తోటకూర
తోటకూర తినటం వలన శరీరంలోని వేడి తగ్గుతుంది. శరీరంలో సమశీతోష్ణస్థితిని నిలిపి ఉంచుతుంది. ఋషిపంచమి వంటి పుణ్యదినాల్లో మరియు వ్రతాల్లో దానం చేయతగ్గ పవిత్రశాకం.
తోటకూర మూడు లేక మూడున్నర అడుగుల వరకు ఎదిగే చిన్నమొక్క. తోటకూరని ఏడాది పొడుగునా పెంచుకోవచ్చు. విత్తనం మొలకెత్తి మూడో ఆకు వేసేదాకా తోటకూరవిత్తనాలు చల్లిన మళ్ల మీద అరటిసోరగు కాని ఎండు కొబ్బరిఆకులు కాని కప్పి ఉంచాలి. ఇలా చేయడం వలన పక్షుల నుంచి విత్తనాలను కాపాడవచ్చు.
మడిలో విత్తులు ఒత్తుగా చల్లడమే మంచిది. లేతగా ఉండగానే నడుమనడుమ కొన్ని మొక్కలని పీకేస్తూ కూరకు ఉపయోగిస్తుంటే ఉన్న మొక్కలు ముదిరి బాగా కాస్తాయి. ఇలా ముదిరిన మొక్కల కాడలు కూరకి, పులుసుకి పనికివస్తాయి. తోటకూరలో అనేక రకాలు ఉన్నాయి. పెరుగుతోట కూర, కొయ్యతోటకూర, చిలుకతోట కూర, ఎర్రతోట కూర, ముళ్లతోటకూర మెదలైనవి.
కొయ్యతోటకూర బాగా వేడిచేస్తుంది. కాబట్టే దీనిని బాలింతలకు, నంజు వ్యాధి కలవారికి విరివిగా వాడవలెను. వాత తత్వం కలవారికి ఈ కూర మేలు చేస్తుంది. కొయ్యతోటకూరని మండు వేసవిలో కూడా పెంచుకొవచ్చు. ముళ్లతోటకూర ఆకులని పప్పుకూరగా వండి పెడితే బాలింతలకు పాలు పడతాయి.
చిలకతోటకూర పెరళ్ళలో బాగా ఎదుగు తుంది. పెరుగుతోటకూర ఆకులు నూరిన ముద్దకడితే గాయాలు మానుతాయి. మలబద్ధకాన్ని తొలగించడంలో ఆకుకూరలలో తోటకూర సాటిలేనిది.
అన్నిరకాల తోటకూరలో ఇనుము ఉంది అని శాస్త్రవేత్తలు పరిశోధనలలో కనుగొన్నారు. ఇది పుల్లకూరగా, తీయకూరగా, పప్పుకూరగా, పులుసుగా వండుకుంటారు.
– ఉషాలావణ్య పప్పు