దొంగలించిన విగ్రహాలను అక్కడే పెట్టి… క్షమాపణ లేఖ

ప్రయాగ్ రాజ్ జిల్లా శృంగవర్ పూర్ ధామ్ ఆలయంలో విచిత్రం జరిగింది. దుండగులు ఈ ఆలయంలోని రాధా కృష్ణుల విగ్రహాలను దొంగలించారు. దీంతో భక్తులు, ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించారు. కానీ సఫలం కాలేదు. కానీ.. ఏం జరిగిందో ఏమో కానీ… హఠాత్తుగా మళ్లీ దేవాలయం సమీపంలోనే విగ్రహాలు ప్రత్యక్షమయ్యాయి. అంతేకాకుండా దొంగలించిన వ్యక్తి దేవుడ్ని క్షమాపణలు కోరుతూ… ఓ లేఖ కూడా రాసి, విగ్రహాలను వాటి స్థానంలోనే వుంచేసి, ఆ లేఖను అక్కడ పెట్టి, వెళ్లిపోయారు. ఎనిమిది రోజుల తర్వాత ఈ విగ్రహాలు మళ్లీ దేవాలయంలో కనిపించాయి.
ప్రయాగ్ రాజ్ జిల్లా నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ శృంగవర్ పూర్ ధామ్ ఆశ్రమం వుంటుంది. కొన్ని వేల సంవత్సరాల పురాతన కాలం నాటి రాధా కృష్ణుల విగ్రహాలు ఆశ్రమంలో వుంటాయి. సెప్టెంబర్ 24 న దుండగులు ఆలయ తాళం పగలకొట్టి, మరీ అష్టధాతువులతో వున్న రాధా కృష్ణుల విగ్రహాన్ని దొంగలించారు. దీంతో దేవాలయ అర్చకులు మహంత్ స్వామి జైరామ్ దాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని, విచారించారు. కానీ ఆచూకీ దొరలకలేదు. కానీ ఆశ్రమానికి కొద్ది దూరంలోనే విగ్రహాలున్నాయని ఎవరో సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అర్చకుడు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే.. విగ్రహాలతో పాటు ఓ లేఖ కూడా దొరికింది. మూర్ఖంతో విగ్రహాలను దొంగలించానని, క్షమించాలని దొంగ వేడుకున్నాడు. ఈ విగ్రహాన్ని దొంగలించినప్పటి నుంచి భయంకర కలలు వస్తున్నాయని, ఆరోగ్యం కూడా క్షీణిస్తోందని అందులో పేర్కొన్నాడు. రాధా కృష్ణులను అమ్మడానికి కూడా ప్రయత్నించానని, కానీ కుదరలేదన్నాడు. తనను క్షమించాలని, తిరిగి అదే ఆలయంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠించాలని లేఖలో దొంగ కోరాడు.
ఇక.. పోలీసులు ఈ విగ్రహాలను దేవాలయ అర్చకుడికి తిరిగి అప్పజెప్పారు. దీంతో ఆలయ అర్చకులు విగ్రహాలకు ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించి, తిరిగి ప్రతిష్ఠించారు. దొంగలు విగ్రహాలను దొంగలించినా… పశ్చాత్తాపపడుతున్నట్లు లేఖ రాసినందుకు తాము కూడా కఠిన చర్యలు తీసుకోమని పోలీసులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *