మథురలో ప్రారంభమైన ఆరెస్సెస్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండు రోజుల అఖిల భారతీయ కార్యకారి మండల్ బైఠక్ ప్రారంభమైంది. మథురాలోని దీనదయాళ్గౌ విజ్ఞాన్ అనుసంధన్, ఫరాహ్ గ్రామ్ లో ప్రారంభమైన ఈ సమావేశాలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళే భారత మాత చిత్రపటానికి పూల వేసి, నివాళులు అర్పించిన తదనంతరం ఈ సమావేశాలు ప్రారంభమయ్యాయి.ఇటీవలే పరమపదించిన పూజ్య రాఘవాచార్య మహారాజ్, పారిశ్రామిక వేత్త రతన్ టాటా, బెంగాల్ మాజీ సీఎం బుద్ధాదేవ్ భట్టాచార్య, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, సీపీఎం నేత సీతారాం ఏచూరి, కేంద్రమాజీ మంత్రి నట్వర్ సింగ్, మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోదీ, అడ్మిరల్ (రిటైర్డ్) రాందాస్ వంటి వారికి ఈ సమావేశంలో నివాళులు అర్పించారు. ఈ సమావేశాలు ఆదివారం సాయంత్రం 6:15 నిమిషాలకు ముగుస్తాయని అఖిల భారతీయ సహ ప్రచార ప్రముఖ్ నరేంద్ర కుమార్ తెలిపారు.
విజయ దశమి ఉత్సవం సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై లోతైన, విస్తృతమైన చర్చలు జరగనున్నాయి. అలాగే వాటి అమలుకు సంబంధించిన ప్రణాళికలు, దేశంలోని సమకాలీన పరిస్థితులపై కూడా చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు మొత్తం 11 క్షేత్రాలు మరియు 46 ప్రాంతాల నుంచి సంఘచాలకులు, సహ సంఘచాలకులు, కార్యవాహలు, ప్రచారకులతో సహా 393 మంది సభ్యులు హాజరయ్యారు. జమ్మూ కశ్మీర్, కేరళ, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. మార్చి 2025 వరకు దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన ప్రణాళికలపై కూడా చర్చిస్తారు. సమావేశాల్లో సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబళేతో సహా మొత్తం ఆరుగురు సహకార్యవహలు డాక్టర్ కృష్ణగోపాల్, ముకుంద, అరుణ్ కుమార్, రామదత్ చక్రధర్, అలోక్ కుమార్, అతుల్ లిమాయే సహా ఇతర అఖిల భారతీయ అధికారులు పాల్గొన్నారు.
ఈ సమావేశాల్లో సంఘ్ ను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తున్న సంస్థల కార్యకలాపాలు, విస్తరణ, ప్రణాళికలపై చర్చిస్తామని అంబేకర్ వెల్లడించారు. ఈ సమావేశాలకు సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు కార్యకారిణి సభ్యులందరూ హాజరవుతారని పేర్కొన్నారు.వీరితో పాటు ప్రాంత ప్రచారకులు, ప్రాంత సహప్రాంత ప్రచారకులు, ప్రాంత సంఘచాలకులు, ప్రాంత కార్యవాహలతో పాటు ప్రాంత సహ కార్యవాహలు కూడా పాల్గొంటారు. దాదాపు 393 మంది సదస్యులు ఇందులో పాల్గొంటారు.
వచ్చే విజయదశమి నాటికి సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని, ఈ సందర్భంగా రానున్న రోజుల్లో సంఘ్ ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? దేశ వ్యాప్తంగా నిర్వహించబోయే కార్యకలాపాలపై చర్చ ఈ సమావేశాల్లో వుంటుంది.
అలాగే ఈ విజయదశమి సందర్భంగా సరసంఘచాలక్ మోహన్ భాగవత్ చేసిన ప్రసంగంపై కూడా లోతైన చర్చ వుంటుందని, అలాగే సమాజాన్ని ఏకత్రీకరణ చేయడంపై కూడా చర్చలు సాగుతాయని అంబేకర్ పేర్కొన్నారు.ఈ ప్రసంగంలో సరసంఘచాలక్ పిల్లలపై ఇంటర్నెట్ ప్రభావం, ఇంటర్నెట్ విషయాలు ఎలాంటి ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయో కూడా ప్రస్తావించారని గుర్తు చేశారు.
ఈ అంశాలతో పాటు దయానంద సరస్వతీ, బిర్సాముండా, అహల్యాబాయి హోల్కర్, రాణి దుర్గావతి, పూజ్య సంత్ అనుకూల్ చంద్ర ఠాకూర్ సందేశాలను సమాజంలో ఎలా వ్యాప్తి చేయాలన్న దానిపై కూడా చర్చలుంటాయని, అయితే… ఈ అంశాలను సరసంఘచాలక్ మోహన్ భాగవత్ ఇప్పటికే వారి విజయదశమి ప్రసంగంలో స్పృశించారని గుర్తు చేశారు.