మనమే సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవచ్చు … విధానం ఇలా

పంటల్లో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు ఎక్కువ మొత్తంలో రసాయాలు వాడుతున్నారు. దీంతో ఖర్చూ అధికమవుతోంది, భూసారమూ దెబ్బతింటోంది. దీంతో రైతు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పర్యావరణ సమస్యలు కూడా వస్తున్నాయి. దీంతో రైతులు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయ విధానం వైపు మళ్లుతున్నారు. వాటి ద్వారా పండిరచే పంటలకు కూడా మార్కెట్లో మంచి డిమాండ్‌ వుంది. కేవలం వాణిజ్య పంటలే కాకుండా.. ఉద్యానవన పంటలను కూడా సేంద్రీయ విధానంలో పండిస్తున్నారు. సేంద్రీయ పద్ధతికి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో సేంద్రీయ ఎరువులను తయారు చేసుకునే విధానాన్ని గమనిద్దాం.

1. కంపోస్టు ఎరువు

మిగిలిన వ్యవసాయ వ్యర్థాలతో ఈ ఎరువు తయారు చేసుకోవచ్చు. ఎత్తయిన ప్రదేశంలో 1 మీ. లోతు, 2 మీ. వెడల్పు గొయ్యి తవ్వాలి. వ్యర్థాలను 30 సెం.మీ. మందం పొరలుగా పేరుస్తూ, మధ్య మధ్యలో పేడ కలిపిన నీళ్లను, 8 నుంచి 10 కిలోల సూపర్‌ పాస్పెట్‌ చొప్పున ఒక్కో పొరలో వేస్తూ నేల మట్టానికి అర మీటరు ఎత్తు వరకు నింపాలి. పైన పేడ మట్టితో అలకాలి. 3`4 నెలల్లో వ్యర్థాలు కరిగి కరిగి కంపోస్టు తయారవుతుంది. పట్టణ వ్యర్థాలతోనూ కంపోస్టు తయారు చేయవచ్చు. గ్రామీణ కంపోస్టులో కన్నా పట్టణ కంపోస్టులోనే అధిక పోషకాలుంటాయని నిపుణులు అంటున్నారు.

2) బయోగ్యాస్‌ :
చిక్కగా తయారు చేసిన పేడ ద్రావణాన్ని కొన్ని రోజుల పాటు ట్యాంకుల్లో గాలి తగలకుండా మురగబెట్టినప్పుడు సూక్ష్మజీవుల చర్య ఫలితంగా వెలువడే ఇంధన వాయువును బయోగ్యాస్‌ (గోబర్‌ గ్యాస్‌) అంటారు. దీనిలో 50`60 శాతం మీథేన్‌, 30`40 శాతం బొగ్గుపులుసు వాయువు, 10 శాతం హైడ్రోజన్‌ వుంటాయి. ఇంధనంగా వాడుకోగా మిగిలిన పేడ సారవంతమైన సేంద్రీయ ఎరువుగా తోడ్పడుతుంది.

3)పశువుల పేడ ఎరువు
పశువుల సంఖ్యను బట్టి కొట్టాల వద్ద అవసరమైనంత పొడవు, వెడల్పుతో 3 అడుగుల లోతు గుంతను తవ్వాలి. పశువుల పేడ, మూత్రంతో తడిసిన చెత్త, పశువులు తినగా మిగిలిన గడ్డిని గోతిలో 6 అంగుళాల ఎత్తు వరకు నింపి దానిపై నీటిని చిలకరించాలి. 2 నుంచి 3 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ వేసి మట్టితో గానీ, బురదతో గానీ కప్పాలి. ఇలాగే భూమట్టానికి 1`1.5 అడుగుల ఎత్తు వరకు గోతినంతా నింపుతూ మట్టితో లేదా బురదతో కప్పాలి. 3`4 నెలల్లో బాగా కుళ్లి నేలలో వేయడానికి తయారవుతుంది.

4)జీవాల ఎరువు
పశువుల ఎరువు మాదిరి మేకలు, గొర్రెలు దొడ్లో వచ్చే ఎరువును భద్రపరిచి వాడుకోవచ్చు. ఎండాకాలంలో రాత్రిపూట వీటిని నేరుగా పొలాల్లో మంద కట్టడం వల్ల వీటి మల, మూత్రాలు నేరుగా పొలంలో పడి మంచి ఎరువుగా ఉపయోగపడతాయి.

5)కోళ్ల ఎరువు
40 కోళ్ల నుంచి ఒక సంవత్సరంలో టన్ను ఎరువు తయారవుతుంది. కేజెస్‌ కన్నా డీప్‌లిట్టర్‌ ఎరువులో పోషకాలు ఎక్కువ. కేజెస్‌ ఎరువులో తేమ తగ్గేకొద్దీ పోషక శాతం పెరుగుతుంఇ. షెడ్‌ నుంచి తీసిన తర్వాత టన్ను కోడి ఎరువుకు 5 నుంచి 10 సూపర్‌ పాస్పెట్‌ కలిపి కొన్ని రోజుల పాటు గొయ్యిలో కుప్పలుగా పోసి వాడటం వల్ల పోషకాలు పెరుగుతాయి. ఎకరాకు సాధారణ పంటలన్నింటికీ 2 టన్నులు, చెరుకుకి 3 టన్నుల చొప్పున కోళ్ల ఎరువు వేయవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *