పహల్గాం ఉగ్రదాడి : ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరి అరెస్ట్

పహల్గాం ఉగ్రదాడి విషయంలో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక పురోగతి సాధించింది. ఈ దాడులకు కారకులైన ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దర్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

‘‘పహల్గాం ఉగ్రదాడులకు కారణమైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వీజ్, బషీర్ ను అరెస్ట్ చేశాం. వారిని ప్రశ్నించగా.. ఉగ్రవాదుల పేర్లను వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారు పాక్ దేశీయులు. దాడి చేసిన వారికి లష్కరే తోయబాతో సంబంధాలున్నాయని చెప్పారు. దాడికి ముందు ఉగ్రవాదులని వారికి తెలిసే ఆశ్రయం ఇచ్చారు. ఆహారం, ఆశ్రయంతో పాటు రవాణా సదుపాయం కూడా కల్పించారు. మరింత దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఎన్ఐఏ పేర్కొంది.

వేల మంది సాక్షులను విచారించిన ఎన్‌ఐఏ అధికారులు గత రెండు వారాలుగా జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. మొత్తం 32 ప్రాంతాల్లో సోదాలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేశారు. వారిలో ఇద్దరు పహల్గాంలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఏప్రిల్ 22 న పహల్గాంలోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఇస్లామిక్ ఉగ్రదాడులు పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మతం అడిగి మరీ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీనికి ప్రతీకారంగానే భారత్ ఆపరేషన్ సింధూర చేపట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *