కుంభమేళాలో హస్తకళల ద్వారా 35 కోట్ల టర్నోవర్… కొత్త కొత్త ఉపాధి అవకాశాలు
మహా కుంభమేళా కళాకారులకు ఓ ముఖ్యమైన వేదికగా మారుతోంది. వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ (ODOP),తివాచీలు, గాజు బొమ్మలు, హస్తకళలకి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అక్కడ అమ్ముతున్నారు. 2019 లో జరిగిన కుంభమేళాలో కూడా హస్త కళల వస్తువులకు విపరీతమైన గిరాకీ వచ్చిందని అధికారులు గుర్తు చేసుకున్నారు. అప్పటి టర్నోవర్ 4.30 కోట్లు.. ఈ సారి ఏకంగా 35 కోట్ల టర్నోవర్ జరగవచ్చని అధికారులు ఓ అంచనాకి వచ్చారు. దీంతో ఉపాధి అవకాశాలు కొత్తగా లభిస్తున్నాయని, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు.
ప్రస్తుతం మహా కుంభమేళా జరుగుతోందని, ఈ సారి మరింత వ్యాపారం జరుగుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒక్కో జిల్లా నుంచి ఒక్క ఉత్పత్తికే అవకాశం ఇచ్చారు. హస్త కళల ఉత్పత్తులను మరింత ప్రోత్సాహం అందించడానికి స్థానిక వ్యాపారవేత్తలకు ఉచితంగా విక్రయించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. తమ ఉత్పత్తులను ఎటువంటి ఛార్జీలు లేకుండా ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్‌లో విక్రయించవచ్చు, ఇది పెద్ద సంఖ్యలో దుకాణదారులను మరియు సందర్శకులను ఆకర్షిస్తోంది.చేతి వృత్తు పనివారితో పాటు యూపీ సాంస్కృతిక వారసత్వం కూడా ప్రపంచానికి తెలిసి వస్తుందని అన్నారు. దాదాపు 75 రకాల GI ట్యాగ్ వుండే ఉత్పత్తులను ప్రదర్శనకు వుంచారు.
వీటితో పాటు వారణాసిలో లభించే ఎర్ర మిరపకాయలు, బనారస్ చీరలు, ప్రతాప్ ఘర్ ఉసిరి, మీర్జాపూర్ ఇత్తడి పాత్రలు కూడా లభిస్తాయి. అలాగే ఖుషీనగర్ నుంచి కార్పెట్లు, ఫిరోజాబాద్ గాజు బొమ్మలు, పాత్రలను కూడా ఈ షాపుల్లో వుంచారు. అలాగే లాల్ పెడా, బనారసి తబలా లాంటి దిగ్గజ ఉత్పత్తులను కూడా ఇందులో వుంచారు.