టీటీడీలోని హైందవేతర ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగిస్తాం : బోర్డు కీలక నిర్ణయం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. చాలా రోజులుగా అన్యమతస్తులు టీటీడీలో పాతుకుపోయారు. ఈ నేపథ్యంలో హైందవేతర ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను వీఆర్ఎస్ లేదా ప్రభుత్వ శాఖల్లోకి బదిలీ చేయాలని నిర్ణయించింది. టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సోమవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అలాగే అత్యంత పవిత్రమైన కొండపై రాజకీయాలు మాట్లాడడాన్ని కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే టీటీడీ చైర్మన్ అని ప్రకటించగానే… అప్పటి నుంచీ టీటీడీలో హిందువులే ఉద్యోగులుగా వుండాలని బీఆర్ నాయుడు చెబుతూ వస్తున్నారు. తమ నిర్ణయానికి పలు ఉద్యోగ సంఘాలు కూడా మద్దతుగా నిలిచాయని చెబుతున్నారు.
తిరుమల కొండపై పనిచేస్తున్న హైందవేతరులను వెంటనే తొలగించాలన్నది చాలా రోజులుగా హిందువులు, భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ రాజకీయ కారణాల వల్ల అది అలాగే వుండిపోయింది. ఇప్పుడు అది కార్యరూపం దాల్చనుంది. హైందవేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ అయినా చేయాలి, లేదా వేరే చోటికి బదిలీ అయినా కావాలని బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని శ్రీవారి భక్తులు, హిందువులు కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం టీటీడీలో 7000 మంది పనిచేస్తున్నారు. అందులో దాదాపు 400,500 మంది హైందవేతరులు వున్నట్లు తెలుస్తోంది. అలాగే 14 వేల మంది కాంట్రాక్ట్ పై పనిచేస్తున్నారు. తాజాగా కొండపై జరిగిన పరిణామాల నేపథ్యంలో టీటీడీ బోర్డు హైందవేతరుల ఉద్యోగులను ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించింది. అయితే… ఆలయ పనుల్లో కేవలం హిందువులే ఉద్యోగులుగా వుండాలని బోర్డు ఇప్పటికే మూడు సార్లు నిర్ణయం తీసుకుంది.
1989 లో ప్రభుత్వం ఓ ఉత్తర్వు కూడా జారీ చేసింది. అందులో హిందువులు మాత్రమే పనిచేయాలని పేర్కొంది కూడా. అయితే… ఇప్పుటికీ హైందవేతరులు అక్కడ పనిచేస్తున్నారు. బోర్డు తాజా నిర్ణయంతో టీటీడీలో భారీ మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.