లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత ఆశన్న.. మరో 208 మంది కూడా
మావోయిస్టు పార్టీ అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆయనతో పాటు మరో 208 మంది మావోయిస్టులు కూడా వున్నారు. మావోయిస్టు చరిత్రలో ఇదే అతిపెద్ద లొంగుబాటు. వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు వున్నారు. వీరు మొత్తం 153 ఆయుధాలు అప్పగించగా, వీటిల్లో 19 ఏకే 47, 17 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్ లు, తదితర ఆయుధాలున్నాయి.
అలాగే ఈ 208 మందిలో కేంద్ర కమిటీ సభ్యుడు, నలుగురు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు, ఒక ప్రాంతీయ కమిటీ సభ్యుడు, 21 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 61 మంది ఏరియా సభ్యులున్నారు.

ఇదో చారిత్రక దినం : ముఖ్యమంత్రి ప్రకటన
ఏకంగా 208 మంది మావోయిస్టులు లొంగిపోవడాన్ని ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ సాయి స్వాగతించారు. ఇదో చారిత్రక దినమని అభివర్ణించారు. వీరందరికీ నైపుణ్యాభివృద్ధి, పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు. ‘‘ఛత్తీస్ గఢ్ కే కాదు.. దేశం మొత్తానికి చారిత్రాత్మక రోజు. ఈ రోజు పెద్ద సంఖ్యలో నక్సలైట్లు లొంగిపోయి, ప్రధాన స్రవంతిలోకి చేరారు. ప్రభుత్వం వారికి నైపుణ్యం కల్పించి, పునరావాసం కల్పిస్తాం. మిగతా వారు కూడా ఆయుధాలు వీడి, జన జీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిస్తున్నాం’’ అని ప్రకటించారు.