పొదుపు వారి స్వభావం
నెల ఆదాయం చేతికి రాగానే బకాయి, ఇతర చెల్లింపులు ముందుగా పూర్తి చేయటం తరువాత మిగిలిన దానితో నెలవారీ ఖర్చులు పోగా ఇంకా కొంత మొత్తాన్ని పొదుపు చేయటం వారికి సహజంగా అలవాటైన పని. అది వారి ఆర్థిక క్రమశిక్షణకు తార్కాణం. మనదేశంలో ఎంత బీదవారైనా కనీసం కొద్దిగానైనా బంగారాన్ని నిలువ చేసుకోగలిగేవారు.
మన సంస్కృతిలో ధనానికి అధినేత లక్ష్మీదేవి. ఆ ధనాన్ని జాగ్రత్త చేసేది కూడా మహిళలే. మన సమాజంలో కుటుంబ నిర్వహణ, ఆర్థిక విషయాల నిర్వహణతో సహా మహిళల చేతులలోనే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలలో ఉన్నప్పుడు విడి కుటుంబాలుగా ఉన్నపుడు కూడా వారే కుటుంబ అవసరాలను, ఆర్థిక స్థితిగతులను సమన్వయం చేసేవారు.
పొదుపు చేయటం అనేది మహిళల సహజ స్వభావం. భవిష్యత్తులో వచ్చే అవసరాలను దృష్టిలో ఉంచుకొని, ఖర్చులు తగ్గించడం, డబ్బును నిలువ చేయటం చేసేవారు. సాధ్యమైనంత వరకు కుటుంబ నిర్వహణలో కాని, అవసరాల నిమిత్తం కాని ఇతరులపై ఆధారపడకుండా తామే స్వయంగా నిర్వహించుకునే వారు.
‘‘ఖర్చు తగ్గించుకోవడమే పెద్ద పొదుపు’’ అనే విషయాన్ని మహిళలు మనకు చూపించారు. ఇంటి ఆవరణలో కూరగాయలు పెంచటం, ఆముదపు గింజల నుండి నూనె తీయటం వంటివాటి ద్వారా అవసరాలను తీర్చేవారు. పుష్టికరమైన, నిలువ ఉండే చిరుతిండ్లను తయారు చేసుకోవటం వలన బయటి పదార్థాలను తిని అనారోగ్యం కొనితెచ్చుకునే పరిస్థితి ఉండేది కాదు. పిల్లల, పెద్దల ఆరోగ్య విషయాలలో మన బామ్మలు / అమ్మమ్మలు చేసే చిట్కాలవల్ల చిన్నచిన్న విషయాలకి వైద్యుల వద్దకు పరిగెత్తి వేలకువేలు డబ్బు వదుల్చుకునే అవసరం వచ్చేది కాదు.
పొదుపు చేయటం ఒక ఎత్తయితే, దానిని నిలువ చేయటం కూడా మన మహిళలకు స్వభావసిద్ధమైన విషయమే. బంగారు నగలు చేయించడం, హుండీలో నిలువ ఉంచటం వీటి వలన వివాహాలవంటి పెద్ద కార్యక్రమాలలో ఒకేసారి పెద్దమొత్తాల అవసరంపడేది కాదు. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకునేవారు.
ఇవన్నీ కుటుంబపరంగా మహిళల నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తే, డ్వాక్రా బృందాలుగా, పొదుపు సంఘాలుగా ఏర్పడి వ్యక్తిగతంగా ఆర్థిక స్వావలంబన అలవరచు కోవటమేకాక, సమాజంలో గొప్ప ఆర్థిక శక్తిగా తమ పాత్ర పోషిస్తున్నారు మహిళలు.
అర ఎకరంలో అత్యధిక దిగుబడి సాధించిన మహిళారైతు, కోట్ల రూపాయలు వ్యాపారాలను నిర్వహించే మహిళ పారిశ్రామిక వేత్తలు, పూర్తిగా మహిళలే నిర్వహించే బ్యాంకు శాఖలు, ఇటువంటివన్నీ దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల స్థానానికి, వారి నిర్వహణా సామర్థ్యానికి నిదర్శనాలు.
ఆర్థిక స్వావలంబన, ఆర్థికపుష్టితో పాటుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించటంలో కూడా మహిళలే ముందుండటం మనం చూస్తున్నదే. ఏ పనికి ఉద్దేశించిన పైకాన్ని అందుకోసమే ఖర్చు చేయటం, దానికోసం విడిగా తీసి ఉంచటం వారికి అలవాటు. నెల ఆదాయం చేతికి రాగానే బకాయి, ఇతర చెల్లింపులు ముందుగా పూర్తి చేయటం తరువాత మిగిలిన దానితో నెలవారీ ఖర్చులు పోగా ఇంకా కొంత మొత్తాన్ని పొదుపు చేయటం వారికి సహజంగా అలవాటైన పని. అది వారి ఆర్థిక క్రమశిక్షణకు తార్కాణం. మనదేశంలో ఎంత బీదవారైనా కనీసం కొంతైనా బంగారాన్ని నిలువ చేసుకోగలిగేవారు. ఇటువంటి లక్షణం, సహజ ప్రతిభ కలిగి ఉండటం వల్లనే కొన్ని సంవత్సరాల క్రితం ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంలో కూరుకొని పోయినపుడు కూడా మన ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉన్నది.
– పద్మ