గిరిజనులే స్వతంత్ర పోరాట సారథులు-సంస్కృతికి వారధులు : విద్యాసాగర్ రావు
దేశ స్వాతంత్య్రం కోసం నిరంతరం పోరాడిన గిరిజనుల చరిత్రను క్రోడీకరిస్తూ ప్రచురించిన ‘గిరిజనులే తొలిస్వాతంత్య్ర సమరయోధులు’ అనే పుస్తకాన్ని శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు. తెలంగాణ వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ శివార్లలోని నాదర్‌గుల్ అశోక్‌నగర్‌లో కాలనీలోని వైదేహి కౌశలంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి దాసరి శ్రీనివాసులు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. అఖిల భారత కళ్యాణ ఆశ్రమ ప్రశిక్షణ జట్టు సదస్యులు కొరిగింజ రామచంద్రయ్య పుస్తకాన్ని పరిచయం చేశారు. వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి నిర్వహిస్తున్న ఏకోపాధ్యాయ పాఠశాలల ఆచార్యుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వనవాసీ కల్యాణాశ్రమం భారత కళ్యాణ ఆశ్రమ ప్రశిక్షణ జట్టు సదస్యులు కొరిగింజ రామచంద్రయ్య మాట్లాడుతూ.. పుస్తకాన్ని పరిచయం చేశారు.భారత్ అంటేనే అరణ్య సంస్కృతి. ఒకప్పుడు, రామాయణ కాలం అంతా అడవులే. రాముడి ప్రయాణం అంతా అడవుల్లోనే సాగిందన్నారు. రానూ రానూ పరిస్థితులు మారాయని, చెట్లు లేకుండా పెద్ద పెద్ద భవనాలు వచ్చాయన్నారు. నగర,గ్రామ, వనవాసులైనా.. మౌలికంగా అందరూ ఓ రకంగా వనవాసులమే. భారతవాసులమేనని పునరుద్ఘాటించారు.

స్వాతంత్రం వచ్చి, ఇన్ని సంవత్సరాలు అయినా బానిస మనస్తత్వంతోనే అనేక వ్యవస్థలు నడుస్తున్నాయని, కానీ.. గత 12 సంవత్సరాలుగా జూలు విదల్చి, సింహం ముందుకు దూకుతున్నట్లుగా అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. యాచి దేహి.. యాచి డోల.. మళ్లీ భారత దేశం సర్వాంగీణ వికాసం అయ్యి, అన్ని రంగాల్లో ముందుకు సాగాలని డాక్టర్జీ పదే పదే అనేవారని గుర్తు చేశారు. అయితే సంఘం స్థాపించిన 15 సంవత్సరాలకే వారు పరమపదించారు. ఆ తర్వాత మహా మేధావి అయిన గురూజీ 33 సంవత్సరాల్లో 66 సార్లు దేశమంతా పర్యటించి లక్షల మంది కార్యకర్తలను తయారు చేశారన్నారు. ఆ తర్వాత దేవరస్, రాజేంద్ర సింహ్ జీ.. ఇలా.. ఇప్పటి మోహన్ భాగవత్ వరకూ అందరూ పనిచేస్తున్నారన్నారు.
కొందరు చరిత్రకు మసిపూసి మారేడు కాయ చేశారని, మన దేశం కోసం పనిచేసిన వ్యక్తుల గురించే లేదన్నారు. దీంతో యువతరం ఘోరంగా నష్టపోతున్నారని, అప్పడు నాటిన విష బీజాలు చాలా ఇప్పటికీ పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో లేని దేశద్రోహులు ఒక్క భారత్ లోనే వున్నారని అంటున్నారని, దేశభక్తులు ఎంత పనిచేస్తున్నా… వారు వుంటూనే వున్నారన్నారు.

విదేశీయుల పాలనను గిరిజనులు అస్సలు ఒప్పుకోలేదని, వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. యావత్ భారత దేశంలో ఇలా పోరాటం జరిగింనది, బిర్సా ముండా, మాంఝీ, అల్లూరి, గంటం దొర, మల్లు దొర.. ఇలా అందరూ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఇంత చరిత్ర ఇప్పటి తరానికి తెలియదని, అందుకే వనవాసీ కల్యాణాశ్రమ శిక్షా విభాగం ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దేశం కోసం పోరాడిన వ్యక్తుల సమాచారాన్ని సేకరించామని, దానికి ‘‘వనవాసీ గౌరవ్’’ పేరుతో పుస్తకం తెచ్చామని తెలిపారు. అయితే అది అసంపూర్ణంగా వుందని అనిపించి, కొత్త పుస్తకం తెచ్చామని కొరిగింజ రామచంద్రయ్య తెలిపారు.

