పూర్వీకుల అపారమైన త్యాగాల వల్ల భారత్ ఉనికి స్థిరంగా ఉంది : మోహన్ భాగవత్
భారత స్వాతంత్య్రం కోసం పోరాడి.. ప్రాణాలర్పించిన వ్యక్తుల స్మారకార్థం నిర్మించిన నివాళి గోడను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మోహన్ భాగవత్ కన్యాకుమారిలో ప్రారంభించారు. ఈ నివాళి గోడపై భారతమాత కోసం ప్రాణాలు అర్పించిన 1040 మంది ప్రముఖ జాతీయ నాయకుల పేర్లున్నాయి. ఈ నివాళి గోడను ‘‘చక్ర విజన్ ఇండియా ఫౌండేషన్’’ చైర్మన్ చక్ర రాజశేఖర్ రూపొందించారు. ఈ సందర్భంగా సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ.. భారత దేశం చాలా ప్రాచీనమైందని, చైనా కంటే ప్రాచీనులమని తెలిపారు. ఈలోగా గ్రీస్ మరియు ఈజిప్ట్ వంటి అనేక దేశాలు ఉద్భవించాయని, అదృశ్యమయ్యాయని అన్నారు. కానీ.. భారత్ మాత్రం ఇప్పటికీ ఉనికిలో వుందన్నారు. ఇంతలా తట్టుకొని నిలబడడానికి చాలా సమయం పట్టిందని, అనేక తరాలు పట్టిందని గుర్తు చేశారు. దీనిని కాపాడుకోవడానికి ప్రజలు లెక్కలేనని ప్రాణాలర్పించారని, అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు.
విదేశీయులు అనేక దండయాత్రల ద్వారా భారత్‌ను ఇబ్బందులు పెట్టారని, అయినా… భారత్ తట్టుకొని, స్థిరంగా నిలబడిందన్నారు. పురాతన కాలం నుంచి నేటి వరకు భారత్ అందర్నీ కలుపుకొని పోతోందని, ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూస్తామని వివరించారు. మరోవైపు ప్రకృతిని తల్లిగా గౌరవించే సంస్కృతి మనదని, ఈ భావనే ఈ దేశ సారాంశమన్నారు. భారత దేశంలో అనేక భాషలు, వైవిధ్యం వుందని, ఇది ఏకత్వానికి చిహ్నమన్నారు. ఈ భిన్నత్వంలో ఏకత్వం అనేది అన్ని వర్గాల త్యాగాలు, కృషి వుందని, దీనిని ప్రపంచం మెచ్చుకుంటోందన్నారు. ప్రపంచానికి మనలాంటి భిన్నత్వంలో ఏకత్వం అన్న నమూనా అవసరమని మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు.

ఓ ఆక్రమణదారుడు భారత్ గడ్డపై అడుగు పెట్టగానే.. ఇక్కడి ప్రజల నుంచి ప్రతిఘటన ప్రారంభమవుతుందని, అయితే.. ఆక్రమణదారులు యుద్ధాలు గెలిచి వుండవచ్చని, కానీ.. ఈ పోరాటాలు సుదీర్ఘంగా జరుగుతాయని వారికి తెలుసని, అందుకే వారి కంటిపై కనుకు కూడా వుండదన్నారు. భారత్ ఎన్నటికీ బానిసత్వాన్ని అంగీకరించదని, అందుకే ఆక్రమణదారులు యుద్ధంలో ఓడిపోయారని లేదా, తరిమివేయబడ్డారని సరసంఘ చాలక్ వివరించారు. ఎందరు ఆక్రమణదారులు వచ్చినా.. మన పూర్వీకుల అపారమైన త్యాగాల వల్ల భారత్ ఉనికి యథాతథంగానే వుందన్నారు.
75 వ స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సమయంలో అవిభాజిత భారత్‌కి సంబంధించిన పాత సరిహద్దులలోని ప్రతి జిల్లాలో మాతృభూమి కోసం తమ సర్వస్వాన్ని త్యాగం చేసిన స్వాతంత్ర సమరయోధులను తాము గుర్తించామని తెలిపారు. వారి పోరాటాలు, త్యాగాలే మనకు ప్రేరణ అని, ఇప్పటికీ వారిని గుర్తుంచుకుంటున్నామని తెలిపారు. ఇదే మనకు స్ఫూర్తి అని, ఈ త్యాగాలు మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి కృషి చేయాలని గుర్తు చేస్తాయని, భారత్ విశ్వగురువుగా ఎదిగేందుకు సహకరిస్తాయని మోహన్ భాగవత్ అన్నారు.