ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు… బోనం సమర్పిస్తున్న భక్తులు, ప్రముఖులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేకంగా రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీలకు ఒకటి, సాధారణ భక్తులకు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక… ఆర్టీసీ అధికారులు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. మరో వైపు ఆదివారం బోనాలు, సోమవారం రంగం (భవిష్యవాణి) వుంటుంది.
బోనాల పండగ సందర్భంగా సాధారణ భక్తులతో పాటు కేంద్ర మంత్రులు, గవర్నర్ దత్తాత్రేయ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బోనాలు కుటుంబ సమేతంగా వచ్చి బోనాలు సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదోచ్చారణల మధ్య స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందించారు. అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు అమ్మవారి శేష వస్త్రాలు అందించారు. ఇక… అమ్మవారికి తొలి బోనం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. తెల్లవారుజామున అమ్మవారికి మహా హారతి, కుంకుమ పూజ, అర్చనలు నిర్వహించారు. రైతులు పాడిపంటలతో సమృద్ధిగా వుండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. ఇక కేంద్ర మంత్రి కిషనన రెడ్డి కుటుంబ సభ్యులతో విచ్చేసి, అమ్మవారికి బోనం సమర్పించారు.