అయోధ్య రాముడికి టీటీడీ పట్టు వస్త్రాలు
అయోధ్య శ్రీరామచంద్రునికి తిరుమల వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు శ్రీరామ జన్మభుమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ బృందం స్వాగతం పలికారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్లి శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సందర్శన గొప్ప అనుభూతిని, ఆనందాన్ని కలిగించిందని బీఆర్ నాయుడు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఈ సంప్రదాయం కొనసాగిస్తామని చెప్పారు. అదేవిధంగా వెంకటేశ్వరస్వామికి కూడా అయోధ్య నుంచి భవిష్యత్లో వస్త్రాలు సమర్పించే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే ఇక్కడ టీటీడీ దేవాలయాల నిర్మాణానికి ఆలోచిస్తున్నామని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానులు, ముఖ్య ప్రాంతాల్లో టీటీడీ టెంపుల్స్ నిర్మాణానికి ఇప్పటికే సూచనలు చేశారని పేర్కొన్నారు. అయోధ్యలో బాలాజీ దేవాలయ నిర్మాణానికి భూమిని కేటాయించాల్సిందిగా ఇక్కడి ప్రభుత్వాన్ని కోరతామని బీఆర్ నాయుడు వెల్లడించారు.