గిరిజన ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి సాధికూరత చేకూర్చేలా వుండాలి : హోసబళే
భారత్ జాతీయ గుర్తింపును రూపొందించడంలో గిరిజన వారసత్వం కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే అన్నారు.వనవాసీ కల్యాణాశ్రమం స్థాపన జరిగినప్పటి నుంచీ సమర్థవంతమైన, గౌరవనీయ, స్వావలంబనతో కూడిన గిరిజన సమాజాన్ని నిర్మించడానికి కట్టుబడి వుందన్నారు. ఢిల్లీలోలోని పుష్ప విహార్ లో వనవాసీ కల్యాణాశ్రమ్ తరపున భగవాన్ బిర్సాముండా భవన్ – వనవాసీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ భవన ప్రారంభోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా దత్తాత్రేయ హోసబళే మాట్లాడుతూ..వనవాసీ గుర్తింపు, ఉనికి కోసం, వారి సంస్కృతులను రక్షించడానికి, వారి సర్వతోముఖాభివృద్ధికి వనవాసీ కల్యాణాశ్రమం అవిశ్రాంతంగా కృషి చేస్తూనే వుందన్నారు. గిరిజన ప్రాంతాలలో అభివృద్ధి కార్యక్రమాలతో వారికి సాధికారత చేకూర్చాలే తప్పించి, వారు అక్కడి నుంచి వలస వెళ్లేలా వుండొద్దని నొక్కి చెప్పారు. వనవాసీ సంస్కృతి కేవలం మ్యూజియానికే పరిమితం కాకుండా అదో సజీవ సంస్కృతిలా అందరూ చూడాల్సిన అవసరం వుందన్నారు. ఈ పనిని భగవాన్ బిర్సాముండా భవన్ మాధ్యమంగా ఈ పని సమర్థవంతంగా ముందుకు సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి విష్ణుకాంత్ మాట్లాడుతూ.. బిర్సా ముండా భవన్ నిర్మాణానికి జరిగిన ప్రయత్నాల గురించి వివరాలను తెలియజేశారు. ఈ భవనం ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యాలతో, ఏ ప్రయోజనాలను ఆశించి, నిర్మాణం చేశారో వివరించారు.
ఇక.. ఈ కార్యక్రమానికి వనవాసీ కల్యాణాశ్రమం అఖిల భారతీయ అధ్యక్షుడు సత్యేంద్ర సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనవాసీ సమాజం ముందు నుంచే ప్రకృతిని ఆరాధిస్తూ వస్తోందని, జీవిత విలువలను ప్రకృతితో మమేకం చేసి, రక్షిస్తున్నారన్నారు. వనవాసుల సర్వాంగీణ వికాసానికి కల్యాణాశ్రమం నిరంతరం పాటుబడుతూనే వుందన్నారు.
ఇక.. రూర్కీలోని జీవన్ దీప్ ఆశ్రమం పూజ్య మహా మండలేశ్వర్ స్వామి యతీంద్రనాథ్ గిరిజీ మహారాజ్ మాట్లాడుతూ.. ఈ ప్రయత్నం యావత్ గిరిజన సమాజానికి, దేశానికి సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదని అభిప్రాయపడ్డారు. ప్రకృతిని ఫణంగా పెట్టి, చేసే అభివృద్ధి అభివృద్ధే కాదని, అదో విధ్వంసం అని అన్నారు. కల్యాణాశ్రమం ద్వారా వనవాసీ క్షేత్రాల్లో జరిగే కార్యక్రమాలు పవిత్రమైన సేవ అని, దైవిక కార్యమని అభివర్ణించారు.