శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసు చర్య
4వ భాగం
హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర
ఉమ్రీ బ్యాంక్ దోపిడీ
1947 తర్వాత ఉక్కుమనిషి సర్దార్ పటేల్ భారతదేశంలో చిన్న పెద్ద సంస్థానాలన్నింటినీ కేంద్రంలో విలీనం చేశారు. కాని నిజాం పెత్తనం కింద ఉన్న హైద్రాబాద్ మాత్రం మొండిగా స్వతంత్ర ప్రతిపత్తిని కోరింది. అందువల్ల శస్త్రచికిత్స అవసరమైంది. ఆ శస్త్ర చికిత్సయే పోలీస్ చర్యగా పరిణమించింది. అంతకు పూర్వమే అనేకమంది విప్లవవీరులు మాజీ సంస్థాన నిరంకుశ పాలనకు అనేక బాకుపోట్లు పొడిచారు. అనేక మంది యువక వీరులు ప్రాణాలు అర్పించారు. ఈ సంఘటనలలో ఒకటి ఈ ‘‘ఉమ్రీ బ్యాంక్ దోపిడి’’.
ముదఖేడ్‌కర్ బలిదానం
1946 డిసెంబర్ 16 నాటి సాయంత్రం ఉమ్రీ స్టేట్‌బ్యాంక్ (హైద్రాబాద్) ఆవరణలో అకస్మాత్తుగా తుపాకీ కాల్పులకు దత్తాత్రేయ ముదఖేడ్‌కర్ భూమిమీద వొరిగాడు. అతని అన్న దిగంబర్‌రావ్ కూడ తీవ్రంగా గాయపడ్డాడు. కాల్పుల చప్పుడు తర్వాత స్థబ్దత వ్యాపించింది. బ్యాంక్ వాచ్‌మన్ అరబ్బీవాడు జరిపిన కాల్పులకు ముదఖేడ్‌కర్ సోదరులలో ఒకడు నేలకొరిగాడు. మాజీ హైద్రాబాద్ సంస్థానంలో ఉమ్రీపట్టణం ప్రత్తి వ్యాపారానికి ముఖ్యకేంద్రం. ఆ రోజుల్లో ప్రత్తితో నిండిన బండ్లు ఉమ్రీమార్కెట్టుకు వందల సంఖ్యలో వస్తున్నాయి. అది ప్రత్తిపంట కోసిన కాలం.
కాల్పులకు దారితీసిన అసలు విషయం చాలా మామూలైనది. ఉమ్రీ పట్టణంలో మత కలహాలు రెచ్చగొట్టేవారున్నారు ఆ రోజుల్లో. ఒక ముస్లిం ఒక దుకాణానికి వెళ్ళి అగ్గిపెట్టె కొన్నాడు. ఆరుపైసల హాలీకి బదులు ఏడు పైసలహాలీకి ఆ దుకాణదారుడు అగ్గిపెట్టెని అమ్మాడు. ఒక్కపైసాపై గొడవ బయలుదేరింది. హైద్రాబాద్ సంస్థానంలో ఆ రోజుల్లో ముస్లింలందరూ తమకు తామే పాలకులుగా, హిందువులను పాలితులుగా భావించేవారు.
ప్రతి చిన్న విషయంపై ముస్లింలు హంగామా చేసేవారు. ఈ వాతావరణంలో ఆ చిన్న సంఘటన పెద్ద తగాదాగా మారింది. అక్కడే ఉన్న ముదఖేడ్ కర్ సోదరులు కలుగచేసుకున్నారు. దిగంబరరావు స్థానిక ఆర్యసమాజ శాఖకు కార్యదర్శి. ఆ రోజుల్లో హిందువుల ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఆర్యసమాజ్ అన్ని విధాల ప్రయత్నాలు జరిపేది. అందువల్ల కార్యదర్శి దిగంబర రావు, ఆయన తమ్ముడు దత్తాత్రేయ అక్కడ ముస్లింలకు శత్రువులుగా కనపడేవారు. ఆనాటి సందర్భాన్ని పురస్కరించుకొని దగ్గరలోనే ఉన్న స్టేట్ బ్యాంక్ ఆవరణలో చెట్లవెనకాల నుండి అరబ్బీ వాచ్‌మన్ కాల్పులు జరిపాడు.
ఫలితంగా దత్తాత్రేయ చనిపోయాడు. దిగంబర రావు తీవ్రంగా గాయపడ్డాడు. ముదఖేడ్‌కర్ కుటుంబంలో శోకజ్వాలలు వ్యాపించాయి. దేవీదాస్ రావు ముదఖేడ్‌కర్ ఇద్దరు కుమారులలో చిన్నవాడు దత్తాత్రేయ మరణించాడు. అతను ఎనిమిదినెలల క్రితమే వివాహమాడిన అమ్మాయి విధవ అయినది. గాయపడిన పెద్దవాడు దక్కుతాడో లేడో? ఒకవేళ దక్కినా నిజాం పోలీసులు అతన్ని వదులుతారా? సంస్థానంలో ఎక్కడ చూసినా రజాకార్ల అత్యా చారాలు మితిమీరి పోతున్నాయి. దిగంబరరావు కోలుకొని ఇంటికి రాగానే నిజాం పోలీసులు అల్లరి, హత్యాప్రయత్నం అనే నేరాలు మోపి అరెస్టు చేశారు. నిజాం పరిపాలనలో విచిత్రమైన న్యాయం కొనసాగేది. హత్య చేయబడినది తమ్ముడు. చేసినది అరబ్బీ వాచ్‌మెన్. హత్యా ప్రయత్నం నేరాన్ని గాయపడిన అన్నపై మోపారు. హత్య చేసిన అరబ్బీవాడు నిర్దోషిగా మిగిలాడు.
