దీపం కుటుంబ జీవనానికి సాక్ష్యం

కుటుంబప్రబోధన్‌

మన కుటుంబ జీవనంలో ప్రతి ఇంటిలో దీపం వెలిగించడం చాలా ముఖ్యమైన సంస్కారం. దీపం పరబ్రహ్మ స్వరూపంగా మనం భావిస్తాం. దీపం వెలిగిస్తే మన ఇల్లు ఓ మందిరమైనట్లే. ఆ మందిరంలో భగవంతుడున్నట్లే. దీపం చీకటిని తొలగిస్తుంది. మన జీవితంలో కష్టసుఖాలు, చీకటి వెలుగులు సర్వసాధారణం. చీకటి అజ్ఞానమయితే దీపం జ్ఞానం.

నూనెతో వెలిగించిన దీపంలో ఎరుపు, నీలం, తెలుపు రంగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలు అంటారు. ‘దీపం వెలిగితే ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది’ అని ఋగ్వేదం చెబుతుంది. ఇంట్లో రెండు పూటలా దీపం వెలిగించాలి. ఇది కుటుంబంలో ఉన్నవారికి మంచి చేస్తుంది. దీపంలో మూడు వత్తులు వేసి ఒక వత్తిగా వెలిగించాలి. ఏ శుభకార్యం జరిగినా మనం దీపం వెలిస్తాం. మనిషి అంత్యేష్ఠి సమయంలోనూ దీపం వెలిగిస్తాం. గణేశ్‌, అమ్మవారి,  వసంత నవరాత్రుల్లో మనం అఖండ దీపం వెలిగిస్తాం.ఈ దీపాన్ని పంచభూతాల కలయిక అన్నారు. దివ్వె మట్టిగాను, నూనె నీరుగాను, వెలుగు అగ్నిగాను, వెలిగేందుకు కావలసిన వాయువు గాలిగాను దీపం కాంతిని ఆకాశంలోకి ప్రసరింప జేస్తుంది. కాబట్టి అకాశంగాను ‘దీపం’ మనం చేసుకోగలిగిన, మన చేతుల్లో ఉన్న అద్భుత సృష్టి. దీపం నవగ్రహాల కలయిక అనికూడ పెద్దలు చెబుతారు. విద్యుద్దీపం వచ్చేవరకు మనం నూనె దీపం వాడేవాళ్లం. దీపం కేవలం నేత్రానందం కోసమే కాదు. నూనె దీపం మన ఇంట్లో సానుకూల శక్తిని (పాజిటివ్‌ ఎనర్జీ) ఇస్తుంది. దీపం వెలిగిస్తే మరే దేవతకూ పూజ చేయనక్కరలేదంటారు. దీపం చుట్టూ ఏర్పడే వలయం శక్తి కేంద్రమవుతుంది. ఇలాంటి శక్తి వలయం వద్ద మనందరం కూర్చుని ఉంటే అందరి మధ్య అన్యోన్యత, అనుబంధాలు బాగుంటాయి. చలిమంటల చుట్టూ కూర్చునేవారి మధ్య అనుబంధం ఎక్కువ. దీపం అంటే అగ్ని. మన జీవితానికి అగ్ని మూలం. సూర్యశక్తి, విద్యుత్‌ శక్తి, వంటగ్యాస్‌తో వచ్చే శక్తి, వాహనం కదలికకు మూలమయ్యే ఇంధనశక్తి అన్నీ అగ్నిరూపాలే. కాబట్టి రోజూ ఉదయం దీపం వెలిగించి మన పనులు ప్రారంభించాలి.

ఆశ్వీయుజ బహుళ అమావాస్య దీపావళి పండుగ. నరక చతుర్దశినాడు నరకాసురుడనే రాక్షస సంహారం జరిగింది. ప్రజాకంటకుడైన రాక్షసుణ్ణి శ్రీకృష్ణుడు సత్యభామలు యుద్ధంలో వధించారు. ప్రజలు సంబరపడ్డారు. అమావాస్యనాడు దీపాలు వెలిగించి తమ సంబరాన్ని జరుపుకున్నారు. అలా దీపం ఒక లోకకళ్యాణకారకమైన సందర్భానికి మూలమయింది. దీపాల పండుగగా దీపావళి ప్రసిద్ధమైంది.

దీపావళి మొదలు శివుడికి ప్రీతికరమైన కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం హిందువులకు పరమ పుణ్యప్రదమైన వ్రతమైంది. చిరుదీపం నుంచి జ్వాలాతోరణం వరకు హిందువులు జీవుడిగా సాధన చేస్తూ శివైక్యం చెందేఉపకరణా లవుతున్నాయి. దేవునికి నెయ్యిదీపం లేదా నూనె దీపం వెలిగించాలి.

ఆవు నెయ్యితో వెలిగించిన దీపపు పొగ కళ్లకు మంచిది. వాసన శ్యాసకోశ వ్యాధులు అరికడుతుంది. దేవునికి పూజ అనంతరం మంగళ హారతినిస్తారు. ఇందుకు కర్పూరం వాడతారు. కర్పూరము ఆరోగ్యానికి మంచిది. కఫము, పిత్తములను పోగొడుతుంది. ఈ హారతిని కళ్లకద్దుకుని వాసన చూస్తే కంటిపైన, ముక్కుపైన ఈ పొగ ప్రభావముంటుంది. దీపం ఆరాధనతో బాటు ఆరోగ్యాన్ని కూడ అందిస్తుంది.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *