మజ్జిగతో మన శరీర ద్రవ సమతుల్యతను కాపాడుకోవచ్చు
ఎండాకాలం వచ్చేసింది. దీంతో బయట రకరకాల చల్లటి పానీయాలు, కూల్‌డ్రిరక్స్‌ని బాగా తీసుకుంటుంటారు. అప్పటికప్పుడు చల్లగా వున్నట్లు అనిపించినా… అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. అవేవీ కాకుండా అతి తక్కువ ఖర్చుతో మనింట్లోనే వుండే మజ్జిగతో ఎండలతో ఇబ్బందులు రాకుండా చూసుకోవచ్చు. అయితే.. శరీరంలో చల్లదనానికి కూడా ఈ మజ్జిగ తోడ్పడుతుంది. మధ్యాహ్న భోజనం తర్వాత అయినా, రాత్రి భోజనం తర్వాత అయినా ఓ గ్లాసు మజ్జిగను తీసుకుంటే జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఎండా కాలంలో ఆహారం కూడా ఎక్కువ మోతాదులో తీసుకోలేం. దీంతో నీరసించి పోయే అవకాశం వుంది. దానిని మజ్జిగతో కూడా నింపవచ్చని వైద్యులు అంటుంటారు.
మజ్జిగ జీర్ణ శక్తిని బాగా మెరుగుపరుస్తుంది….
మజ్జిగ మన జీర్ణ వ్యవస్థకు ఓ వరంగా నిలుస్తుంది. మజ్జిగలో వుండే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను, జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ మజ్జిగ ప్రోబయోటిక్ గుణాలతో నిండి వుంది. ఉష్ణోగ్రతల నుంచి మీ ఆరోగ్యాన్ని ఉన్నత స్థితిలో వుంచుతుంది. మన శరీరంలో ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది.ఇంకా మజ్జిగలో కాల్షియం, పొటాషియం, విటమిన్ బీ12, ప్రొటీన్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా వుంటాయి. ఇంకా మన శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కండరాలు, చర్మం, ఎముకలను నిర్మించడానికి కూడా తోడ్పడుతుంది. అందులో మిరియాలు, ధనియాల పొడి, ఉప్పు, శొంఠి వంటి వాటిని కూడా కలుపుకోవచ్చు.
వీటితో పాటు పెద్ద పేగుల్లో అసాధారణ కదలికల వల్ల మల విసర్జనలో తీవ్ర ఇబ్బందులు కలుగజేసే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వ్యాధి నివారణలో మజ్జిగ తోడ్పడుతుంది. అందులోని యాసిడ్ కారణంగా పొట్టను క్లియర్ చేస్తుంది. దీనిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వంటి జీర్ణ రుగ్మతలను తగ్గిస్తుంది. అలాగే యాసిడిటీని కూడా నివారించవచ్చు.