కనుమరుగైన విప్లవ వీరులు – నారాయణబాబు-3

3‌వ భాగం

హైదరాబాద్‌ అజ్ఞాత చరిత్ర

రక్తంతో ప్రతిజ్ఞ

మిత్రులంతా కలసి నిజాంపై దాడిచేసే పథకాన్ని, తేదీ, సమయం కూడా నిర్ణయించు కున్నారు. మొదట నారాయణబాబు నిజాంపై బాంబు విసరాలని, ఒకవేళ తప్పి ముందుకు వెళ్ళిపోతే గంగారామ్‌, ‌జగదీష్‌లు దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. అన్ని విధాలా ఏకాభి ప్రాయాన్ని కుదుర్చుకొని ముగ్గురు మిత్రులు రక్తంతో ప్రతిజ్ఞాపత్రాలపై సంతకాలు చేశారు. ప్రతిరోజులాగానే ఆ సాయంకాలం నిజాం సవారి బయలుదేరింది.

కింగ్‌ ‌కోఠి నుండి కారు బయలుదేరి ఆల్‌సెంట్సు స్కూలు దగ్గరికి రాగానే పక్కనే నిలుచున్న గుంపు లోంచి సూటులో ఉన్న యువకుడు సరాసరిన కారు దగ్గరకు పరుగెత్తి బాంబును బలంగా కారుకు విసిరికొట్టాడు. బాంబు కారు తలుపుకు తాకి రోడ్డుమీద పడి పేలింది. నారాయణబాబు వెంటనే రెండో బాంబు తీసివేసేలోగానే అక్కడి జనం, పోలీసులు వచ్చి విరుచుకుపడ్డారు. అందరూ కలిసి విపరీతంగా కొట్టగా నారాయణబాబు ముఖం రక్తసిక్తమైంది. ‘‘నేరస్తుడు చస్తే మిగతావాళ్ళు తప్పించుకుపోతారు’’ అని ఒక ఇన్‌స్పెక్టర్‌ ‌హెచ్చరించగా నారాయణబాబు ప్రాణాలతో మిగాలాడు. ఈలోగా నిజాం కారును డ్రైవర్‌ ‌చాకచక్యంగా వెనక్కు తిప్పి కింగ్‌ ‌కోఠికి తీసుకు పోయాడు. బాంబుపేలుడు చప్పుడు విన్న నారాయణబాబు సహచరులు, తలపెట్టిన పని విజయవంతమైనదని తలచి తప్పించుకుని పారిపోయారు.

చిత్రహింసలు

4 డిసెంబర్‌, 1947 ‌నాటి రాత్రి 8 గంటలకు హైద్రాబాద్‌ ‌రేడియో ప్రత్యేక ప్రసారంలో నిజాంపై జరిగిన హత్యా ప్రయత్నాన్ని ప్రకటిస్తూ ‘‘అల్లా దయవల్ల హజరత్‌ ‌క్షేమంగా ఉన్నార’’నే వార్తను ప్రసారం చేసింది. ఆ తర్వాత పోలీసు స్టేషన్‌లో నారాయణబాబును నిర్భంధించి అమానుషంగా కొట్టారు. కుట్ర వివరాలు చెప్పమని కిరాతంగా హింసించి, దాహం వేస్తే ఉచ్చపోసి తాగమన్నారు. ఈ హింసవల్ల స్పృహతప్పిపోయినా ఊరుకోలేదు. నిజాం మంత్రి లాయవేతీ ప్రత్యేకంగా వచ్చి నారాయణబాబును ప్రశ్నించాడు. దాహం అంటే నీళ్ళు ఇప్పించాడు. ఏ పరిస్థితుల్లోనైనా సరే నేరస్థుడు చావకూడదని తాఖీదుచేసి వెళ్ళిపోయాడు. మూడురోజులదాకా చేతులు పైకి విరిచికట్టి మోకాళ్ళపై తీవ్రంగా బాదారు. ఆ బాధను భరిస్తూ తన పేరు ‘‘బాబు’’ అని, తాను తప్ప ఈ కుట్రలో మరెవ్వరూ లేరని నారాయణబాబు స్పష్టంగా చెప్పాడు.

పోలీసులు నారాయణబాబు సహచరుల్లో గంగారామ్‌ను పాలమ్‌కోల్‌ ‌గ్రాంలో పట్టుకో గలిగారు. జగదీష్‌ ‌తప్పించుకొని వెళ్ళిపోగలిగాడు. బాలకృష్ణ తండ్రిని అరెస్టు చేశారు. బాలకృష్ణ మాత్రం చిక్కలేదు. బాంబు విసిరిన చోట ఒక సైకిలు ఆధారంగా ఈ ఆచూకీ తీయగలిగారు. పదిహేనురోజుల్లో  చాలా చురుకుగా నారాయణ బాబు, గంగారాంలపై నేరవిచారణ జరిగింది. ఫౌజుదారి, బల్డా, సెషన్‌ ‌హైకోర్టు చివరకు జుడీషియల్‌ ‌కమిటీలో కూడా విచారణ జరిగింది. ప్రతిచోట ఇద్దరు వీరులు ఒకేమాటను స్పష్టం చేశారు. ‘‘మా భారత మాతృభూమికి నిజాం పరమద్రోహి, నిస్సందేహంగా నిజాంను హత్యచేయాలనే మా ప్రయత్నం. జనాల్ని జాగృతం చేయాలనేది మా రెండో ఉద్దేశ్యం. మేము మా కర్తవ్యాన్ని నిర్వహించాం’’.

