అన్నదమ్ముల సఖ్యత అవసరం
మనం విన్నదీ, మనం ఆచరించేది ధర్మం అనబడుతుంది. రామోవిగ్రహవాన్ ధర్మః అన్నారు. రాముడు ధర్మస్వరూపుడు. మానవుడిగా పుట్టి ధర్మాచరణ ఎలా చేయాలో మనకు స్వయంగా చూపించినవాడు. అందుకే రామాయణం మన కుటుంబ విలువలను ప్రతిబింబిస్తుంది. రామా యణంలోని కుటుంబ విలువలను ఒక ఏడాది పాటు హిందువులంతా ఆచరిస్తే కుటుంబాలు బలపడతాయి, బాగుపడతాయి అంటారు ఆధ్యాత్మిక వేత్త శ్రీ వల్లూరు శ్రీరాచంద్రమూర్తి. కుటుంబ ధర్మం అర్థం కావడమే రామయణం. కుటుంబ ధర్మం అర్థం కావడం అంటే బంధాలు, బంధుత్వాలు అర్థం కావడమే. రాముడు, ఆయన తమ్ముళ్లు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. వనవాసం కోసం తనతో బాటు వస్తానన్న లక్ష్మణుణ్ణి రాముడు వద్దన్నాడు. కాని లక్ష్మణుడు వినలేదు. అన్నావదినలకు సేవచేసుకోవాలనే ఉద్దేశ్యంతో బయలుదేరాడు. అందుకు భార్య ఊర్మిళ కూడా సహకరించింది. రాముడ్ని అడవులకు పంపినందుకు తరువాత వచ్చి తెలుసుకున్న భరతుడు తల్లి కైకను నిందించాడు. సీతారాముల్ని చూసేంతవరకు శాంతిలేదని ఏడుస్తూ రాముడ్ని వెతుక్కుంటూ వెళ్లి దారికి అడ్డంగా పడుకొని ముందుకు పోనివ్వకుండా అడ్డుపడ్డాడు భరతుడు. రాముడు అయోధ్య రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. రాముడు వారించాడు, పాదుకలనిచ్చాడు. పాదుకలు రథంలో పక్కన పెట్టుకోకుండా నెత్తిన పెట్టుకుని వెళ్లాడు భరతుడు. అరణ్యవాసంలో రాముడు లక్ష్మణుడ్ని పిలిచి ఇంటకి పంపేద్దామనే ఆలోచనతో ‘భరతుడితో నువ్వు కూడా ఇంటికి వెళ్లిపో అన్నాడు. లక్ష్మణుడు ‘నేను నిన్ను విడిచి ఉండలేను అన్నయ్యా! నేను నువ్వు ఎంతసేపు కనడతావో అంతసేపు ప్రాణాలతో ఉండి, నువ్వు కనబడనపుడు ప్రాణం త్యాగం చేస్తా’నన్నాడు. తోబుట్టువులుగా ఉండడం ఓ గొప్ప అదృష్టంగా రామాయణం మనకు తెలియజేస్తోంది. ‘ఏదేశం వెళ్లినా భార్యా, భర్త, స్నేహితులు, బంధువులు దొరకవచ్చు కానీ ఒక అమ్మకు నాన్నకు పుట్టిన తోబుట్టువులు మాత్రం ఆ ఇంట్లోనే దొరుకుతారు. అదే కుటుంబం’ అంటాడు శ్రీరాముడు. వాలి, సుగ్రీవుల్లో ఒకరు పోయారు. రావణ, కుంభకర్ణ, విభీషణుల్లో ఇద్దరు పోయారు. విభీషణుడే బతికాడు. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు నలుగురు ఉన్నారు. వారి ఐక్యతకు విభీషణుడు అబ్బురపడ్డాడు. కన్నీరు పెట్టుకున్నాడు. రావణుడితో కలిసి ఉండలేకపోయినందుకు బాధపడ్డాడు. తోబుట్టువులతో కలిసి ఉండలేని వాళ్లు ఇక ఎవరితో మాత్రం కలిసుంటారు? వాలి మరణం తరువాత సుగ్రీవుడు ఏడ్చాడు. తార ఎంత చెప్పినా వాలి వినలేదు. తోడబుట్టిన సుగ్రీవుడ్ని ఆదరించమంది. ప్రమాదం పొంచివుందని హెచ్చ రించింది. అయినా రాముడితో వాలి యుద్ధానికి సిద్ధపడతాడు. చివరికి హతమయ్యాడు. ఎవరయినా మంచి చెబితే వినమని రామాయణం చెబుతోంది. అన్నదమ్ముల అనుబంధం పితృకర్మలు చేసేటపుడు కూడా ప్రదర్శించాలి. అందరూ కలిసి పితృకర్మలు చేస్తే తల్లిదండ్రులు పిల్లల సఖ్యత చూసి సంతోషి స్తారు. రామ లక్ష్మణ భరత శతృఘ్నులు కలిసి ఉన్నందుకే వారిని విజయం వరించిందని ధర్మం గెలిచిందని, రావణ విభిషణులు విడిపోయి నందుకే వారికి అజయం కలిగిందని అధర్మం ఓడిందని విజ్ఞులు వ్యాఖ్యానిస్తుంటారు.
– హనుమత్ ప్రసాద్