శ్రీ వామనావతారం
(సెప్టెంబరు 7న జయంతి)
శ్రీ మహావిష్ణువు ఐదవ అవతారము వామనావతారం. వామనుడు అదితి, కశ్యపులకు జన్మించాడు. పుట్టిన కొన్ని క్షణములలోనే భగవానుడు విచిత్రంగా వటుని రూపం ధరించాడు. ఏడు సంవత్సరాల బాలుడిగా కనపడెను. తండ్రి కశ్యపుడు బాలుడికి ఉపనయనం చేశాడు.
రాక్షస రాజు, ప్రహ్లాదుడి మనుమడైన బలి చక్రవర్తి బృగువత్సమనే ప్రదేశంలో అశ్వమేధ యాగాన్ని చేస్తున్నాడని వామనుడికి తెలిసింది. బలి చక్రవర్తి ధర్మానికి విరుద్ధంగా ఇంద్రపదవిని కోరుతున్నాడు. ఎంత గొప్ప రాజైనా ధర్మాన్ని అనుసరించవలసిందే. బలికి బుద్ధిచెప్పడం కోసం వామనుడు అతని దగ్గరకు వెళ్ళాడు. బలిచక్రవర్తి ఆయన పాదాలు కడిగి, తన దానము స్వీకరించ వలసినదిగా ప్రార్థించాడు. వామనుడు మూడు అడుగుల స్థలం అడిగాడు. ఇంతలో రహస్యము తెలిసిన రాక్షస గురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ‘‘రాజా వచ్చిన వాడు రాక్షసులను నాశనం చేసే విష్ణువు, తనకు మించిన దానం కష్టాలు తెచ్చిపెడుతుందని హెచ్చరించాడు. వచ్చినవాడు విష్ణువే అయితే సర్వం నారాయణార్పణం చేయడం కంటె కావలసినది ఏముంది అనుకున్నాడు.
ఈ భూమిపై రాజులెందరో పరిపాలించారు. వారిపేరు మచ్చుకైనా లేదు. దాన మహిమ అమోఘం. దానం చేసే భాగ్యం కలిగినవారు ధన్యులు. అందరు మృత్యువుకు భయపడతారు. కానీ నేను అసత్యానికి భయపడతాను అని బలిచక్రవర్తి వామనుడికి దానమివ్వటానికి సిద్ధపడ్డాడు.
బలిచక్రవర్తి మంచి రాజైనప్పటికీ ముల్లోక ఆధిపత్యం కోరుకోవడం ప్రకృతి విరుద్ధం. కాబట్టే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని మూడు అడుగుల నేల దానం అడిగి పాతాళానికి పంపాడు. అక్కడ అతడిని రాజును చేశాడు.