తిరుపతిలో ”తిరుపడి సిరిసంత”..ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన
భావి తరాలకు వ్యవసాయాన్ని పరిచయం చేయాలన్న లక్ష్యంతో ‘‘తిరుపతి సిరిసంత’’ నిర్వాహకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయం అంటే కూరగాయలు, ఆకుకూరలు, ధాన్యం, పప్పు ధాన్యాలే కాదు.. ప్రకృతి సహజ ఆయుర్వేదం, మట్టిబొమ్మలు, ఆటబొమ్మలు ఇలా ఎన్నో అంశాలుంటాయని ఇందులో చూపించారు. ‘‘కనెక్ట్ టు ఫార్మర్స్’’అనే సంస్థ తిరుపతిలో ‘‘తిరుపడి సిరిసంత’’ ను నిర్వహించారు. ఇందులో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, గో ఆధారిత ఆహార ఉత్పత్తులు, దేశీ విత్తనాలను మహతి కళాక్షేత్రం వేదికగా తిరుపతి సిరిసంత ఆర్గానిక్ మేళా నిర్వహించారు.
ఇందులో భాగంగా ‘‘రైతులతో ఒక్కరోజు మీ చిన్నారులు’’ అనే అంశంతో కార్యక్రమాలు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శించారు. చిన్నారుల కోసం బంక మట్టితో బొమ్మల తయారీ, తాటి ఆకులతో గిలకల తయారీ, వివిధ ఆకృతుల్లో ఆకులతో తయారు చేసిన బొమ్మలను ప్రదర్శించారు. అలాగే ఈ ఆర్గానిక్ మేళాలో దేశవాళీ విత్తనాలు, అరుదైన వనమూళికలను ఇక్కడి స్టాల్స్‌లో ప్రదర్శించారు. దట్టమైన అడవుల్లో సహజంగా సహజ రంగుల్లో వుండే గింజలను తమిళనాడుకి చెందిన రైతులు ప్రదర్శించారు.