో రాలేదు.. ఎందరో వీరుల ప్రాణత్యాగఫలమే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. బ్రిటిష్‌ వారి అరాచకాలు, అఘాయిత్యాలకు అంతే లేదు. విపరీతమైన దోపిడితోపాటు వారు సాగించిన మతమార్పిడి కార్యక్రమాలు కూడా అపారమైన కష్టానష్టాలను కలిగించాయి. ముఖ్యంగా వారి ఆర్ధిక దోపిడి మూలంగా అనేకసార్లు దేశంలోని పలు ప్రాంతాలు కరువుకాటకాలతో అల్లాడాయి. 1880 నుంచి 1920 వరకు సుమారు నాలుగు దశాబ్దాల కాలంలో సుమారుగా పదికోట్ల భారతీయులు మరణించారంటే వారి అకృత్యాలు, అరాచకాలు ఏ స్థాయిలో ఉండేవో అర్ధమవుతుంది. ఆనాటి మారణకాండ గురించి బ్రిటన్‌కు చెందిన ఇద్దరు సామాజిక శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు. అందులో ప్రపంచం నిర్ఘాంతపోయే అనేక విషయాలు బయటపడ్డాయి.

డైలాస్‌ సుల్లివన్‌, జాసన్‌ హికెల్‌లు కలిసి ‘పెట్టుబడిదారీవిధానం, తీవ్రపేదరికం: 16వ శతాబ్దం నుంచి వేతనాలు మరియు మరణాల ప్రపంచ విశ్లేషణ’ అనే అంశంపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా భారతదేశంలో బ్రిటిష్‌ వారు పరిపాలించేటప్పుడు భారతీయులు ఎంతమంది చనిపోయారన్న విషయంపై కూడా వారు పరిశోధన చేశారు. వారి లెక్క ప్రకరారం సుమారు పదికోట్లమంది భారతీయులు బ్రిటిషర్లవల్ల మరణించారు. ఇది ప్రపంచ చరిత్రలోనే మానవులు చేసిన అత్యంత దారుణమైన దమనకాండగా వారు పేర్కొన్నారు. ‘బ్రిటీష్‌ సామ్రాజ్యవాదం’ అనే శీర్షికతో వరల్డ్‌ డెవలప్మెంట్‌ జర్నల్‌ అనే పత్రికలో వారు ప్రచురించిన వ్యాసంలో ఈ అధ్యయనం గురించి ప్రస్తావించారు.

తీవ్రమైన పేదరికం, ఆర్థిక, సామాజిక సంక్షోభం బ్రిటిషర్ల వలసవాద కాలంలోనే ఉండేది. ఆ తర్వాత అంటే పదహారవ శతాబ్దం చివరలో పెట్టుబడిదారీ విధానం అభివృద్ధిచెందడంతో జీతాలు జీవనాధార పరిస్థితులకంటే తక్కువయి పోయాయి. మానవుల ఎత్తు తగ్గి పోయింది. అకాల మరణాలు కూడా పెరిగాయని వారు తమ వ్యాసంలో వ్రాశారు. అప్పటికి దక్షిణాసియా, సబ్‌ సహారా, ఆప్రికా, లాటిన్‌ అమెరికాలంటి దేశాలలో ఇంకా అభివృద్ధి అనేదే లేదు. కేవలం 20 శతాబ్దం ప్రారంభం నుంచి ప్రజాస్వామ్య, వలసవాద వ్యతిరేక ఉద్యమాలు పెరగడంతో ఆ దేశాలు గణనీయంగా అభివృద్ధి చెందినట్లు ఈ నివేదిక చెబుతోంది.

ఇక 1880 నుంచి 1920 వరకు ఉన్న సమయంలో బ్రిటిష్‌ వారి వలసవాద పద్దతుల కారణంగా మరణించిన వ్యక్తుల సంఖ్యను, అప్పటి జనాభాలెక్కల సమాచా రాన్ని ఉపయోగించి రచయితలు ఒక అంచనా వేశారు. భారతదేశంలో మరణాల రేటుపై వారు అంచనా వేసిన గణాం కాలు 1880 నాటివి. దీన్ని కనిష్ట ప్రమాణంగా తీసుకోవడం ద్వారా 1891 నుంచి 1920 మధ్యకాలంలో బ్రిటిష్‌ వలసవాదం వల్ల దాదాపు 5కోట్ల అధిక మరణాలు జరిగాయని వారు కనుక్కున్నారు. బ్రిటిషర్ల సమయంలో అభివృద్ధి జరిగిందని చెబుతూ, వారి పాలన బాగుంది అంటూ, వారే భారతీయులకు నాగరికత నేర్పారని చెబుతూ.. వారి మెప్పుకోసం తహతహ లాడేవారు ఈ విషయాలపై మాత్రం స్పందించరు. కానీ ఇది చరిత్ర చెబుతున్న నిజం.

వలసరాజ్యాల ప్రభావం వల్ల భారతదేశంలో జీవన ప్రమాణాలు 1880 నాటికంటే గణనీయంగా పడిపోయాయి. బ్రిటిష్‌ వారి వలసరాజ్యానికి ముందు భారతదేశంలో మరణాల రేటు 16,17వ శతాబ్దాలలోని ఇంగ్లాండ్‌ తో పోల్చితే సుమారు వెయ్యిమందికి 27గా ఉండేవి. అదే 1881 నుంచి 1920 మధ్య భారత దేశంలో 16కోట్ల 50 లక్షల మంది చనిపోయారు.

19వ శతాబ్దం చివరలో వీరి చర్యల వల్ల సుమారు ఒక కోటి వరకు ఆకలి మరణాలు సంభవించాయని చరిత్రకారులు నిర్దారించారు. అంతేకాదు ఈ అధ్యయనం చేసిన రచయితలు అప్పుడు జరిగిన ఈ దారుణమైన మరణకాండకు నష్టపరిహారం కూడా బాధితులకు ఇవ్వాలని తమ నివేదికలో తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *