ఉత్తరాఖండ్ లో అమలులోకి యూసీసీ
బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమల్లోకి వచ్చినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించిందని తెలిపారు. యూసీసీ అమలుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న ఒక రోజు ముందుగా, సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి యూసీసీ పోర్టల్ ను ఆవిష్కరిస్తారు. మొత్తం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో నివసించే రాష్ట్ర ప్రజలకు సహితం ఈ చట్టం అమలవుతుంది. అయితే, షెడ్యూల్డ్ తెగలకు అమలు కాదు.
ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ పూర్తయిందని చెప్పారు. “యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు దక్కేలా చూస్తాం” అని ముఖ్యమంత్రి వెల్లడించారు. “వికసిత భారత్, ఆత్మనిర్భర భారత్ సాధనకు ప్రధాని మోదీ చేస్తున్న మహా యజ్ఞం కోసం మేం అందిస్తున్న సమర్పణే యూసీసీ” అని ఆయన చెప్పారు.
గత పదేళ్లుగా ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో యూసీసీ అమలుపై బీజేపీ బలమైన హామీ ఇస్తూ వస్తోంది. ఎట్టకేలకు దాన్ని అమలు చేసే రోజు(2025 జనవరి 27) రానే వచ్చింది. యూసీసీ ముసాయిదా రూపకల్పనకు రాష్ట్ర సర్కారు పెద్ద కసరత్తు చేసింది.
ఇందుకోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో నిపుణుల కమిటీని 2022 మే 27న నియమించింది. ఈ కమిటీ దాదాపు ఏడాదిన్నర పాటు కసరత్తు చేసి నాలుగు సంచికల్లో సవివరమైన, సమగ్రమైన యూసీసీ ముసాయిదా బిల్లును తయారు చేసింది. ఈక్రమంలో ఉత్తరాఖండ్‌లోని అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించారు.