జీవామృతాన్ని అసలు ఎలా ఉపయోగించాలి ? ఎప్పుడు పిచికారి చెయ్యాలి ?
రైతులు సహజంగా బావి నుంచి పంపు ద్వారా తోడిన నీటిని కాలువ ద్వారా పొలానికి తడి పెడుతుంటారు. ఈ కాలువలో పారే నీటిలో జీవామృతాన్ని డ్రమ్ముకున్న నల్లా ద్వారా వదిలిపెట్టాలి. ఇలా చేస్తే జీవామృతం నీటిలో కలిసిపోయి పంట వేళ్లకు అందుతుంది. పండ్ల చెట్లకు వయసును బట్టి 2 నుంచి 5 లీటర్ల జీవామృతాన్ని పోయాలి. కానీ.. దీనిని పోసేటపుడు భూమిలో తేమ వుండాలి. చెట్టు మొదట్లో జీవామృతం పోయకూడదు. మిట్ట మధ్యాహ్నం చెట్టు నీడ ఎక్కడ పడుతుందో.. ఆ చుట్టూతా జీవామృతం, నీరు పోయాలి. చెట్లకు పోషకాలు అందించే కొన వేళ్లు ఆ నీడ చివరి వరకూ వ్యాపించి వుంటాయి. అందువల్ల మొదళ్లలో కాకుండా అక్కడే నీరు, జీవామృతం ఇవ్వాలి.
ఒకవేళ ప్లాస్టిక్ డ్రమ్ము లేకపోతే కొనుగోలు చేసే వరకు జీవామృతాన్ని తయారు చేయడం వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు. పొలంలో బావి లేదా బోరు నుంచి నీరు పారే కాలువ పక్క 500 లీటర్ల నీరు పట్టేంత గుంట తవ్వాలి. గుంట తవ్వినపుడు వచ్చిన మట్టిని గుంతపైన చుట్టూ అన్ని వైపులా వేయాలి. తర్వాత ఆ గుంట గోడలను పేడ, మట్టి కలిపి అలకాలి. ఇలా అలకడం వల్ల జీవామృతం వృథా కాకుండా వుంటుంది. గుంట తవ్వినపుడు వచ్చిన మట్టిని దాని చుట్టూ వేయాలి. జీవామృతం తయారు చేసిన 48 గంటల తర్వాత వాడాలి. కాలువలో పారే నీటిలో కొద్ది కొద్దిగా జీవామృతాన్ని కలపాలి. రైతు స్వయంగా ఆ పని చేయాలి. లేదా ఆడ కూలీతో చేయించాలి.
జీవామృతాన్ని బావి నీటిలో కలిపి ఆ తర్వాత నీటిని పొలానికి పారించాలి. ఒక వేళ మీ బావిలో ఒక ఎకరానికి మాత్రమే సరిపోయే నీరుంటే, 200 లీటర్ల వడకట్టిన జీవామృతాన్ని బావిలో పోయాలి. రెండు లేదా మూడు ఎకరాలకు సరిపోయే నీరుంటే 400 నుంచి 600 లీటర్ల వరకూ జీవామృతాన్ని బావిలో పోయవచ్చు. ఆ తర్వాత ఆ నీటిని మోటారు ద్వారా పొలానికి పారించినా సరిపోతుంది. ఒకవేళ మీ పొలంలో బిందు సేద్య పరికరాలు (డ్రిప్) లేదా తుంపర సేద్య పరికరాలు ఉంటే గనుక జీవామృతాన్ని జాగ్రత్తగా వడకట్టి వాడుకోవాలి.
జీవామృతాన్ని వడకట్టడానికి ఫిల్టర్‌ను వాడడం ఒక పద్ధతి. దీని కోసం అడుగడుగునా కుళాయి వున్న డ్రమ్‌ను సిద్ధం చేసుకోవాలి. ఆ డ్రమ్ము లోపల మొదటి పొరగా ఆరు అంగుళాల ఎత్తు వరకూ చిన్న చిన్న రాళ్లు వేయాలి. దానిపై 5 అంగుళాల మందాన ఇసుక పోయాలి. ఇసుకపైన ప్లాస్టిక్ వలను పెట్టాలి. ఆ వలపై ఒక పల్చని గుడ్డ పరిస్తే, జీవామృతాన్ని వడకట్టే ఫిల్టర్ అయినట్లే. ఈ డ్రమ్ములో పై నుంచి పోసిన జీవామృతం ఫిల్టర్ అయిన తర్వాత కుళాయి ద్వారా కిందికి వస్తుంది. కుళాయి కింద మరో పాత్రను వుంచితే వడకట్టిన జీవామృతం సిద్ధమవుతుంది. దీన్ని బిందు సేద్యం, తుంపర సేద్య పరికరాల్లో కలిపి పంటలకు అందివచ్చు. లేదా ఫిల్టర్ కుళాయి నుంచి నేరుగా మోటారు పంపు అంటే దాని సెక్షన్ పంపుకు ట్యూబును అమర్చి నీటితో పాటు నేరుగా జీవామృతం పొలానికి వెళ్లే ఏర్పాటు చేయాలి. పొలంలో వున్న మోటారు పంపు అంటే దాని సెక్షన్ పంపుకు ఒక చిన్న రంధ్రం వేసి దానికి డివైడర్‌ను జోడిరచాలి. దానికి ఒక నల్లా బిగించాలి. ఈ నల్లాకి ఓ రబ్బర్ ట్యూబు జోడిరచాలి. ఈ ట్యూబును ఇంకో వైపు డ్రమ్ముకున్న నల్లాను జోడిరచాలి. మోటారు పంపు స్టార్ట్ చేసిన వెంటనే సెక్షన్ పంపు నుంచి పైకి వచ్చే నీటితో పాటు జీవామృతం తనకు తానే కలిసిపోయి పంట వేళ్లకు చక్కగా అందుతుంది.
జీవామృతం పిచికారీ చేసే పద్ధతి
1. మొదటి సారి : నారు లేదా విత్తనం నాటిన 15 రోజులకు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల ఈటితో కలిపి పిచికారీ చేయాలి.
2. రెండోసారి : నారు లేదా విత్తనం నాటిన 30 రోజులకు ఎకరానికి 5 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
3. మూడోసారి : నారు లేదా విత్తనం నాటిన 45 రోజులకు ఎకరానికి 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
4. నాలుగోసారి : నారు లేదా విత్తనం నాటిన 60 రోజులకు. ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
5. అయిదో సారి : నారు లేదా విత్తనం నాటిన 75 రోజులకు ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
6. ఆరోసారి : నారు లేదా విత్తనం నాటిన 90 రోజులకు… ఎకరానికి 20 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
7. ఏడోసారి : నారు లేదా విత్తనం నాటిన 105 రోజులకు. ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
8. ఎనిమిదో సారి : నారు లేదా విత్తనం నాటిన 120 రోజులకు. ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
9. తొమ్మిదో సారి : నారు లేదా విత్తనం నాటిన 135 రోజులకు. ఎకరానికి 25 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
10. పదోసారి : నారు లేదా విత్తనం నాటిన 150 రోజులకు. ఎకరానికి 30 లీటర్ల జీవామృతాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
పుల్లని మజ్జిగ :
వరిలో గింజ ఏర్పడుతున్న దశలో 10 లీటర్ల పుల్ల మజ్జిగను (48 గంటల పాటు దానిని పులియబెట్టాలి.) 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. పుల్ల మజ్జిగ చల్లినపుడు జీవామృతం పిచికారీ చేయనవసరం లేదు. 3 నెలలు, 6 నెలలు లోపు పండే పంటలకు, సంవత్సరం వుండే పంటలకు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతాన్ని పిచికారీ చేసుకుంటే మంచిది.