లోక్ మథనం నుంచి ఉత్పన్నమైన లోకామృతం ఇదీ…
1. వనవాసులైనా, గ్రామవాసులైనా, నగరవాసులైనా మనమందరం భారత వాసులమే, ఎందుకంటే మన నాగరికత, మన సమాజాలకు మూలం ఒకటే. మన ఆలోచన, మన అలవాట్లు, మన వ్యవస్థలు కూడా ఒకే రకమైన సూత్రాలతో అనుసంధానం అయి ఉన్నాయి,
2. వలసపాలన మన విద్యా మాధ్యమాలను, మన భావనా స్రవంతిని, మన దృష్టిని మార్చివేసింది. ఆ కారణంగా మనం మన ప్రాచీన నాగరికతను, సమాజాలను, మూలాలను హీనభావంతో చూడడం ప్రారంభించాం. భారతీయ నాగరికతకు సంబంధించిన సమగ్ర దృక్పథాన్ని స్థాపించాలంటే కేవలం సారస్వతాన్ని అభివృద్ధి చేయడమే కాదు మౌలిక దృష్టికోణం మార్చుకోవడం కూడా అవసరం.
3. అనాది కాలం నుంచి ఈ భూమి మీద సూర్య ఉపాసన, భూమిపూజ, అగ్నిపూజ, అన్న పూజ, అటవీ సంరక్షణ మొదలైనవి ప్రాచీన నాగరికత, జీవనంలో భాగంగా వస్తున్నాయి. ఇవి వివిధ సమాజాల్లో వివిధ రూపాల్లో గోచరిస్తాయి, మన నాగరికతలో శైలి, సంప్రదాయాలు ప్రకృతితో ఏకమై, సమన్వితమై ఉన్నాయి. మన నాగరికతా వ్యవస్థలు నైసర్గిక పర్యావరణంతో తాదాత్మ్యం చెంది మమేకమై ఉన్నాయి. అందువల్ల ప్రాచీన జీవనశైలి, ఆచార వ్యవహారాలు పర్యావరణం నుంచి ఉత్పన్నమై, ప్రకృతికి అనుగుణంగా ఉంటాయి.
4. భారతీయ నాగరికత, జీవనంలో రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి శాస్త్రీయం, రెండోది వ్యావహారికం. సనాతన సత్యం ఆధారంగా భారతీయ జ్ఞాన పరంపర ఒకటైతే, ఆ జ్ఞానం, శాస్త్రాల ఆధారంగా సామాజిక ప్రబోధాలు చేసే సాధువులు, కళాకారులు, సాధకులు మొదలైనవారి అనుభవాలు, ప్రవచనాల ద్వారా సనాతన ధర్మ ప్రవాహాన్ని ముందుకు తీసుకువెళ్ళే జానపద సంప్రదాయాలు, ఆచరణ సూత్రాలు రెండోది.
5. లోక జ్ఞానం, లోక్ ఆలోచనా ధార, లోక విద్య సార్వజనిక శ్రేయస్సు కేంద్ర బిందువుగా కలిగి ఉంటాయి. లోక్ సంస్కృతి, సంప్రదాయాల్లో శాశ్వత వృద్ధి తత్త్వంగా ఉంటుంది. భారతీయ సమాజంలో శాస్త్రాలు, జానపద నాగరికత వేర్వేరు కాదు. జ్ఞాన శాస్త్రాల్లో ఏదైతే ఉందో, అదే నాగరికతలో వ్యాప్తమై ఉంది. శాస్త్రాలు, మన జానపద నాగరికత పరస్పర పూరకంగా ఉంటాయి.
6. ప్రాచీన నాగరికత సమస్త జీవ తత్వాల పరిరక్షణ, సంరక్షణకి ఆచరణాత్మకంగా కట్టుబడి ఉన్నట్లు గోచరిస్తుంది. అందువల్ల లోక సంస్కృతి వ్యవస్థను, వ్యవహారంతో సంధానించిన ఒక ప్రణాళికా ప్రక్రియగా కనిపిస్తుంది.
7. లోక వ్యవస్థల్లో మూడు ఉపాంగాలు కీలకమైనవి, అవి వేదం మతం, సాధు మతం, లోక మతం. ఈ మూడు కూడా పరస్పర పూరకమైనవే. వ్యవస్థలను నడిపించడంలో శాస్త్ర సమ్మతి ఉన్న పద్ధతులు కూడా లోక విరుద్ధం అయితే చెల్లుబాటు లేకుండా పోతాయి. లోక వ్యవస్థల దృక్కోణం నుంచి చూస్తే గతాన్ని భవిష్యత్తుతో సమ్మేళనం, అనుసంధానం చేయగలిగినవి సర్వామోదం పొందుతాయి. అటువంటి వ్యవస్థల్లో ఉన్న సమాన సూత్రాలు, సమస్తాన్ని కలుపుకొని పోయే లక్షణం, వాటికి ఈనాడు ఉన్న ఔచిత్యం గురించి చర్చ జరగడం అవసరం.
8. ప్రజల ఆలోచనా ధార, నడవడికకు ఉచితమైన ఒక ప్రపంచ వ్యవస్థను సృష్టించడం ద్వారా మాత్రమే విశ్వాన్ని రక్షించే మార్గం మనకు అందుబాటులోకి వస్తుంది. లోక జీవన శైలిలో ఉండేవారిని, ఇతర సహచరులను ఒకే వేదిక పైకి తీసుకుని వచ్చి, ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు పరిష్కారాలు అన్వేషిస్తేనే, మన అస్తిత్వాన్ని కాపాడుకుని, ఆనందాన్ని అనుభవించడం సాధ్యపడుతుంది.
9. భారతీయ సంప్రదాయ వాసులను పాఠ్యాంశాలలో, పాఠ్య ప్రణాళికలలో తప్పనిసరిగా చేర్చాలి. జానపద సంప్రదాయాలన్నిటితో పాటుగా కళారూపాల అభివ్యక్తిని వివరించే ప్రామాణికమైన గ్రంధాలను రూపొందించే పని జరగాలి. అంతే కాకుండా ఈ దిశలో, ఈ అంశాలపై పరిశోధన, పత్రీకరణ డాక్యుమెంటేషన్ జరిపేలా యువజనులను ప్రోత్సహించాలి.
10. భారతీయ లోక చింతనలో మూలాధారాలతో విశ్వ భావనా ధారను, వ్యవహారాన్ని, వ్యవస్థలనూ సమన్వయం చేయడం ద్వారా సమకాలీన సమస్యలు, సంఘర్షణలకు దీర్ఘకాలిక, శాశ్వత పరిష్కారాలు సాధ్యం.
భారత్ లోక్ ఆత్మని ప్రతిఫలించే వాక్యం ఇదే మరి.
లోకాః సమస్తా సుఖినో భవంతు