ఇక.. రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు మాట్లాడుతూ..రామచంద్రయ్య గారు 70 మంది వనవాసీ స్వాతంత్ర యోధుల సంగ్రహ చరిత్ర రచించడం మహద్భాగ్యంగా భావించాలన్నారు. అలాగే గిరిజనులే తొలి స్వాతంత్ర సమరయోధులు అని టైటిల్ ఇవ్వడం కూడా బాగుందన్నారు. పుస్తకం ముఖపత్రం చాలా బాగుందని,అత్యంత సూక్ష్మంగా విషయాలను అందరి ముందు వుంచారన్నారు. ప్రతి రోజూ పాఠశాల ప్రార్థన సమయంలో ఈ యోధుల చరిత్రలు పిల్లలకు చెప్పాలని సూచించారు.
ఏ ప్రాంతంలో వున్నా మనమంతా భారతీయులమేనని ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంత సహ కార్యవాహ, వనవాసీ కల్యాణ పరిషత్ ప్రభారీ నర్సింగ రావు అన్నారు. ఇదే విషయాన్ని గతంలో రాష్ట్రపతి కూడా గుర్తు చేశారన్నారు. అనేక కార్యక్రమాల ద్వారా మనమంతా ఒక్కటేనని, మన ధర్మం కూడా ఒక్కటేనని చాటి చెబుతున్నామని అన్నారు. ప్రశిక్షణలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయని, ఈ ప్రశిక్షణను కార్యక్షేత్రంలో అమలు చేయాలన్నారు. దీని ఫలితం అక్కడే కనిపిస్తుందన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా చేసిన కార్యక్రమాలు బాగున్నాయని, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు బాగున్నాయని మెచ్చుకున్నారు.
ఇక.. మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. గిరిజనులే స్వాతంత్ర్య పోరాటానికి సారథులని, సంస్కృతికి వారధులని ప్రకటించారు.ఇప్పుడు ప్రపంచం అంతా భారత్ వైపు చూస్తోందని, భారత జాత తలుచుకుంటే త్వరిత గతిన జగద్గురు కాగలిన శక్తి భారత్ కి వుందని చెప్పుకుంటున్నారని అన్నారు. దీనికి కారణభూతులు వనవాసీలేనని, వారి సంప్రదాయాలేనని అన్నారు. స్వాతంత్ర సమరయోధులు అంటే కొంత మందే కనిపిస్తారని, కానీ అసలు స్వాతంత్రాన్ని తెచ్చినవారు గిరిజన యోధులేనని అన్నారు. వారి గురించి అనేక పరిశోధనలు చేసి, ఈ పుస్తకం రచించారని అన్నారు. ఈ విషయాలను, చరిత్రను నేటి తరం పిల్లలకు చెప్పాలని అన్నారు. శివాజీ తన సామర్థ్యాలతో పేరు తెచ్చుకున్నారని, ఆయన వీరోచిత పోరాటాల వెనుక వారి తల్లి వుందని గుర్తు చేశారు.

అలాగే ఈ ప్రశిక్షణలో పాల్గొన్న ఆచార్యులు కూడా పిల్లలకు చెప్పాలని సూచించారు. వనవాసులు పోరాటం సమయంలో అమ్ములను వాడిన విధానం, తుపాకులు వాడిన విధానాన్ని చెప్పాలని సూచించారు.కానీ ఇప్పుడు స్వాతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం లేదన్నారు. వనవాసీల విముక్తి కోసం అనేక చట్టాలున్నాయని, కానీ వాటిని అమలు చేసే పరిస్థితి లేదన్నారు. రాంజీ గోండు లాంటి వనవాసీ యోధులు బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేశారని గుర్తు చేశారు. రాంజీ గోండును బంధించి, ఉరితీయడానికి సహకరించిన ఆనాటి నిజాంను బ్రిటీషర్లు చాలా గౌరవించారని, స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదు ప్రదానం చేశారని తెలిపారు. అలాగే బ్రిటీషర్లు అప్పును కూడా మాఫీ చేశారని, అలాగే కర్నాటకలో వున్న ఓ జిల్లాను నిజాం ఎస్టేట్ లో కలిపారని అన్నారు. కానీ వనవాసీ వీరులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరిచిపోమని అన్నారు. ఇప్పటికీ ఇండోనేషియాలో భారతీయ సంస్కృతి వుందని, అక్కడి వారు ఈ సంస్కృతినే ఆచరిస్తారని అన్నారు.

ఇక.. గిరిజనులకు అనేక ఆస్తులున్నాయని, కానీ అన్యాక్రాంతమయ్యాయని వాపోయారు. తిరిగి వారికి అప్పజెప్పాలని, అడవిలో వున్న ప్రతి ఉత్పత్తి గిరిజనులదేనని రాజ్యాంగంలో కూడా వుందన్నారు. ఇప్పుడున్న వనవాసీ పిల్లలకు అప్పటి చరిత్రను తెలియజేసి, వారిని శక్తిమంతులుగా తయారు చేయాలని విద్యాసాగర్ రావు సూచించారు. ఏ గిరిజన ప్రాంతంలో అయినా.. ఇక్కడున్న చట్టం వల్ల ప్రాథమిక హక్కులు అన్యాక్రాంతమైతే.. వెంటనే గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చి, వాటిని రద్దు చేయవచ్చని, కేంద్రం ఇచ్చిన వాటిని కూడా రద్దు చేసే అవకాశం వుందని విద్యాసాగర్ రావు అన్నారు.