దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు : నిందితులకు ఉరిశిక్ష
దేశ వ్యాప్తంగా అత్యంత సంచలనం రేపిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పేలుళ్లకు పాల్పడిన ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. 2016 లో నిందితులకు ఉరిశిక్ష విధించిన ఎన్ఐఏ కోర్టు తీర్పును కూడా హైకోర్టు సమర్థించింది. మరోవైపు ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ ఐదుగురు దోషులు దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు డిస్మిస్ చేసింది.ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్, జియా ఉర్ రహ్మాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షుక్ వున్నారు.
2013 ఫిబ్రవరి 21 న దిల్ సుఖ్ నగర్ లోని బస్టాపులో, మిర్చిపాయింట్ దగ్గర జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మరణించారు. 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పట్లో ఇది అత్యంత సంచలనమైంది. ఈ బాంబు పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులుండగా… ఏ1 నిందితుడు రియాజ్ బత్కల్. ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. మిగతా ఐదుగురికి 2016 లో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించింద. దీంతో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు మంగళవారం తుది తీర్పునిచ్చింది. నిందితులకు ఉరి శిక్షే సరైందని తీర్పునిచ్చింది.