‘వనవాసీ వీరుల త్యాగం చిరస్మరణీయం’

స్వరాజ్య సమరంలో వనవాసీ వీరుల త్యాగం, ధైర్య సాహసాలు వర్తమానంతో పాటుగా భావితరాలకు ఆదర్శనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. దేశ పరిరక్షణ ప్రతి ఒక్కరిగా బాధ్యత అని వారు అన్నారు. ఆగస్ట్‌ 9 అంతర్జాతీయ వనవాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా వనవాసీ కళ్యాణ్‌ పరిషత్‌ – తెలంగాణ, జాతీయ షెడ్యుల్డ్‌ తెగల కమిషన్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన టీచర్లు, రీసెర్చ్‌ స్కాలర్లు, విద్యార్థులు భాగ్యనగరంలోని ఉస్మానియా విశ్వ విద్యాలయ ప్రాంగణంలోని ఠాగూర్‌ ఆడిటోరియం వద్ద నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తూ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపు కుంటున్న సందర్భంగా వనవాసీ మహిళ దేశానికి రాష్ట్రపతి కావడం యావత్‌ దేశ ప్రజలు చిరస్మరణీయంగా చేసుకోవాల్సిన ఘట్టమని అన్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆరు వనవాసీ గ్రామాలను తాము దత్తత చేసుకున్నట్టు వారు తెలిపారు. వనవాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం రాజ్‌భవన్‌ అనేక కార్యక్రమాలు చేపడుతున్నదని డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలకు అతలాకుతలమైన భద్రాచలం, నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో ముంపునకు గురైన వనవాసీ ప్రాంతాలను తాము సందర్శించినట్టు గవర్నర్‌ తెలిపారు.

వనవాసీ కళ్యాణ్‌ పరిషత్‌ అందిస్తున్న సేవలను గురించి ప్రస్తావిస్తూ తమిళనాడులో ఉన్న కాలంలో వనవాసీ కళ్యాణ్‌ పరిషత్‌ సేవా కార్యక్రమాల్లో తాము పాల్గొన్నట్టు తమిళిసై సౌందరరాజన్‌ చెప్పారు. ఇదే సందర్భంగా 30 సంవత్సరాల క్రితం తాము తమిళనాడులో హౌస్‌ సర్జన్‌ చేస్తుండగా తంజా వూరులోని ఆసుపత్రిలో ఒక రోగి కోసం రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు (ఆర్‌ఎస్‌ఎస్‌) కార్యకర్తలు ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా రక్తదానం చేసిన ఘట్టాన్ని తెలంగాణ గవర్నర్‌ ఎంతో భావోద్వేగంతో సభికులకు వివరించారు. రక్తదానం చేయడానికి రోగి బంధువులు నిరాకరించి నప్పుటికీ.. మానవ సేవే మాధవసేవ అన్న నానుడిని నిజం చేస్తున్నట్టుగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు ముందుకు వచ్చారని సభికుల హర్షధ్వానాల మధ్య వారు తెలిపారు.

ఈ సందర్భంగా స్వరాజ్య సమరంలో కీలకమైన పాత్ర పోషించిన వనవాసీ అమర వీరులను డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్మరించుకున్నారు. ప్రధాన మంత్రి మోదీ చొరవతో త్వరలో తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్నదని వెల్లడిరచారు. వనవాసీల కారణంగానే అడవులు ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గమనంలోకి తీసుకోవాలని గవర్నర్‌  తెలిపారు. పలు స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంతో అనీమియా లాంటి వ్యాధుల నుంచి వనవాసీలకు విముక్తి కలిగించడంలో రాజ్‌భవన్‌ చురుకైన పాత్ర పోషిస్తున్నదని వారు  చెప్పారు.

సభికుల్లో అత్యధికులైన విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్‌ గారు ప్రసంగిస్తూ వనవాసీ అమర వీరులు ముఖ్యంగా ఒకవైపు ఆంగ్లేయులతోనూ మరోవైపు నిజాం పాలకులతోనూ ఏకకాలంలో స్వరాజ్య సమరం సాగించిన వనవాసీ వీరుల త్యాగ చరితను, ఘనతను తెలుసుకోవడంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రతి ఇంటిలోనూ త్రివర్ణపతాకం రెపరెపలాడేలా విద్యార్థులు పూనుకోవాలని గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన సామాజిక సమరసత మంచ్‌ కన్వీనర్‌ శ్రీ అప్పాల ప్రసాద్‌ ప్రసంగిస్తూ వనవాసీలను ప్రధాన జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంలో వనవాసీ కళ్యాణ పరిషత్‌ విశేషమైన కృషి చేస్తున్నదని తెలిపారు. మానవ జీవనంలో వనవాసీల ప్రాధాన్యతను గుర్తెరిగిన ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదవ తేదీని అంతర్జాతీయ వనవాసీ దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించిందని శ్రీ అప్పాల ప్రసాద్‌ చెప్పారు. భారతదేశంలో 10 కోట్ల మంది వనవాసీలు ఉండగా ప్రపంచ వ్యాప్తంగా 600 తెగలకు చెందిన వారి సంఖ్య 45 కోట్లుగా ఉందని వారు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *