ఇం‌టి శుబ్రత

ఆదర్శ హిందూ గృహనిర్మాణంలో ఇంటి శుభ్రత చాలా ముఖ్యమైన అంశం. ఇల్లు పెద్ద భవనం కావచ్చు, పూరి గుడిసె కావచ్చు, ఉదయమే లేవడం, ఇంటిలోపల బయట శుభ్రపరచుకోవడం, ఇంటిముందు కళ్లాపి చల్లటం లేదా శుభ్రం చేసుకోవటం, నీళ్లు చల్లి ముగ్గులు వేయడం  ముఖ్యం. ఇంట్లో యుక్త వయస్కులైన ఆడపిల్లలు ఈ పని చేయాలి. అందుకే వాళ్లు రాత్రి త్వరగా పడుకొని ఉదయం బ్రాహ్మముహూర్తంలో లేచి చదువుకోవాలి. అనంతరం కొద్దో గొప్పో ఇంటిపనుల్లో అమ్మకు సహకరించాలి. రంగోలి ముగ్గుల్లో రసాయనాలు కలిగిన రంగులు వేయ కూడదు. దానివల్ల భూకాలుష్యం జరుగుతుంది.

తొలగించిన చెత్తను ఇంటిముందు కుప్పగా వేసే అలవాటు చాలా బస్తీల్లో, కాలనీల్లో, గ్రామాల్లో  ఉంటుంది. ఇది సరికాదు. తరువాత మున్సిపల్‌ ‌కార్మికులు వాటిని తొలగిస్తారన్న అభిప్రాయంతో ఇలా చేస్తుంటారు. ఎక్కడికక్కడ చెత్తడబ్బాలను     ఉంచి అందులో ఈ చెత్తను వేయాలి. ఇంట్లో పాత్రలు శుభ్రం చేసుకొన్న తరువాత వచ్చే తడి చెత్తను విడిగా డబ్బాల్లో వేయాలి. ఇల్లు లోపల  ఊడ్చడం, తడిబట్టతో తుడుచుకోవడం ఉదయమే చేసుకోవాలి.

శుభ్రమైన ఇంటికోసం, ఉదయమే    శుభ్రం చేసుకున్న ఇంటికోసం దేవీదేవతలు వెతుకుంటారు. ఆ ఇంటిలోనే లక్ష్మీ ప్రవేశిస్తుంది. ఇంటి బయట చెప్పుల్ని గుమ్మం ముందుంచకూడదు. వీటిలో ఉన్న జేష్టాదేవి (దరిద్ర దేవత) ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వీటికోసం ఒక స్థలంలో గుమ్మం కుడివైపు వరుసక్రమంలో విప్పాలి. చెప్పులు వేసుకొవడం, విడవడంలో సంయమనం కావాలి.

ఉదయమే లేవడం, రాత్రి త్వరగా పడుకుంటే, ఇంటి శుభ్రత సమస్య కాదు. ఇంట్లో పిల్లల పుస్తకాలు, గృహోపకరణాలు, ఆటవస్తువులు, వేటి స్థానాల్లో అవి ఉండాలి. తీసిన వస్తువు తీసిన చోట పెట్టాలి. నిద్రలేవగానే పక్క బట్టలు మడిచి        శుభ్రంగా సర్దిపెట్టుకోవడం ప్రాథమిక సూత్రం. వంటి శుభ్రతతో పాటు ఇంటి శుభ్రత ముఖ్యం. కరోనా నేపథ్యంలో సానిటైజర్లు, రూమ్‌క్లీనర్‌ల వాడకం పెరిగింది. వీటిని పరిమితంగా వాడాలి.

ఇంటికి తెచ్చుకొనే కూరగాయల్ని, పళ్లను శుభ్రంగా కడుక్కొవాలి. వాక్స్‌ను తొలగించి పళ్లను తినాలి. ఇంట్లో వీలయిన చోట కూరగాయలు, పూలమొక్కలు వేసుకోవాలి. ఆహార శుభ్రత చాలా ముఖ్యం. ఇది మనకు ఆరోగ్య భద్రతనిస్తుంది. కనుక వంటిల్లు శుభ్రంగా ఉంచుకోవాలి. ఏరోజుకారోజు వంట పని ముగిసిన తరువాత, వ్యర్ధ ఆహార పదార్థాలు, ఇతరత్రా అక్కడ నుంచి తొలగించి శుభ్రం చేసుకోవాలి. అక్కడ అగ్ని దేవుణ్ణి ఆవాహన చేస్తాం. ఇంట్లో ఇల్లాలు వంటకుపక్రమించేముందు అగ్ని దేవుణ్ణి స్మరించుకోవాలి.

శుభ్రత కోసం చెప్పబడిన సంస్కారాలు, సూర్యోదయానికి 90 నిముషాల ముందు బ్రాహ్మీముహూర్తం అంటారు. కనుక  బ్రాహ్మి అంటే సరస్వతి. పిల్లలకు గాని, పెద్దలకుగాని, బుద్ధి, శుద్ధి జరిగే కాలమిది. బుద్ధి నిర్మలముగా ఉండి వికసిస్తుంది. ఉదయమే లేవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీర శుద్ధి జరుగుతుంది. ఉదయం గాలిలో ఆక్సిజన్‌ ‌శాతం ఎక్కువ. శ్వాస శుద్ధి జరుగుతుంది. లేత సూర్యకిరణాలు సోకి డి, ఇ, విటమిన్లు మనకు లభిస్తాయి. స్వేద గ్రంథులు చురుకుగా ఉండి స్వేదం బయటకు పోవడంవల్ల చక్కెర శాతం శరీరంలో సమంగా ఉంటుంది. ఇంట్లో దేవుడి కోసం ఓ స్థలం కేటాయించాలి. ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. రోజూ దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి. పూజాద్రవ్యాలను, మనల్ని కూడా సంప్రోక్షణ (శుద్ధి) చేసుకోవాలని మన పెద్దలు చెప్పారు. ఇంటి శుభ్రతకు సంబంధించి ఆలోచించడం ఎందుకంటే మన ఇల్లే ఒక మందిరం అని భావిస్తాం. కనుక Cleanliness is next to Godliness అన్నారు మరి.

– హనుమత్‌ ‌ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *