మహా కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభమేళలో తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు సూచనలు చేశారు. శ్రీవారి ఆలయం ఏర్పాటు వ్లల ఉత్తరాది భక్తులు స్వామివారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కోరారు. 45 రోజుల పాటు సాగే మహాకుంభ మేళకు దాదాపు 2.50 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ నుంచి విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. తిరుమల తరహాలో కైంకర్యాలు చేపట్టాలని ఆదేశించారు.
శ్రీవారి కల్యాణోత్సవాలు, చక్రస్నానం తదితర కైంకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఆకట్టుకునేలా విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు చేపట్టాలని తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుని టీటీడీకి కేటాయించిన స్థలంలో రాజీలేకుండా మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు, కళా బృందాలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. యూపీ పోలీస్ అధికారులతో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు సమన్వయం చేసుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, డీపీపీ సెక్రటరీ రఘునాథ్, ప్రోగ్రాం ఆఫీసర్ రాజగోపాల్, అధికారులు పాల్గొన్నారు.