ప్రతీకారం
ఈ సంఘటనతో ఉమ్రీ యువకుల్లో గొప్ప సంచలనం చెలరేగింది. ప్రతీకారవాంఛతో యువకులు ఆలోచించ మొదలుపెట్టారు. దేశం స్వతంత్రమైనా నిజాం మాత్రం తాను, తన సంస్థానాన్ని స్వతంత్రంగా నిలుపుకోవాలని రజాకార్లను పెంచాడు. అన్నిచోట్ల ముస్లింలు మతకల్లోలాలను సృష్టిస్తున్నారు. హిందువులు విపరీతమైన అన్యాయాలకు గురి అవుతున్నారు. ఆ సమయంలో హిందువులు భారతదేశంలో ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ఉమ్రీ నుండి బరార్ నుండి ఉమర్‌ఖేడ్ అనే ప్రాంతానికి అనేక హిందూ కుటుంబాలు శరణార్థులుగా వెళ్ళి పోయాయి. అందులో ముదఖేడ్‌కర్ కుటుంబం కూడా ఒకటి. దిగంబరరావు పూచీకత్తుపై విడుదలై బయటికి వచ్చాడు. ఆ అవకాశాన్ని వినియోగించు కొని అతడు ఉమర్‌ఖేడ్‌కు పారిపోయాడు.
అక్కడ స్టేట్ కాంగ్రెస్ హిందూ శరణార్థుల సహాయార్థం ప్రత్యేక శిబిరాలను నిర్వహించింది. ఈ శిబిరాలలో సహాయ కార్యకలాపాలతో పాటు హిందూ యువకులకు ఆయుధాల ఉపయోగంలో శిక్షణ ఇచ్చేవారు. బెరార్ సరిహద్దును తాకి ఉన్న ఉమ్రీ నుండి రజాకార్లు దాడి చేస్తుండేవారు. ఆ దాడులను ఎదుర్కొనడానికి ఆ హిందూ యువకులు సంసిద్ధంగా ఉండేవారు. అందులో ఉమ్రీనుండి వచ్చిన యువకులు అవకాశాన్ని చూసి దత్తాత్రేయ మరణానికి ప్రతీకారం చేయాలని పథకాలు వేశారు. అందరికీ ఒక పథకం నచ్చింది. ఉమ్రీ స్టేట్ బ్యాంక్‌పై దాడిచేసి లూటీ చేసిన డబ్బుతో స్టేట్ కాంగ్రెస్‌కు సహాయపడాలని, కాని ఆ దాడికి కావలసిన ఆయుధాల సేకరణ సమస్యగా మారింది.
ఉమ్రీ భామాషా
అంతకు పూర్వమే ఉమ్రీ ప్రాంతపు యువకులు, స్టేట్ కాంగ్రెస్ కార్యకర్తలు నాగపూర్, జబల్ పూర్‌లలో హోమ్‌గార్డస్ దళాలలో శిక్షణ పొంది వచ్చారు. ఆయుధాలతో దాడి చేయడం వగైరా అంశాలలో తర్ఫీదుపొంది సిద్ధంగా ఉన్నారు. ఉమ్రీ బ్యాంక్‌పై దాడి చెయ్యాలంటే మాటలతో అయ్యేపని కాదు. దాదాపు 30 మైళ్ళ వరకు ఆయుధాలను తీసుకుపోవడం, అందులో రజాకార్లతో నిండిన నిజాం సంస్థానంలోకి చొరబడడం కష్టసాధ్యం. అయినా ఆధునిక ఆయుధాలు కావాలి. ఆ సందర్భంలో ధన్‌జీ అనే వ్యక్తి తన ఆస్తినంతా అమ్మి నలభైవేల రూపాయలు విరాళంగా ఇచ్చాడు.
ధన్‌జీ ఆ కష్ట సమయంలో అంత డబ్బు విరాళంగా ఇవ్వడం అపూర్వం. మొగల్ రాజులను ఎదుర్కొనడానికి రాణాప్రతాప్‌కు సర్వస్వం దానం చేసిన ‘‘రాజస్థాన్ భామాషా’’ అనే సంపన్నుడు ఈ సందర్భంలో అందరికీ జ్ఞాపకం వచ్చాడు. ధన్‌జీని ‘‘ఉమ్రీ భామాషా’’ అని పిలిచేవారు. విరాళంగా వచ్చిన డబ్బుతో కావలసిన ఆధునిక ఆయుధాలను కొనడం జరిగింది. యువకులందరూ అమితోత్సా హంతో సన్నాహాలు ప్రారంభించారు. ఉమ్రీ బ్యాంక్‌పై 12 జనవరి, 1948 నాడు దాడిచేయా లని నిర్ణయించారు.
(సశేషం)