ఆపరేషన్ సిందూర్ అనేది ట్రైలర్ మాత్రమే : ఉపేంద్ర ద్వివేది

ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను భారత్​ ఒకే విధంగా చూస్తుందని  భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశా రు. భారత్​ను లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇస్తే అది పొరుగు దేశానికే నష్టమని ఆయన హెచ్చరించారు. భారత్ తమ​ ప్రజల శ్రేయస్సుపైనే ప్రధానంగా దృష్టి పెడుతుందని, ఆ మార్గంలో ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగిన విధంగా ప్రతిస్పందిస్తామని తేల్చి చెప్పారు.
తాము కోరుకుంటున్నదల్లా శాంతియుత ప్రక్రియను అవలంభించాలని, అందుకు తాము కూడా సహకరిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా పాకిస్థాన్‌తో వ్యవహరించడంలో భారత్​ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోందని ఆయన తెలిపారు. ఢిల్లీలో జరిగిన ‘చాణక్య డిఫెన్స్​ డైలాగ్స్​’ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ  ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్ కేవలం 88 గంటల ట్రైలర్‌ మాత్రమేనని చెప్పారు.
దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. .​  భారత్​ ఎలాంటి బెదిరింపులకు లొంగదని, భారత పురోగతికి అడ్డంకులు సృష్టించాలని చూస్తే అందుకు తగ్గ చర్యలు తీసుకోవడానికి భారత దళాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
“ఆపరేషన్ సిందూర్ అనేది ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులకైనా మేము సిద్ధంగా ఉన్నాం. పాకిస్థాన్ అవకాశం ఇస్తే, పొరుగు దేశంతో బాధ్యతాయుతంగా ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాం. నేటి కాలంలో యుద్ధం వస్తే అది ఎంతకాలం కొనసాగుతుందో మనం చెప్పలేం. అందుకు తగ్గ సామాగ్రి మన వద్ద ఉండేలా చూసుకోవాలి. అవసరమైతే నాలుగు సంవత్సరాలు పాటు జరిగే దీర్ఘకాలిక యుద్ధాలకు సైతం​ ఆహారం, మందుగుండు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి” అని తేల్చి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *