కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా వ్యవసాయ శిక్షణ : ఐసీఏఆర్
వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నామని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఎడ్యుకేషన్) డాక్టర్ ఆర్‌సీ అగర్వాల్ తెలిపారు. ఆదివారం రాజేంద్రనగర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ (నార్మ్) 49వ వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా అగర్వాల్ హాజరై మాట్లాడారు. వ్యవసాయ డిప్లొమా కోర్సులతో విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, స్వయం ఉపాధి దొరుకుతాయని వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ పద్మరాజు చెప్పారు. ఏ-ఐడియా ద్వా రా దేశవ్యాప్తంగా 321 స్టార్టప్‌లకు సహకారాన్ని అందిస్తున్నామని నార్మ్ డైరెక్టర్ శ్రీనివాస్‌రావు తెలిపారు. ప్రైవేటు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో పాటు 56 ఐసీఎఆర్ ఇనిస్టిట్యూట్‌లతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఇన్నోవేటివ్ రైతులు, స్టార్టప్, ప్రింట్ మీడియా, పీజీ స్టూడెంట్‌లకు అవార్డులను అందజేశారు. కార్యక్రమంలో నార్మ్ ఇన్‌చార్జి జాయింట్ డైరెక్టర్ రమాసుబ్రహ్మణ్యం, వివేక్ పూర్వర్, జాకీర్‌కిల్జీ పాల్గొన్నారు.