వెదురు ఉత్పత్తులతో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న గిరిజన మహిళలు
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో ఉక్కిరి బిక్కిరి అవుతున్న నేటి ప్రపంచంలో తెలంగాణలోని అటవీ ప్రాంతంలో మాత్రం అత్యంత నిశ్శబ్దంగా పరివర్తన వస్తోంది. మంచిర్యాల జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఒకప్పుడు అక్కడి మహిళలు వ్యవసాయ కూలీలుగా వుండేవారు. కానీ.. ఇప్పుడు అక్కడి ప్రకృతిపై ఆధారపడుతూ.. వెదురుతో ఫర్నీచర్లు, ఇతరత్రా వస్తువులతో పాటు యుటిలిటీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. దీని ద్వారా స్థిరమైన ఆదాయాన్ని సంపాదించడంతో పాటు స్వావలంబన దిశగా మహిళలు ముందుకు సాగుతున్నారు. వారి జీవనోపాధి కూడా లభిస్తోంది.
అయితే.. ఇక్కడి మహిళలకు హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సహకారంతో సహకారంతో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అలాగే కవాల్ టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని మహిళలకు నైపుణ్యాభివృద్ధి కోసం అనేక వర్క్ షాపులను కూడా నిర్వహిస్తోంది. వీటి ద్వారా మహిళలు వెదురుతో మరిన్ని రకాల ఉత్పత్తులను సృష్టిస్తున్నారు. వీటి ద్వారా అట్టడుగున వున్న గిరిజన వర్గాల మహిళల్లో ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి కూడా లభిస్తోంది. ఇప్పటి వరకు చుట్టుపక్కల గ్రామాలలో దాదాపు 300 మంది వనవాసీ మహిళలు రకరకాల శిక్షణను పొంది, ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు.
జన్నారం మండలం ఇంధన్ పల్లి గ్రామంలోని నాయకపుగూడెం అనే గిరిజన గ్రామంలో కూడా మహిళల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణా తరగతులు జరిగాయి. దాదాపు 45 మంది మహిళలను వెదురు ఫర్నీచర్, ఉత్పత్తులను తయారు చేసే కళను నేర్చుకుంటున్నారు. నిపుణులు వీరికి నేర్పిస్తున్నారు.
సోఫా సెట్లు, కుర్చీలు, మొబైల్ స్టాండ్, పెన్ హోల్డర్లు, బ్యాంగిల్ స్టాండులు, ఆఫీస్ ట్రేలు, ఫ్లవర్ వాజ్, పరీక్షా ప్యాడ్, ఫోల్డబుల్ రిలాక్సింగ్ కుర్చీలు, కాఫీ ట్రే, అలంకరణ వస్తువులతో పాటు అనేక ఉత్పత్తులను ఈ వెదురు ద్వారా మహిళలు తయారు చేస్తున్నారు. వెదురు అనేది పర్యావరణ అనుకూలం. కలుషితమైన ప్రపంచంలో ప్లాస్టిక్‌కు బలమైన ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు.వెదురు ఆధారిత ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే కాకుండా అటవీ ఆధారిత వర్గాలకు స్థిరమైన ఆదాయ అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వీరికి మార్కెట్ సౌకర్యం కూడా అలాగే వస్తోంది.
దీనిపై గిరిజన మహిళలు కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంతకు పూర్వం రోజూ వ్యవసాయ కూలీలుగా వుండేవారమని, ఆదాయం చాలా తక్కువగా వుండేదని, కానీ.. ఇప్పుడు వెదురు ఉత్పత్తులతో తమ ఆదాయం పెరుగుతోందని అన్నారు. వెదురు ఉత్పత్తులతో, ఆదాయం మెరుగ్గా ఉంటుంది” అని వారు చెప్పారు, అస్సాం వెదురుతో తయారు చేసిన వస్తువులను సందర్శకులకు `2,000 నుండి `3,000 వరకు అమ్ముతున్నామని తెలిపారు.
వెదురు సోఫా సెట్లు తయారు చేయడం నేర్చుకోవడం ఆసక్తికరంగా మరియు ప్రతిఫలం కూడా వస్తోందన్నారు. ప్రతి రోజూ 600 రూపాయలు సంపాదిస్తున్నామని, కొన్ని చోట్ల 400 రూపాయలు కూడా లభిస్తోందని పేర్కొంటున్నారు.