మనసును నియంత్రించాలి

కుటుంబ వ్యవస్థ మన సనాతనధర్మం మనకిచ్చిన ఒక గొప్ప వరం. కుటుంబంలో అందరి మధ్య సుహృద్భావం, సహకారం ఉండడం అవసరం. అపుడే పరిస్థితులను ఎదుర్కొనగలిగిన మనస్థితి ఉంటుంది.  చుట్టుపక్కల పరిస్థితులను కూడా మనం క్షేమంగా, సౌమ్యంగా చక్కబెట్టే అవకాశం ఉంటుంది. మన ఇంట్లోనే సామరస్యం లేకపోతే  పరిసరాలను నియంత్రించలేం. అందుకే మన పెద్దలు ‘ఇంటగెలిచి రచ్చగెలవ’మన్నారు. మనస్సు విప్పి ఇంట్లో అందరం మాట్లాకుంటున్నామా? ఉదాహరణకు అబ్బాయి స్కూల్‌ తరపున విహార యాత్రకు వెళ్ళాడనుకుందాం. నాల్గు రోజులు తరువాత వచ్చినపుడు అబ్బాయిని కూర్చోబెట్టుకుని ఉత్సాహంగా అన్ని విషయాలు చెప్పేవిధంగా చేయడం అవసరం. ఆ రకంగా తన మనసులో మాట పంచుకోవడం వల్ల అత్మీయత పెరుగుతుంది. పరీక్ష రాసివచ్చిన అమ్మాయిని పలకరించి ‘ఎలారాశావు’ అని అడిగి సాధక బాధకాలు తెలుసుకుంటే పరీక్ష బాగా వ్రాయకపోయినా అమ్మాయి ఆనందిస్తుంది. మనల్ని పట్టించుకునే వాళ్లు ఉన్నారు అనేదే ఎవరికైనా ఊరట కలిగించే విషయం.

ప్రతిదీ సమస్యగా చూసే అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచాలి. ఏ కష్టమొచ్చినా తట్టుకుని నిలబడేందుకు కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయత అవసరం. కుటుంబం మన పరిధిలో ఉన్న అంశం. కాని అది మనకు ఒత్తిడి పెంచే విధంగా కాదు. కుటుంబంలో మన వ్యవహార శీలత, మాటతీరు బయట పరిస్థితులకు  స్పందించినపుడు ఉపయోగపడుతుంది. అందుకే కుటుంబం ఒక శిక్షణాలయం. ఒత్తిడికి గురయినపుడు మనం దుందుడుకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అందుకే మనసుకు నియంత్రణ అవసరం. మనసు ఒత్తిడికి గురయినపుడు కోపం వస్తుంది. దుర్భాషలాడే అవకాశం ఉంది. భౌతిక దాడులకు దిగవచ్చు. శత్రుత్వాలు పెరుగుతాయి. బంధాలు దెబ్బ తింటాయి. సమాజం మనల్ని ఆవేశపరుడు అంటుంది. కాని అదే సమాజం మనం ఒత్తిడిని అధిగమించి సంయమనం పాటిస్తే సౌమ్యుడు అంటుంది.

మనసును నియంత్రించి మసలుకునే వ్యక్తిత్వం కుటుంబ వ్యవస్థలో అలవడుతుంది. భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కాని భేదాలుండవు. అలాగే సమాజంలో  అనేక సందర్భాలలో లౌక్యం అవసరం. ఈ లౌక్యం వెనుక సమాజాన్ని ప్రేమించగలిగే శుద్ధ సాత్విక ప్రేమ కూడా అవసరం. నియంత్రించలేని స్థితిలో ఊరకుండడం ఉత్తమం. దానివల్ల మనం మన కుటుంబం కోసం నిలబడతాం, జీవిస్తాం. వివిధ సందర్భాలను నియంత్రించే ప్రయత్నంలో  మనసుపై నియంత్రణ కోల్పోకూడదు. ఏ విషయాన్నీ మనం శాసించలేం. త్రికరణశుద్ధిగా ప్రయత్నించడం వరకు మన పని. దీన్నే భగవద్గీతలో శ్రీకృష్ణ మరమాత్మ ‘కర్మ’ అన్నాడు.

కుటుంబంలో మనం అందరినీ  ప్రేమిస్తాం. భార్యాభర్తల మధ్య ప్రేమ అందుకే బలంగా ఉంటుంది. అలా ప్రేమించలేనపుడే విడాకులు అవీ చర్చకు వస్తాయి. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వివేకం మనకుండాలని మన ధర్మం చెబుతున్నది. అందుకు మన కుటుంబ వ్యవస్థలో మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎన్నో! మనం నేర్చుకునే పాఠాలు ఎన్నో! మంచైనా, చెడైనా, వినోదమైనా, విషాదమైనా, సుఖమైనా, దుఃఖమైనా అంతా శ్యామప్రేరకం (భగవంతుడి లీల) అనుకోవడమే మన ధర్మం. మనకు నేర్పిన గొప్ప పాఠం.

– హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *