చెట్లు, మొక్కలంటే అందరి తలలో నాలుక ‘‘తులసీ గౌడ’’

కర్నాటక వృక్షమాతగా పేరు గాంచిన, పద్మశ్రీ పురస్కార గ్రహీత తులసీ గౌడ (86) కన్నుమూశారు. వయో సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. పశ్చిమ కనుమలు, కార్వార, అంకోలా చుట్టుపక్కల అడవుల్లో 35 వేలకు పైగా మొక్కలు నాటారు. ఆయా ప్రాంతాల్లోని స్థానికులు, హాలక్కి ఒక్కలిగ సముదాయ ప్రతినిధులతో 10 లక్షల మొక్కలు నాటారు. ఈమె సేవలకు 2021 లో అప్పటి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఉత్తర కన్నడ జిల్లావ్యాప్తంగా ఆమె పర్యావరణంపై సుదీర్ఘకాలం నిస్వార్థంగా పనిచేశారు. బాల్యవివాహం చేసుకున్న ఆమె చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. అప్పటినుంచి పర్యావరణ ప్రేమికురాలిగా కొనసాగారు. 1944 సంవత్సరంలో తులసి గౌడ కర్ణాటకలోని హొన్నాలి గ్రామంలో పుట్టారు. అయితే చిన్ననాటి నుంచే తులసి గౌడకు చెట్లు అంటే చాలా ఇష్టం. వాటిని పెంచేందుకు ఆమె చాలా ఆసక్తి కనబరిచేవారు. ఈక్రమంలోనే ఆమె అటవీ శాఖ నర్సరీలో రోజువారీ కూలీగా పని చేయడం ప్రారంభించారు. అలా పని చేస్తూనే వేలాది చెట్లు నాటి అడవుల పెంపకానికి ఆజ్యం పోశారు.

హలక్కీ గిరిజన సమాజానికి చెందిన తులసి గౌడ ఆరు శతాబ్దాలకు పైగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణ కోసం అంకితం చేశారు. అంకోలాతో పాటు పరిసర ప్రాంతాల్లో వేలాది చెట్లను నాటి ఆ ప్రాంతమంతటినీ పచ్చగా విరిసేలా చేసింది. ఇలా అక్కడి ప్రజలందరి దృష్టిలో పడిన ఈమెకు అందరూ చెట్టు తల్లి అని పేరు పెట్టుకున్నారు. అంతేకాకుండా తులసి గౌడకు చెట్లపై ఉన్న అసమానమైన జ్ఞానం వల్ల ఆమెకు “ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ప్లాంట్స్” అనే బిరుదును కూడా ఇచ్చారు.

కాళ్లకు చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి.. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ఈమె అవార్డును అందుకొని.. అందరి కళ్లల్లో పడ్డారు. పద్మశ్రీ అవార్డు వరించడంతో ఈమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాతే ఆమె కృషిని మెచ్చిన ధార్వాడ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం.. డాక్టరేట్‌ను కూడా అందజేసింది. ఇది మాత్రమే కాకుండా తులసి గౌడ తన జీవితకాలంలో ఇందిరా ప్రియదర్శిని వృక్ష మిత్ర అవార్డుతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. ఇక తులసికి చదువు లేకపోయినా చెట్ల గురించి ఎంతో అవగాహన ఉంది. చెట్లను ఎప్పుడు నాటాలి.? ఎన్ని నీళ్లు పోయాలి, వాటి ఔషధ గుణాలు ఏంటి అన్న విషయాన్ని సులభంగా చెప్పేస్తారు. శాస్త్రవేత్తలు కూడా ఆమె విజ్ఙానాన్ని చూసి అబ్బుర పడుతుంటారు. ఇక పర్యావరవేత్తలైతే ఆమెను ‘ఎన్‌సైక్లోపిడియా ఆఫ్‌ ఫారెస్ట్‌’గా పిలుస్తారు.

విత్తనాలు నాటి, అవి మొలిచి, ఏ ఆటంకం లేకుండా పెరిగేలా చేయడం తులసి చేసే పని ప్రత్యేకత. 35 సంవత్సరాలు ఆమె నర్సరీలో కూలీగా పనిచేశారు. ఈమె పనితనం, మొక్కలపై ఆమె ప్రేమను చూసిన నర్సరీ యాజమాన్యం శాశ్వత ఉద్యోగిగా నియమించింది. అనేక వేల సంవత్సరాలు వృక్షాలు పెంచి, సస్యశ్యామలం చేశారు. రిటైర్డ్ అయినా… గతంలో లాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అడవుల నాశనంపై ఎప్పుడూ ఆమె ప్రభుత్వాలను, ప్రజలను హెచ్చరిస్తూనే వచ్చారు.

విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలన్న విద్య తులసీ గౌడకి బాగా తెలుసు. ఇవన్నీ తడుముకోకుండా చెప్పేస్తారు. కర్నాటకతో పాటు మరికొన్ని ప్రాంతాలలో మొక్కలు, వృక్షాలంటే అందరి తలలో నాలుక తులసీ గౌడ. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేభం అడిగినా.. చిటికెలో చెప్పేస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకూ కాపాడుతుండటం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని పిలుస్తుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *