యూపీలో కఠిన ‘లవ్ జిహాద్’ బిల్లు.. దోషులకు ఇక యావజ్జీవం
యూపీ ప్రభుత్వం అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించింది. లవ్ జిహాద్ బిల్లుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆమోదించింది. దీంతో ఇకపై దోషులకు యావజ్జీవం శిక్ష పడే అవకాశం వుంటుంది. బలవంతపు మతమార్పిడుల నిరోధక (సవరణ) బిల్లు 2024 కి యూపీ అసెంబ్లీ ఆమోదించింది. సవరించిన ఈ బిల్లు ప్రకారం మోసపూరిత వివాహాలు, ఇతర పద్ధతులలో మత మార్పిడికి పాల్పడే వారికి శిక్ష మరింత పెరుగుతుంది. సవరించిన ఈ బిల్లు ప్రకారం మత మార్పిడి ఉద్దేశంతో మైనర్లు, ఇతరులను బెదిరించడం, దాడులు చేయడం, వివాహం చేసుకోవడం అంతేకాకుండా వివాహం చేసుకుంటామని వాగ్దానం చేయడం వంటి చర్యలకు ఎవ్వరు పాల్పడినా.. అది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి కేసుల్లో 20 ఏళ్లు లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.
అయితే.. గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి 10 సంవత్సరాలు జైలు, 50 వేల జరిమానా వుండేది. సవరించిన నిబంధనల ప్రకారం ఎవరైనా సరే మత మార్పిడి కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయవచ్చు. గతంలో ఇలాంటి కేసుల్లో సమాచారం కానీ, ఫిర్యాదు కానీ బాధితులు తమ తల్లిదడ్రుల సమక్షంలోనో, తోబుట్టువుల సమక్షంలోనో ఇవ్వాల్సి వుండేది. ఇప్పుడు ఎవరైనా సరే లిఖితపూర్వకంగా పోలీసులకు సమాచారం ఇస్తే సరిపోతుంది. ఇలాంటి కేసుల విచారణను సెషన్స్ కోర్టు కంటే దిగువ కోర్టులు చేపట్టరాదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేకుండా బెయిల్ అభ్యర్థనలను పరిశీలించరాదు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగానే పరిగణిస్తారు. నవంబర్ 2020లో దీని కోసం ఆర్డినెన్స్ జారీ చేయగా, తరువాత యూపీ శాసనసభ, మండలి ఆమోదించిన తర్వాత యూపీ చట్టవిరుద్ధమైన మతమార్పిడి నిషేధ చట్టం 2021 అమలులోకి వచ్చింది.