బంగ్లాదేశ్ కి ‘‘నిధులు కట్’’… బడ్జెట్ తో నడ్డి విరిచేసిన సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్ లో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భారత్ పొరుగు దేశానికి ఇచ్చే సహాయాన్ని సగానికి తగ్గించేసింది. ప్రభుత్వం ‘ఇతర దేశాలకు సహాయం’ కింద కేటాయింపులను రూ. 5,686 కోట్లకు పెంచినప్పటికీ, బంగ్లాదేశ్‌కు కేవలం రూ. 60 కోట్లను మాత్రమే కేటాయించింది. బంగ్లాదేశ్ లో హిందువులపై, మైనారిటీలపై అక్కడి ముస్లిం ఛాందసులు రోజురోజుకీ దాడులు చేస్తున్నారు. అక్కడి వారిని చిత్ర హింసలు పెడుతున్నారు. అయినా అక్కడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే హిందూ దేవాలయాలపై దాడులను కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ఝలక్ ఇచ్చింది.
2025-26 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు సుమారు రూ. 120 కోట్లను కేటాయించింది. బంగ్లాదేశ్‌కు ఇచ్చే సహాయాన్ని తగ్గించడంతో పాటు, కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌లోని చాబహార్ పోర్టుకు కూడా ఎలాంటి నిధులు కేటాయించలేదు. వాస్తవానికి, అక్కడి షాహిద్ బెహెష్తి టెర్మినల్‌ను నిర్వహించడానికి 2024లో న్యూఢిల్లీ టెహ్రాన్‌తో 10 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంది. అక్కడ కొనసాగుతున్న రాజకీయ గందరగోళం మధ్య అమెరికాతో ఇరాన్‌కు ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఇక.. 2026-2027 బడ్జెట్ లో భూటాన్ మాత్రం అత్యధికంగా సహాయం పొందిన దేశంగా నిలిచింది. భూటాన్ కి 2,288 కోట్లను కేటాయించారు. గతంతో పోలిస్తే 6 శాతం ఎక్కువగా నిధులు కేటాయిచింది. అదే సమయంలో, నేపాల్, శ్రీలంక మరియు మయన్మార్ కి రూ. 800 కోట్లు, రూ. 400 కోట్లు మరియు రూ. 300 కోట్లు కేటాయించారు.మాల్దీవులు మరియు మారిషస్‌కు ఒక్కోదానికి రూ. 550 కోట్లు, ఆఫ్ఘనిస్తాన్‌కు రూ. 150 కోట్లు, మంగోలియాకు రూ. 25 కోట్లు, ఆఫ్రికా దేశాలకు రూ. 225 కోట్లు, మరియు సీషెల్స్‌కు రూ. 19 కోట్లు మంజూరు చేశారు.