మనల్ని కాపాడే రెండు కళ్ళు….

బ్రహ్మదేవుడు తలరాతలు రాసేపనిలో తలమునకై ఉన్నాడు. ఇంతలో జీవుడు ‘నేను భూమిమీదకి వెళ్లను’ అని మారం చేయడం మొదలు పెట్టాడు. ‘భూమి మీద నాకు ఎవరూ తెలియదు, నేను ఎలా బతకగలను’ అని అడిగాడు. ‘నువ్వేమీ భయపడకు, నిన్ను మీనాక్షిలా పెద్ద కళ్లతో కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారు చేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘అయితే సరే, కానీ నాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏడుస్తా, అపుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి’ అనే షరతులు పెట్టాడు జీవుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. మరింకేదో అడిగేలోపల జీవుణ్ణి బ్రహ్మ క్రిందకి తోసేశాడు. జీవుడు అమ్మ పక్కన వచ్చిపడ్డాడు. అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న జీవుణ్ణి ఓ పెద్ద మనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయంవేసి జీవుడు అమ్మవైపు చూశాడు. ‘మీ నాన్నగారు రా’ అంటూ తన కంటిచూపుతో నాన్నను పరిచయం చేసింది. ‘నేను అన్ని చోట్ల ఉండడం కుదరదు కనుక అమ్మను సృష్టించాను’ అన్నాడే దేవుడు, మరి ఈ నాన్న ఎవరు? అని జీవుడు సందేహించి ఏడుపు మొదలెట్టాడు. ‘ఇప్పుడే కదా! భూమిమీద పడ్డావు, అప్పుడే ఏడుపేంటి?’ అన్నాడు బ్రహ్మ. ‘నాన్న గురించి చెప్పలేదే?’ అన్నాడు జీవుడు. ఒక  చిరునవ్వు నవ్వి ‘నీకు, మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు నాన్న’ అన్నాడు బ్రహ్మ. ఆరోజు నుంచి జీవుడి చిన్న కళ్లు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎపుడో ఉదయం వెళ్లి సాయంత్రం వచ్చేవాడు. జీవుడి మీద ప్రేమ వుంది కాబట్టే రోజంతా బయటికి వెళ్లి కష్టపడి పనిచేసివస్తున్నాడన్న మాట. సాయంత్రం ఇంటికి వచ్చిన నాన్న దగ్గరికి వెళ్లి జీవుడు నాన్న మొహం చూశాడు. నీరసంగా వుంది. పలకరింపు కోసం ఓ చిరునవ్వు నవ్వాడు. నాన్న ముఖంలోని నీరసం మాయమై పున్నమి చంద్రుడిలా మెరిసిపోయింది. జీవుడు నవ్విన ప్రతిసారి నాన్న ముఖంలో ఆనందం పదిరెట్లు ఎక్కువగా కనిపించేది. కొన్నాళ్లకు జీవుడు చిట్టి పాదాలకు కొంచెం బలం చేకూరి నడవడం మొదలెట్టాడు. నాన్న చూపుడువేలు అందించాడు. జీవుడు నిలబడగలిగాడు. నడకనేర్చిన తరువాత కొత్త గమ్యాలను వెతకడం ప్రారంభించాడు. భయంవేసింది. కాని వెనక్కు చూస్తే నాన్న కనపడ్డాడు. తగినంత స్వేచ్ఛనిస్తూ, ప్రయాణాన్ని గమనిస్తూ,  ఏ ప్రమాదం తాకకుండా,  రక్షణగా నాన్న వెనకే నడుస్తున్నాడు. అప్రయత్నంగా జీవుడి పెదువులు ‘నాన్న’  అని పలకడం మొదలెట్టాయి. నాన్న జీవుణ్ణి ముద్దులతో ముంచెత్తి, మళ్లీ మళ్లీ ‘నాన్న’ అని పిలవమన్నాడు. జీవుడు పిలచిన కొద్దీ నాన్న ముఖంలో ఆనందం రెట్టింపయింది.

‘‘అమ్మ నవమాసాలు మోసింది, పాలిచ్చింది, పెంచింది. ఎన్నో ఊడిగాలు చేసింది. మల మూత్రాలు ఎత్తింది. మంచి నీళ్లుతో స్నానం చేయించింది. మాయామర్మం లేకుండా సేవలు చేసింది. మంచిచెడులు చెప్పింది. జోలపాటలు పాడిరది. తప్పు చేస్తే సరిచేసింది. మన్నించింది.  కడుపు పండినందుకు దేవుడికి ముడుపులు కట్టింది. ప్రేమను పంచింది. కంటి రెప్పలా కాసింది. ఉగ్గుపాలతో ఉన్నత విలువలు రంగరించి పోసింది.  అక్కా, చెల్లి, అన్న, తమ్ముల బంధం తెలిపేది.  అన్నీ అమ్మే అయింది. పిల్లలు ఎదిగినా అమ్మ ప్రేమ మారలేదు. ఇప్పుడు నాన్న  అవసరాలన్నీ చెప్పకముందే తెలుసుకుని తీరుస్తున్నాడు. నాకు కష్టం వస్తే అమ్మ తీర్చేది. నాకు కష్టం రాకుండా నాన్న చూసుకున్నాడు’’ అని జీవుడు తన జీవితం నడిచిన తీరు నెమరు వేసుకున్నాడు. అమ్మానాన్న వెళ్లిపోయారు. జీవుడికి కూడా ఆఖరిక్షణం దగ్గరై తిరుగు ప్రయాణం మొదలెట్టాడు. ‘ఎలా సాగింది నీ జీవిత మజిలీ’ అన్నాడు బ్రహ్మ! ‘మీరు నా నోట ఏ మంత్రం పలికించకపోయినా నా జీవన చక్రం బాగా సాగింది ప్రభూ’ అన్నాడు జీవుడు . ‘పలికించకపోవడమేమిటి’ అంటూ బ్రహ్మ నాన్నగా ప్రత్యక్షమయ్యాడు. అపుడు తెలిసింది జీవుడికి అమ్మ దేవుని అంశ అనీ, నాన్న స్వయంగా దేవుడని. ‘సతమైశంఖచక్రాల సందులవైడూర్యము, గతిjైుమమ్ముకాచె కమలాక్షుడు’ అని అన్నమయ్య అన్న అన్నట్లు నాన్న కమలాక్షుడు.

  • హనుమత్‌ ప్రసాద్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *