వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో చెంచు గిరిజనుల సామూహిక వివాహాలు
వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో అక్టోబర్ 30న అచ్చంపేటలో 140 మంది చెంచు గిరిజన జంటల సామూహిక వివాహాలు ఘనంగా జరిగాయి.
నల్లగొండ, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాల 7 మండలాల నుండి 38 గ్రామాలకు చెందిన 140 జంటల వివాహం అచ్చంపేటలో వైభవోపేతంగా జరిగింది.
ఈ వివాహ వేడుకలో స్థానిక నాగర్ కర్నూల్ ఎంపీ రాములుతో పాటు హైదరాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్‌లకు చెందిన పలువురు సామాజిక కార్యకర్తలు, సంఘ పెద్దలు పాల్గొన్నారు. చెంచు గ్రామాలకు చెందిన 2000 ప్రజలు పాల్గొన్నారు. 12 మంది పురోహితులు పాల్గొని సాంప్రదాయబద్దంగా సవివరంగా వివాహం జరిపించారు.
ఈ మహోన్నత కార్యక్రమానికి ప్రముఖ ధార్మిక, సామాజిక ప్రవచనకారులైన బ్రహ్మశ్రీ గరికపాటి నర్సింహారావుగారి ఆశీః ప్రసంగంలో హిందూ వివాహ ప్రాశస్త్యం, మన శ్రేష్ఠ జీవన వ్యవస్థ, దంపతుల అన్యోన్యత, కుటుంబ వ్యవస్థల గూర్చి, చెంచుల ఆరాధ్య దైవాలైన శ్రీశైల మల్లికార్జునుడు, అహోబిల నర్సింహస్వామి, భక్త కన్నప్పల గూర్చి వివరించారు. అందరూ వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆదర్శ జీవనం సాగిస్తూ వికాసం చెందా లని ప్రభోదించారు. 140 జంటల కళ్యాణ మహో త్సవం తిలకించి పార్వతీ పరమేశ్వరుల దివ్య రూపాలు దర్శించినట్లుగా వారు పులకించి పోయారు.
అనంతరం వనవాసీ కళ్యాణాశ్రమ్ జాతీయ మార్గదర్శకులు శ్రీ పొన్నపల్లి సోమయాజులు గారు ప్రసంగిస్తూ వనవాసుల్లో కళ్యాణాశ్రమ్ చేస్తున్న సేవా కార్యక్రమాల గూర్చి వివరించారు.