శ్రీత్యాగరాజ ఆరాధనోత్సవాలు
కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన శ్రీత్యాగరాజు 1767 సం.లో జన్మించారు. తండ్రి శ్రీ కాకర్ల రామబ్రహ్మం. తిరువ య్యారులో స్థిరపడిన తెలుగు బ్రాహ్మణ కుటుంబం వీరిది. త్యాగయ్య బాల్యంలోనే తమ తాతగారైన కాళహస్తయ్యగారి దగ్గర వీణావాదనం నేర్చుకున్నారు. శొంఠి వెంకట రమణయ్యగారి శిష్యరికంలో శాస్త్రీయ సంగీతాన్ని పుక్కిటపట్టారు. వీరికి శ్రీరాముడంటే ఎనలేని భక్తి. వీరి భక్తి, సంగీతాలకు మెచ్చి నారదముని ‘స్వర్ణార్ణవం’ అనే గొప్ప సంగీత గ్రంథాన్ని ఇచ్చారు. నిరంతర రామనామ జపంతో, అనన్యసామాన్యమైన భక్తితో అనేక వేల కీర్తనలు రచించిన మహా వాగ్గేయకారుడు, ‘నాదబ్రహ్మ’ త్యాగయ్య. ఆయన అనేక కొత్త రాగాలను సృజించారు కూడా.
రాజ సత్కారాన్ని, ఆస్థానగౌరవాలను తిరస్కరించి నిధి కన్నా రాముని సన్నిధిమిన్న అని ప్రబోధించారు త్యాగయ్య. తన కృతులలో శ్రీరాముడిని కీర్తించడమేకాక మనం అలవరచుకోవలసిన సద్గుణాలను కూడా బోధించారు. వేలాదిమంది శిష్యప్రశిష్యుల ద్వారా శాస్త్రీయసంగీతాన్ని తరువాతి తరాలకు అందించారు. ఆ నాదయోగి తన 77న ఏట పుష్యబహుళ పంచమినాడు శ్రీరామునిలో ఐక్యమయ్యారు.
ప్రతి సంవత్సరం ఆయన వర్థంతినాడు ఆయన శిష్యప్రశిష్యులు కావేరీ ఒడ్డున ఉన్న ఆయన సమాధి దగ్గర ఆరాధనోత్సవాలు జరుపుతూ ఉన్నారు. గత 174 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆరాధనోత్సవాల రోజున దేశంలోని కర్ణాటక సంగీత విద్యాంసులందరూ అక్కడకు వచ్చి త్యాగయ్య రచించిన ‘ఘనరాగ పంచరత్నాలు’ అని పేర్కొనే ఐదు కీర్తనలను గానం చేస్తారు. ఈ సంవత్సరం జనవరి 22న ఈ త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.