ఒకసారి సెషన్స్‌కోర్టులో విచారణ జరుగు తుండగా రాంలాల్‌ ‌కిషన్‌ అనే న్యాయవాది వీరిద్దరికీ నేరాన్ని అంగీకరించవద్దని సలహా ఇచ్చాడు. కాని నారాయణబాబు నిరాకరిస్తూ ఇలా అన్నాడు, ‘‘మా బలిదానంవల్ల ప్రజలు మేల్కొంటారు. మా  ప్రాణాలకోసం ప్రయత్నించ కండి’’. చివరకు నారాయణబాబుకు మరణశిక్ష, గంగారాంకు యావజ్జీవ కారాగారశిక్ష విధించారు. తన ధర్మాన్ని నెరవేర్చాననే తృప్తితో నారాయణబాబు జైల్లో మృత్యుచ్ఛాయలలో సైతం నిర్విచారంగా గడుపుతున్నాడు. జుడీషియల్‌ ‌కమిటీ హైద్రాబాద్‌, ‌ప్రీవికౌన్నిల్‌ ‌నిర్ణయం కాగానే నిజాం సంతకంలో మరణశిక్ష అమలులోకి రావలసిఉంది.

హైద్రాబాద్‌లో సంస్థానంతో శాంతి భద్రతల రక్షణకోసం కేంద్ర ప్రభుత్వం 1948 సెప్టెంబర్‌లో సైన్యాన్ని పంపింది. మూడు రోజుల ప్రతిఘటన తరువాత నిజాం మోకరిల్లాడు. సెప్టెంబర్‌ 17‌వ తేదీ హైద్రాబాద్‌ ‌విముక్తి చెందింది. హైద్రాబాద్‌ ‌సైనిక ప్రభుత్వం నెలకొంది. నారాయణబాబు మృత్యువు జీవనాభిలాషలోకి పరిణితి చెందింది. తనకు రాజకీయ ఖైదీహోదా ఇవ్వాలని కోరాడు. కాని సైనిక ప్రభుత్వం గమనించలేదు. ప్రభుత్వ ఔదాసీన్యం, ఉపేక్షాధోరణి వల్ల ఆయనకు బాధవేసింది. ఫలితంగా 19 రోజుల పాటు నిరాహారదీక్ష వహించాడు. మూత్రంలోంచి రక్తం రాసాగింది. డాక్టర్‌ ‌మేల్కోటే వ్యక్తిగతంగా వెళ్ళి నచ్చ చెప్పి నిరాహారదీక్ష విరమింపచేసి, చివరకు రాజకీయ ఖైదీ హోదాను ఇప్పించ గలిగారు. నారాయణబాబు, గంగారాంల విడుదలకు ప్రజల ఒత్తిడి తీవ్రంకాసాగింది.

అయినా జైళ్ళ ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌వీరిద్దరినీ క్షమాపణ పత్రం వ్రాసి ఇమ్మని అడిగాడు. ‘‘తమకు విముక్తి భిక్ష అక్కరలేదని చెప్పి వారిద్దరు తీవ్రంగా మందలించారు. తన కుమారుని క్షమాభిక్ష వేడుకొమ్మని చెప్పి విడిపించుకోవటం తండ్రి పండరీనాథ్‌రావ్‌కు కూడా ఇష్టం లేదు. గంగారామ్‌ ‌తల్లికూడా స్వాభిమానంతో క్షమాపణపత్రం వ్రాయడానికి నిరాకరించింది. చివరకు భేషరతుగానే 1949 ఆగస్టు 10వ తేదీ నారాయణబాబు, గంగారాంలను విడుదల చేశారు. వీరిద్దరు ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళగా నారాయణబాబు వీపు తడుతూ, ‘‘నువ్వు నిజాంపై బాంబులు వెయ్యవలసి వచ్చింది. నేను కాల్పులు జరుపవలసి వచ్చింది’’ అని ప్రశంసించారు.

హైద్రాబాద్‌ను విముక్తం చేయాలనే స్వప్పం సాఫల్యం చెందిన తర్వాత కుటుంబ పోషణార్థం ఏదో ఉద్యోగం చేయక తప్పలేదు. అసంపూర్ణంగా ఉన్న విద్యాయోగ్యత వల్ల ఎలక్ట్రిసిటీ శాఖలో క్లర్కుగా ఉద్యోగం సంపాదించారు. కాని నలభై ఐదు రోజులు ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగంలోంచి తీసివేశారు. నారాయణబాబు పేరు పోలీసు బ్లాక్‌ ‌లిస్టులో ఉందనీ, అందువల్ల ప్రభుత్వోద్యోగం చేయడానికి వీల్లేదని అన్నారు. ఆ నలభై ఐదు రోజుల జీతం కూడా ఇవ్వలేదు. ఈ నిర్లక్ష్యం చాలా మంది దేశభక్తుల పట్ల జరిగింది. ఆ తరువాత ఎప్పటికో నారాయణబాబు పేరు బ్లాక్‌ ‌లిస్టులోంచి తొలగించబడింది.

(సశేషం)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *