గోమయంతో రాఖీలు.. లక్షలు సంపాదిస్తున్న మహిళలు
రక్షా బంధన్ అనగానే మార్కెట్ లో రకరకాల రాఖీలు, వెరైటీ డిజైన్లు అందుబాటులోకి వస్తున్నాయి. యేటికాయేడు వీటి రకాలు పెరుగుతూనే వున్నాయి కానీ, ఎక్కడా తగ్గడం లేదు. కొన్ని ప్లాస్టిక్ రాఖీలు అయితే.. మరికొన్ని స్పాంజీలతో చేసిన రాఖీలు, మరికొన్ని వెండి రాఖీలు ఇలా రకరకాలుగా వస్తున్నాయి. అయితే.. గోమయంతో చేసిన రాఖీలు ఇప్పటి వరకూ చాలా మంది విని వుండరు. ఈ రక్షా బంధన్ సమయంలో గోయమంతో చేసిన రాఖీలు మార్కెట్ లోకి చ్చాయి. యూపీలోని జలౌన్ జిల్లా మహిళలు వీటిని తయారు చేశారు. స్వయం ఉపాధి ద్వారా గోమయంతో రాఖీలను తయారు చేసి, మార్కెట్ లోకి పంపించారు. ఇలా దాదాపు 25 లక్షలకు పైగానే ఆ మహిళలు సంపాదించి, రికార్డుల్లోకి నిలిచారు. ఆవు పేడతో చేసినా…. అప్ డేట్ వర్షన్ రాఖీల తయారు చేస్తున్నారు. ఇందులో రామ మందిర నమూనా గల రాఖీలు ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. వీటికే గిరాకీ ఎక్కువగా వుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
ఈ ఆవు పేడలో వివిధ రకాల పప్పు దినుసులు కలిపి, రాఖీలను అందంగా తయారు చేస్తున్నారు. ఇవి పర్యావరణానికి అనుకూలమైనవని, పర్యావరణానికి వీటి వల్ల హాని వుండదని మహిళలు చెబుతున్నారు. అంతేకాకుండా తాము కూడా ఉపాధి పొందుతున్నామని, మహిళలకు నాయకత్వం వహించే వినీతా పాండే తెలిపారు. ఈ పద్ధతిని ప్రజలు కూడా ఆదరిస్తున్నారని, దీనితో మహిళలకు ఉపాధి కూడా దొరుకుతోందని తెలిపారు. కేవలం యూపీలోనే కాకుండా ఢిల్లీ, గుజరాత్, ముంబై నుంచి కూడా తమకు ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ఒక్కో రాఖీని 40 రూపాయలకు విక్రయిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆవుపేడ, ఎర్రమట్టి, బంక, పప్పుదినుసులు వాడుతున్నామని ఆమె తెలిపారు.