పంచగవ్య తయారీ… ఉపయోగాలు
సమీకృత వ్యవసాయ పద్ధతి లో ఉండే ఆవు నుండి వచ్చే వివిధ రకాల పదార్థాల నుండి తయారు చేయబడే పంచగవ్య, పర్యావరణాన్ని శుభ్రపరచడంలో, పశుగ్రాసం మరియు వ్యవసాయ పంటలపై పురుగుమందుల పిచికారీ నుండి రక్షించడంలో ఉపయోగపడుతుంది. ఇది సేంద్రీయ వ్యవసాయంలో నానాటికీ ఎక్కువ ప్రాధాన్యత సంతరిచుకుంటుంది. దీని తయారిలో మొత్తం అయిదు రకాల ఆవు కి సంబంధించిన పదార్థాలు మాత్రమే వాడుతారు కాబట్టి దీనిని పంచగవ్య అని అంటాము.
పంచ గవ్య తయారీలో ఉపయోగించబడే ఆవు మూలాలు: 5 కిలోల తాజా ఆవు పేడ ,3 లీటర్ల ఆవు మూత్రం, ఆవు పాలు 2 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు, ఆవు నెయ్యి 1 లీటరు, చెరకు రసం 3 లీటర్లు, కొబ్బరి నీళ్ళు 3 లీటర్లు, పులియబెట్టిన ద్రాక్ష రసం 2 లీటర్లు, పండిన అరటిపండ్లు 12.
పంచ గవ్య తయారీ విధానం: ప్లాస్టిక్ బకెట్లో లేదా ఒక కుండలో ఒక లీటర్ నెయ్యి మరియు ఐదు కిలోల ఆవు పేడ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పై మిశ్రమాన్ని 3 రోజుల పాటుగా ప్రతిరోజూ 2 నుండి 3 సార్లు బాగా కలపాలి. ఇలా ప్రతిరోజూ తరచూ కదిలించడం వలన, మీథేన్ గ్యాస్ విడుదలవుతుంది, అది ఆవు పేడ యొక్క కిణ్వ ప్రక్రియ గుణాన్ని మెరుగుపరుస్తుంది. దీనితో పాటు ఔషధ గుణాలను కూడా పెంచుతుంది. లోహాలను ఎట్టి పరిస్థితులలో కూడా ఉపయోగించకూడదు. ఈ ఆవు పేడ మరియు నెయ్యి మిశ్రమంతో ఇతర పదార్థాలను కూడా వేసి బాగా కలపాలి.
రోజుకు 2 నుండి 3 సార్లు ఈ మిశ్రమాన్ని కదిలించాలి. ఆ కుండ యొక్క మూతను తెరిచి ఉంచాలి. ఈగల సమస్య ఉంటే పాత్రను దోమతెరతో గాలి ఆడే విధంగా కప్పాలి. ఉపయోగ యోగ్యంగా అవడానికి దీనికి కనీసం 20 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత దీనిని పోలంపైన పిచికారి చేయవచ్చు. ఒక లీటరు పంచ గవ్య ను ఉత్పత్తి చేయడానికి దాదాపు రూ. 18 నుండి 20 అవుతుంది.
ఉపయోగాలు: వ్యవసాయంలో మరియు పశుగ్రాస పంటలలో పంచ గవ్య ను వ్యాధులను నియంత్రించడానికి మరియు గ్రోత్ ప్రమోటర్‌గా ఉపయోగించవచ్చు. కోళ్లలో యాంటీబయాటిక్స్‌కి బదులుగా దీనిని 7.5 గ్రా / కేజీ వాడటం వలన ఇతర కోళ్ల కన్నా ఈ కోళ్ళ శరీర బరువును పెరిగింది. ఇది కోళ్లకు గ్రోత్ ప్రమోటర్‌గా కూడా ఉపయోగిస్తారు. ఇది సేంద్రీయ వ్యవసాయం లో చేసే మేలు వలన దీనిని మొక్కలకు సంజీవని అని పేర్కొంటారు.