గిరిజన మహిళల్లో ఆర్థిక స్వావలంబన కోసం ఏకలవ్య ఫౌండేషన్, నాబార్డ్ ప్రయత్నాలు

గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు అధికంగా వుండే ప్రాంతాల్లో వారిని ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ఏకలవ్య ఫౌండేషన్ ఇతోధికంగా పనిచేస్తూనే వుంది. దీనికి తోడు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) కూడా కృషి చేస్తోంది. దీంతో గిరిజనుల జీవితాల్లోఆర్థిక, సామాజిక స్థితిగతులు బాగా మెరుగవుతున్నాయి. 2021 లో దేశంలోనే మొదటి సారిగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీల కోసం పైలెట్ ప్రాజెక్టుగా ‘‘జీవనోపాధుల అభివృద్ధి పథకాన్ని’’ వీరు చేపట్టారు. జిల్లాలోని సిర్పూర్, లింగపూర్ మండలాల్లో 21 గ్రామాల్లో గిరిజనాభివృద్ధి నిధులు 3.18 కోట్లను ఖర్చు చేశారు. దీంతో పారదర్శకంగా ఎంపిక చేసిన కుటుంబాలకు జీవనోపాధి కల్పించింది. ఈ పథకాన్ని ఏకలవ్య ఫౌండేషన్ అత్యంత సమర్థవంతంగా అమలు చేసింది. దీంతో సత్ఫలితాలిస్తోంది. నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ నేరుగా ఈ లబ్ధిదారులతోనే మాట్లాడారు.

కుట్టుమిషన్ , మేకల పెంపకం ఆవుల పోషణ; రైస్ మిల్లర్, పిండిగిర్ని, లేడీస్ ఎంపోరియం, ఆన్ లైన్ సెంటర్లు, నాటుకోళ్ల పెంపకం, వడ్రంగి, ప్లేట్లను తయారీ చేయడం లాంటి యూనిట్లను ఏర్పర్చారు. ఇవి నడుపుకోడానికి లబ్ధిదారులకు నాబార్డు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇలా 500 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందాయి. 3.18 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు అధికారులు తెలిపారు. లబ్ధి దారుల వాటాధనం కింద 46 లక్షలున్నాయని తెలిపారు.

మరో ప్రయోగం కూడా చేస్తున్నారు. నాబార్డు కేటాయించిన నిధులతో పాటు 10 శాతం లబ్ధిదారుల వాటా ధనాన్ని సేకరించి, ప్రజల భాగస్వామ్యంతో పథకాన్ని అమలు చేస్తున్నారు.జీవనోపాధులు మరింత మెరుగు అవడానికి ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. వీరి ద్వారా గ్రామ సభలు నిర్వహించి, పథకాలను అమలు చేస్తున్నారు. మరింత అవగాహన కోసం గ్రామ వికాస కమిటీలు కూడా పనిచేస్తున్నాయి.

పేద ఆదివాసీ రైతు కుటుంబాలు సంపాదించే ప్రతి రూపాయి పొదుపు చేసుకోవడం, వృథా ఖర్చులను తగ్గించుకునే విధంగా వారికి ఆర్థిక క్రమశిక్షణ కల్పించామని ఏకలవ్య ఫౌండేషన్ ఛైర్మన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. అలాగే మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేసినప్పుడు కుటుంబాలు కూడా బాగుపడతాయని పేర్కొన్నారు. ఇప్పటికే కొంత మార్పు సాధ్యమైందని, రాబోయే రోజుల్లో గిరిజన మహిళలు, గిరిజన మహిళా రైతులు మరింత ఆర్థిక స్వావలంబనను చేకూర్చే దిశగా అడుగులు పడతాయని ప్రకటించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *