శయన ఏకాదశి
తెలుగు మాసాల్లో వచ్చే నాలుగో నెల ఆషాఢ మాసం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం. అమ్మవారి దేవీ నవరాత్రులు, గురుపూర్ణిమ, బోనాలు లాంటి పర్వదినాలు ఉన్నాయి.
శ్రీమహావిస్ణువు యోగనిద్రలోకి వెళ్లే రోజు శయన ఏకాదశి
ఆషాఢ శుద్ద ఏకాదశినే తొలి ఏకాదశీ అనీ, హరివాసరం అనీ, శయనైకాదశి అనీ, పేలాల పండగ అనే వివిధపేర్లతో పిలుస్తారు. ఈరోజు నుంచి నాలుగు నెలలపాటు అంటే కార్తీక శుద్ద ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటాం.
ఈ ఏకాదశి నుంచి కార్తీక శుద్ద ఏకాదశి వరకు, నాలుగు నెలలపాటు చాతుర్మాస్య దీక్ష చేస్తారు. పూర్వకాలంలో అన్ని వర్గాల ప్రజలు ఈ దీక్ష ను చేపట్టేవారట. ఇప్పటికీ కొందరు పాటిస్తున్నా, మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్న వారు విధిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ దీక్షాపరులు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు కఠిన నిష్ఠతో పాటిస్తారు. బౌద్ధులు, జైనులు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరిస్తారు.
కృతజ్ఞతను సూచించే గురుపౌర్ణమి
ఈ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. దీన్నే వ్యాసపూర్ణిమ అంటారు. గురువంటే అజ్ఞానాన్ని దూరం చేసే దైవస్వరూపం! అందుకే వ్యాస భగవానుడు జ్ఞానాన్ని అందించే ప్రతి వ్యక్తిలోనూ తాను ఉంటానని చెప్పారు. కాబట్టి ఈ రోజున గురువులు, ఉపాధ్యాయులు, పండితులు… ఇలా జ్ఞానానికి ప్రతిరూపాలైన ప్రతి ఒక్కరినీ ఆరాధించుకో వచ్చు. గురుపౌర్ణమి కృతజ్ఞతను సూచించే పండుగ కాబట్టి గురువు పట్ల శ్రద్ధే ఈ రోజు ఉన్న ఏకైక నియమం!